ఈ రెండింటి మధ్యే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పోటీ
రాహుల్‌గాందీకి సీఎం రేవంత్ ఇస్తున్న ముడుపులకు బీజేపీ అండ
తెలంగాణలో బీజేపీ ఎంపీ రమేశ్‌కు రూ.1,300 కోట్ల కాంట్రాక్టు
బీజేపీ ఎంపీలతో కలిసి సీఎం అర్ధరాత్రి అమిత్ షాను కలుస్తున్నారు
హైదరాబాద్‌లో మేం చేసిన అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధం
నాపై, రేవంత్‌పై ఏసీబీ కేసులు ఉన్నాయి. వాటిపై లై డిటెక్టర్ పరీక్షకు సిద్ధమా?
విధిలేని పరిస్థితుల్లోనే రేవంత్‌రెడ్డిని రాహుల్‌గాంధీ భరిస్తున్నారు
కాళేశ్వరంపై విచారణకు సీఐడీ, ఏసీబీ లేవా.. సీబీఐ కేసు పెట్టి ఏం పీకుతారు
‘సాక్షి’తో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గడపగడపకూ వెళ్లి ప్రజలకు వాస్తవాలు వివరిస్తూ కాంగ్రెస్ చేతిలో మరోమారు మోసపోవద్దని చెప్తున్నాం.ఈ ఎన్నికలు బీఆర్‌ఎస్ పదేళ్ల అభివృద్ధి.. రెండేళ్ల కాంగ్రెస్ అరాచకానికి నడుమ పోటీ అని చెప్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తూ గణాంకాలను ప్రజల ముందు పెడుతున్నాం. ప్రజల మద్దతు కూడగట్టి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడంతో పాటు మిగిలిన మూడేళ్లు ప్రజల కోసం పనిచేసేలా ఒత్తిడి తెస్తాం.
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సంక్షేమ పథకాలకు డబ్బులు లేవంటూనే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఢిల్లీలో కాంగ్రెస్ నేత రాహుల్‌గాందీకి రూ.వేలకోట్ల ముడుపులు ముట్టజెపుతున్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు విమర్శించారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో హైదరాబాద్‌లో జరిగిన అభివృద్ధికి జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో రెండుసార్లు, 2023 శాసనసభ ఎన్నికల్లో నగరంలో బీఆర్‌ఎస్ గెలుపే నిదర్శనమని పేర్కొన్నారు. తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్ జాయింట్ వెంచర్ సర్కారు నడుస్తోందని ఆరోపించారు. హైదరాబాద్ అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు..
సాక్షి: సీఎం రేవంత్, బీజేపీ నడుమ బంధం అంటూ మీరు ఏ ఆధారాలతో విమర్శలు చేస్తున్నారు?
కేటీఆర్: రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ జాయింట్ వెంచర్ సర్కారు నడుస్తోంది. ఓ వైపు సంక్షేమ పథకాలకు డబ్బులు లేవంటూనే ఢిల్లీలో రాహుల్‌గాందీకి రేవంత్ రూ.వేల కోట్ల ముడుపులు ఇస్తున్నారు. అందుకు బీజేపీ కూడా సహకరిస్తోంది. అందుకే బీజేపీ ఎంపీ సీఎం రమేశ్‌కు తెలంగాణలో రూ.1,300 కోట్ల కాంట్రాక్టు దక్కింది. హర్యానా, మహారాష్ట్ర, బిహార్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు తెలంగాణ నుంచి రేవంత్ నిధులు పంపుతుంటే బీజేపీ ఎందుకు వదిలేస్తోంది? రేవంత్ తన రాజకీయ ఎదుగుదల కోసం ఏ పార్టీని అయినా వాడుకుంటారు. ఏబీవీపీ నుంచి మొదలై బీఆర్‌ఎస్, టీడీపీ, కాంగ్రెస్ మీదుగా సాగుతున్న ఆయన ప్రయాణం వచ్చే రెండేళ్లలో తిరిగి బీజేపీకి చేరుకుంటుంది. రేవంత్ వైఖరితో రాహుల్ గాంధీ అసంతృప్తితో ఉన్నారు కాబట్టే అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వడం లేదు. బీజేపీ ఎంపీలతో కలిసి రేవంత్ అర్ధరాత్రి అమిత్ షాను కలుస్తున్నారు. విధిలేని పరిస్థితుల్లో రేవంత్‌ను రాహుల్ భరిస్తున్నారు.
సాక్షి: పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో హైదరాబాద్‌లో కనీసం చెత్త కుప్పలు కూడా తీయలేదన్న సీఎం రేవంత్ విమర్శలపై మీ స్పందనేంటి?
కేటీఆర్: హైదరాబాద్ నగరానికి మేము ఏం చేయకపోతే రెండుసార్లు జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు మాకు ఎందుకు జై కొడుతారు? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓటమి ఖాయం కావడంతో కాంగ్రెస్‌కు వణుకు పుడుతోంది. సీఎం రేవంత్ అసహనంతో మాట్లాడుతున్నారు. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని సొంత గడువు పెట్టుకున్న కాంగ్రెస్.. ఏడు వందల రోజులు కావస్తున్నా ఒక్కటీ నెరవేర్చలేదు. కాంగ్రెస్‌కు మరోమారు ఓటేస్తే రాష్ట్రాన్ని అడుగు పట్టించడం ఖాయం. నేను మంత్రిగా పదేళ్లలో హైదరాబాద్ అభివృద్ధికి ఏం చేశానో బహిరంగ చర్చకు సిద్ధం. రేవంత్ జూబ్లీహిల్స్ ప్యాలెస్‌లో అయినా చర్చకు సిద్ధమే. దమ్ముంటే సీఎం చర్చకు రావాలి. పేమెంట్ కోటా సీఎం రేవంత్ తనకు తాను ఎక్కువగా ఊహించుకుని మమ్మల్ని దూషిస్తే ధీటుగా సమాధానం చెప్తాం.
సాక్షి: ఫార్ములా ఈ రేసు, కాళేశ్వరం అంశంలో బీఆర్‌ఎస్, బీజేపీ నడుమ బంధాన్ని సీఎం రేవంత్ లేవనెత్తడంపై ఏమంటారు?
కేటీఆర్: ఫార్ములా ఈ రేసు కేసులో నన్ను విచారించేందుకు ప్రభుత్వం గతంలోనే గవర్నర్ అనుమతి తీసుకుంది. ఆ తర్వాతే నా మీద కేసు నమోదు చేశారు. ఈ విషయంలో నన్ను అరెస్టు చేసేందుకు మరోమారు గవర్నర్ అనుమతి అవసరం లేదు. మగాడివైతే ‘ఫార్ములా ఈ’కేసులో నాపై చార్జిïÙటు వేయించు (సీఎంను ఉద్దేశించి). నాతోపాటు సీఎం రేవంత్‌పైనా ఏసీబీ కేసులు ఉన్నాయి. ఈ విషయంలో నేను లై డిటెక్టర్ పరీక్షకు సిద్ధంగా ఉన్నా. సీఎం తన చిత్తశుద్ధి నిరూపించుకోవాలి. పీసీ ఘోష్ కమిషన్ ‘కాళేశ్వరం ప్రాజెక్టు’పై విచారణ పేరిట కొండను తవ్వి ఎలుకను పట్టింది. బీజేపీకి సీబీఐ జేబు సంస్థ అని రాహుల్‌గాంధీ విమర్శిస్తూ ఉంటారు. కానీ రేవంత్ మాత్రం అదే సీబీఐకి కాళేశ్వరం విచారణను అప్పగిస్తారు. రాష్ట్రంలో సీఐడీ, ఏసీబీ వంటి దర్యాప్తు సంస్థలు లేవా? సీబీఐ కేసు పెట్టి ఏం పీకుతాడు. మేము తప్పు చేయలేదు. ఎవరికీ భయపడం.
సాక్షి: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను బీఆర్‌ఎస్ పార్టీ ఎలా భావిస్తోంది?
కేటీఆర్: ఉప ఎన్నికలను తెలంగాణ ఉద్యమంలో సాధనంగా వాడుకుని రాజకీయ పార్టీల డొల్లతనాన్ని బయట పెట్టడంతో పాటు రాజకీయ అనివార్యత సృష్టించి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నాం. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో వచ్చిన ఈ ఉప ఎన్నికలో రెండేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై తీర్పు ఇచ్చే అవకాశం ప్రజలకు వచ్చింది. నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజల తరఫున నాలుగు లక్షల మంది జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఓటర్లు గొంతు వినిపించేందుకు అరుదైన సందర్భం ఇది. బీఆర్‌ఎస్ పదేళ్ల అభివృద్ధి, సంక్షేమానికి.. కాంగ్రెస్ రెండేళ్ల అరాచక, సంక్షోభ, విధ్వంసకర పాలనకు నడుమ పోటీ ఈ ఉప ఎన్నిక. ఈ ఎన్నిక రాష్ట్ర ప్రజల మనోభావాలకు ప్రతీకగా నిలుస్తుంది.
సాక్షి: ఉప ఎన్నిక ప్రచారంలో హైడ్రా కూల్చివేతలనే ఎందుకు ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు?
కేటీఆర్: ఉత్తరప్రదేశ్‌లో బుల్డోజర్ రాజ్యం అంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ విమర్శిస్తారు. కానీ ఇక్కడ హైడ్రా పేరిట పేదల ఇళ్లను రేవంత్ సర్కారు కూల్చివేయటం ఆయనకు కనిపించడం లేదు. సీఎం సోదరుడితో పాటు మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, వివేక్ తదితరుల భవనాలు చెరువుల్లో ఉన్నా హైడ్రా ఎందుకు ముట్టుకోవడం లేదు? మూసీకి అడ్డుగా భారీ బహుళ అంతస్తుల భవనాలు కడుతున్నా హైడ్రాకు కనిపించడం లేదా? ఇళ్లు కూల్చుతూ, మా పార్టీ తరఫున పనిచేస్తున్న చిన్నా చితక వ్యాపారుల దుకాణాలను తొలగిస్తూ దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. దమ్ముంటే రెండేళ్లలో చేసిన అభివృద్ధి ఏమిటో ప్రజలకు వివరించాలి.
సాక్షి: అజహరుద్దీన్‌కు మంత్రి పదవి ఇవ్వడం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ప్రభావం చూపుతుందా?
కేటీఆర్: బీఆర్‌ఎస్ హయాంలో మైనారిటీ వర్గానికి చెందిన మంత్రికి రెవెన్యూ, హోమ్ వంటి కీలక శాఖలు ఇచ్చాం. అజహరుద్దీన్‌కు ఇచ్చేందుకు మైనారిటీ సంక్షేమం తప్ప వేరే శాఖలు లేవా? అజహరుద్దీన్‌కు మంత్రి పదవి ఇచ్చి జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ దింపుడు కల్లం ఆశతో ఉంది. కాంగ్రెస్ లేకపోతే ముస్లింలు, బీజేపీ లేకపోతే హిందువులు ఉండరనుకోవటం ఆ పారీ్టల భావదారిద్య్రం. రేవంత్ మూలంగా రాష్ట్రంలో కాంగ్రెస్ మరో 15 ఏళ్లపాటు తిరిగి లేచే పరిస్థితి ఉండదు. బీజేపీకి ఎంఐఎం పార్టీ బీటీమ్ అని కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ విమర్శిస్తున్నా ఆ పార్టీ ఎందుకో స్పదించడం లేదు.
సాక్షి: రౌడీ షీటర్‌ను కాంగ్రెస్ అభ్యరి్థగా పెట్టారని మీ పార్టీ అధినేత కేసీఆర్ వ్యాఖ్యానించినట్టు వచ్చిన వార్తలపై ఏమంటారు?
కేటీఆర్: కాంగ్రెస్ అభ్యర్థి గురించి మాట్లాడాల్సిన అవసరం కేసీఆర్‌కు లేదు. కానీ రాష్ట్రంలో సీఎం సర్కారు నడుపుతున్నారో.. రౌడీ దర్భారు నడుపుతున్నారో అర్ధం కావడం లేదు. ఫీజు రీయింబర్స్‌మెంటు బకాయిలు అడిగిన ప్రైవేటు విద్యా సంస్థలను విజిలెన్స్ దాడుల పేరిట భయపెడుతున్నారు. ఏరియర్స్ అడిగిన ఉద్యోగులపై ఏసీబీ దాడులు, రిటైర్డు ఉద్యోగులపై కేసులు పెడుతున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ప్రచారం చేస్తున్న మా నాయకుల మీద దాడులు చేస్తూ సీఎం రేవంత్ నీచ రాజకీయం చేస్తున్నారు.
సాక్షి: మీ సోదరి కవితతో విభేదాలు, మీ అధినేత కేసీఆర్ ప్రజాక్షేత్రంలోకి రాకపోవడాన్ని కాంగ్రెస్, బీజేపీ ప్రశ్నిస్తున్నాయి కదా?
కేటీఆర్: కేసీఆర్ తమను ఫుట్‌బాల్ ఆడుకుంటారని బీజేపీ, కాంగ్రెస్‌లకు భయం. ఆ రెండు పారీ్టలకు అభివృద్ధి, సంక్షేమం గురించి తెలంగాణలో ఏం చెప్పాలో తెలియడం లేదు. జూబ్లీహిల్స్‌లో బీజేపీకి డిపాజిట్ కూడా దక్కదు. దీంతో కేసీఆర్, బీఆర్‌ఎస్ లక్ష్యంగా అనేక విమర్శలు చేస్తున్నాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక విషయంలో పార్టీ రాష్ట్ర నాయకత్వాన్ని పిలిచి ప్రచారానికి సంబంధించి దిశా నిర్దేశం చేస్తూ మమ్మల్ని నడిపిస్తున్నారు. కవిత విషయంలో పార్టీ నిర్ణయం తీసుకున్న తర్వాత ఇక ప్రత్యేకంగా మాట్లాడాల్సిన అవసరం లేదని అనుకుంటున్నా.
సాక్షి: జూబ్లీహిల్స్‌లో మీ ప్రచార తీరుతెన్నులు ఎలా ఉన్నాయి?
కేటీఆర్: గడపగడపకూ వెళ్లి ప్రజలకు వాస్తవాలు వివరిస్తూ కాంగ్రెస్ చేతిలో మరోమారు మోసపోవద్దని చెప్తున్నాం. ఈ ఎన్నికలు బీఆర్‌ఎస్ పదేళ్ల అభివృద్ధి.. రెండేళ్ల కాంగ్రెస్ అరాచకానికి నడుమ పోటీ అని చెప్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తూ గణాంకాలను ప్రజల ముందు పెడుతున్నాం. ప్రజల మద్దతు కూడగట్టి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడంతో పాటు మిగిలిన మూడేళ్లు ప్రజల కోసం పనిచేసేలా ఒత్తిడి తెస్తాం.
సాక్షి: జూబ్లీహిల్స్ ప్రచారానికి కేసీఆర్ వస్తారా?
కేటీఆర్: మా అధినేత ఉప ఎన్నిక ప్రచారానికి వస్తారా లేదా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. కథానాయకుడు క్లైమాక్స్‌లోనే వస్తాడు.


