ఇక సంపూర్ణ ‘మహా’ నిమజ్జనం

Khairatabad Ganesh Nimajjanam Complete in Under 11 AM - Sakshi

ఖైరతాబాద్‌ గణపతి ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు

ఉదయం 11.30 కల్లా నిమజ్జనం పూర్తి

విగ్రహం పూర్తిగా నీటిలో నిమజ్జనం అయ్యేలా చర్యలు

మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, మేయర్‌ రామ్మోహన్‌ వెల్లడి

ఖైరతాబాద్‌: ఎప్పటి మాదిరిగానే ఈ ఏడాది కూడా ఖైరతాబాద్‌ మహాగణపతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం తరపున అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్, మేయర్‌ రామ్మోహన్‌లు వెల్లడించారు. ఈ సంవత్సరం నిమజ్జనం సందర్భంగా ఖైరతాబాద్‌ మహాగణపతిని సాగర్‌లో పూర్తిగా నిమజ్జనం అయ్యే విధంగా ప్రత్యేక ఏర్పాట్లు చేపడుతున్నామన్నారు. అలాగే ఉదయం 11.30 కల్లా మహాగణపతి నిమజ్జన ఘట్టం పూర్తవుతుందన్నారు. సోమవారం వీరు ఎమ్మెల్యే దానం నాగేందర్, జీహెచ్‌ఎంసీ సెంట్రల్‌ జోన్‌ కమిషనర్‌ ముషారఫ్‌ ఫారుకీ, సెంట్రల్‌ జోన్‌ డీసీపీ విశ్వప్రసాద్‌తో పాటు వివిధ శాఖల అధికారులతో కలిసి మంత్రి ఖైరతాబాద్‌ మహాగణపతి పరిసర ప్రాంతాల్లో పర్యటించారు. ఏర్పాట్లపై మంత్రి సమీక్షించారు.  ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ 65 సంవత్సరాల చరిత్ర ఉన్న ఖైరతాబాద్‌ మహాగణపతిని దర్శించుకునేందుకు వచ్చే లక్షలాది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆర్‌అండ్‌బి, వాటర్‌వర్క్స్, ఇంజనీరింగ్, హెల్త్, జీహెచ్‌ఎంసీ, విద్యుత్‌ తదితర శాఖల సాయంతో ఏర్పాట్లు చేపడతామని తెలిపారు. సెన్సేషన్‌ థియేటర్, ఖైరతాబాద్‌ రైల్వేగేటు, మింట్‌ కాంపౌండ్‌ రోడ్లను వినాయక చవితి లోపు ఆధునీకరించాలని నిర్ణయించామని తెలిపారు. అన్ని వైపులా ఎల్‌ఈడీ విద్యుత్‌ దీపాలను కూడా ఏర్పాటుచేస్తున్నట్లు తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్‌ వినతి మేరకు ఉత్సవాల 9 రోజులు మహాగణపతి ప్రాంగంలో కల్చరల్‌ డిపార్ట్‌మెంట్‌ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా స్టేజ్‌ ఏర్పాటుచేసి సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటుచేస్తున్నట్లు ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. ట్రాఫిక్, లా అండ్‌ ఆర్డర్‌ ఆధ్వర్యంలో ట్రాఫిక్‌కు, ఇతరత్రా ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని సూచించారు.

పూర్తిగా నిమజ్జనం చేస్తాం....
ప్రతీ సంవత్సరం ఖైరతాబాద్‌ మహాగణపతి నిమజ్జనం అయిన నాలుగైదు రోజుల తర్వాత కూడా నీటిలో సగం తేలుతూ కనిపిస్తుందని, ఈ సంవత్సరం అలా కాకుండా ప్రత్యేకంగా నిపుణుల పర్యవేక్షణలో మహాగణపతి పూర్తిగా నిమజ్జనం అయ్యేవిధంగా చూస్తామని తెలిపారు. ఇందుకు సాగర్‌లో నిమజ్జనం గావించే ప్రాంతాల్లో లోతైన ప్రాంతాన్ని గుర్తించామని మంత్రి వెల్లడించారు. నిమజ్జనాన్ని వీక్షించేందుకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా డీజీపీ, సీపీ ఆధ్వర్యంలో ఏరియల్‌ సర్వే ఉంటుందని, విద్యుత్‌ సరఫరా విషయంలో అధికారులు అలర్ట్‌గా ఉంటారన్నారు.

మహాగణపతి నిమజ్జనం 11.30 లోపే పూర్తి
ఖైరతాబాద్‌ మహాగణపతి నిమజ్జనాన్ని వీక్షించేందుకు లక్షలాది మందికి ఆసక్తి ఉంటుందని..అందుకే ఈ సంవత్సరం కూడా నిమజ్జనాన్ని ఉదయం 11.30 లోపే పూర్తిచేస్తామని, ఇందుకు భాగ్యనగర్‌ గణేష్‌ ఉత్సవ కమిటీ, ఖైరతాబాద్‌ ఉత్సవ కమిటీ అంగీకరించాయని మేయర్‌ బొంతు రామ్మోహన్‌ తెలిపారు. ప్రత్యేకంగా డ్రోన్‌ టెక్నాలజీ సాయంతో మహాగణపతి నిమజ్జనం పూర్తిగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. మహాగణపతి ప్రాంగణంలోని రోడ్లన్నీ వైట్‌ టాపింగ్‌ రోడ్లుగా ఆధునీకరిస్తామని తెలిపారు. గత సంవత్సరం 33 వేల వినాయక విగ్రహాలు ఉంటే ఈ సంవత్సరం మరింత పెరిగే అవకాశముందన్నారు. ఈ సంవత్సరం నిమజ్జనంకోసం ఇప్పటికే 33 చెరువుల్లో అన్ని ఏర్పాట్లు చేశామని, 29 వినాయక పాండ్స్‌ కూడా పూర్తిచేసినట్లు మేయర్‌ తెలిపారు. పర్యవేక్షక పర్యటనలో సైఫాబాద్‌ ఏసీపీ వేణుగోపాల్‌రెడ్డి, డి.ఐ నర్సింలు, జీహెచ్‌ఎంసీ సెంట్రల్‌ జోన్‌ డీఎంసీ గీతారాధిక, ఎఎంఓహెచ్‌ భార్గవర్‌ నారాయణ, జీహెచ్‌ఎంసీ ఎఈ శరత్‌బాబు, ఈఈ నర్సింగ్‌రావు, డీఈ విజయకుమార్, ఖైరతాబాద్‌ ఎమ్మార్వో కృష్ణకుమార్, విద్యుత్‌ ఎఈ నర్సింహ్మస్వామి, డీఈ వెకంటయ్య, ఏడీఈ రమేష్, ఏఈ గంగారాం, గణేష్‌ ఉత్సవ కమిటీ అధ్యక్షులు సింగరి సుదర్శన్,  భాగ్యనగర్‌ గణేష్‌ ఉత్సివ కమిటీ నాయకులు భగవంతరావు, స్థానిక నాయకులు మహేందర్‌బాబు, చందు, ప్రవీణ్‌ తదితరులు పాల్గొన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top