
జస్టిస్ ఘోష్ కమిషన్ ఎదుట హాజరుకానున్న మాజీ సీఎం
సాక్షి, హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు జూన్ 5న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఎదుట హాజరుకానున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలు జరిగాయని అనుమా నిస్తున్న ప్రభుత్వం, వాటిపై విచారణకు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్‌ను నియమించిన విషయం విదితమే. కాగా ఇప్పటికే పలువురు అధికారులను, కాంట్రాక్టు సంస్థలను కమిషన్ విచారించింది. తాజాగా ఈ నెల 20న కేసీఆర్‌తో పాటు మాజీ మంత్రి హరీశ్‌రావు, బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌కు నోటీసులు జారీ చేసింది. జూన్ 5న కేసీఆర్, 6న ఈటల, 9న హరీశ్‌రావు తమ ముందు హాజరు కావాలని సూచించింది.
సమగ్ర నివేదికతో సిద్ధం!
కాళేశ్వరం ప్రాజెక్టుపై దుష్ప్రచారం చేస్తూ గత ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పూరితంగా కమిషన్‌ను ఏర్పాటు చేసిందని బీఆర్‌ఎస్ ఆరోపిస్తూ వస్తోంది. తాజాగా గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైనదేననే వాదన స్వయంగా వినిపించాలని కేసీఆర్ భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఉమ్మడి రాష్ట్రంలో సాగు నీటి ప్రాజెక్టులు మొదలుకుని కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం వరకు ప్రభుత్వాలు చేసిన ప్రయత్నాలు, పనులు, వెచ్చించిన నిధులు, సమకూరిన ప్రయోజనం తదితర అంశాలన్నింటినీ కమిషన్ ముందు పెట్టేందుకు కేసీఆర్ సన్నద్ధమవుతున్నట్లు తెలిసింది.
ఈ మేరకు ఒక వివరణాత్మక నివేదికను కూడా కేసీఆర్ సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. ఉమ్మడి రాష్ట్రంలో అనుమతులు లేకుండానే ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు పనులు ప్రారంభించడం, మహారాష్ట్రతో ఒప్పందం లేకుండా ప్రాజెక్టును ప్రకటించడం, కాంట్రాక్టు సంస్థలకు మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇచ్చిన వైనాన్ని కూడా కమిషన్ ముందు పెట్టాలని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలిసింది.
కాళేశ్వరం ప్రాజెక్టులో రూ.లక్ష కోట్ల అవినీతి అంటూ ఆరోపణలు చేసిన వారికి.. ఆధారాలు ఇవ్వాల్సిందిగా కోరుతూ కమిషన్ ఎందుకు నోటీసులు ఇవ్వడం లేదనే అంశాన్ని కూడా కేసీఆర్ లేవనెత్తే అవకాశముందని తెలుస్తోంది. మేడిగడ్డ బరాజ్ కేవలం కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక భాగం కాగా, మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు పనికిరాదంటూ ప్రభుత్వం చేస్తున్న వాదనలపైనా కేసీఆర్ కమిషన్‌కు వివరణ ఇస్తారని బీఆర్‌ఎస్ వర్గాలు వెల్లడించాయి. కమిషన్ విచారణకు హాజరుకానున్నట్టు ఈటల రాజేందర్ ఇప్పటికే ప్రకటించగా, కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా హరీశ్‌రావు విచారణకు హాజరుపై నిర్ణయం తీసుకునే అవకాశముంది.
యూకే, అమెరికా పర్యటనకు కేటీఆర్
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు మంగళవారం ఉదయం యూకే, అమెరికా పర్యటనకు బయలుదేరి వెళ్లారు. కేటీఆర్ ఈ నెల 30న యూకేలోని వార్విక్ యూనివర్సిటీ సైన్స్ పార్క్‌లోని రీసెర్చ్ సెంటర్‌లో ప్రాగ్మాటిక్ డిజైన్ సొల్యూషన్స్ లిమిటెడ్ సంస్థ కొత్త నాలెడ్జ్ పార్క్‌ను ఆవిష్కరిస్తారు. లండన్‌లో జరిగే ఇతర కీలక కార్యక్రమాల్లోనూ ఆయన పాల్గొంటారు. అనంతరం అమెరికాకు చేరుకుని జూన్ 1న డల్లాస్‌లో జరిగే పార్టీ రజతోత్సవ సభ, 2న జరిగే రాష్ట్ర అవతరణ వేడుకల్లో పాల్గొంటారు.
జూన్ 6న తిరిగి హైదరాబాద్‌కు చేరుకోవాల్సి ఉండగా, కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ ఎదుట హాజరు కావాలనుకుంటున్న నేపథ్యంలో జూన్ 4నే ఆయన నగరానికి వస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. మరోవైపు ఫార్ములా ఈ రేసు కేసులో విచారణకు హాజరు కావాల్సిందిగా కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. కాగా తాను అమెరికా పర్యటన నుంచి వచ్చిన తర్వాత విచారణకు హాజరవుతానని తెలుపుతూ ఆయన ఏసీబీకి లేఖ రాశారు. జూన్ రెండో వారంలో కేటీఆర్ విచారణకు హాజరయ్యే అవకాశముంది.