రాయిలాంటి నన్ను సానబెట్టారు : కేసీఆర్‌

kcr speach in World Telugu Conference - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ అద్భుత సాహిత్యం పండించిన మాగాణి అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. ప్రపంచ మహాసభల సందర్భంగా ఆయన అధ్యక్ష స్థానంలో మాట్లాడుతూ పదో శతాబ్దంలోనే తొలిసారి జినవల్లబుడి శాసనంలో తెలుగు కందపద్యం ఉందన్నారు. పాల్కురికి సోమన, పోతన, రామదాసు, సురవరం ప్రతాపరెడ్డి, దాశరథి, కాళోజీ, సినారె, సుద్దాల హనుమంతు, అందెశ్రీ, గోరటి వెంకన్న, జయరాజువంటి ఎంతో మంది సాహిత్య కారులను అందించి మాగాణి తెలంగాణ అని చెప్పారు. ఎన్నో పద్యాలు పాడి అలరించారు.

'ఎంత గొప్పవారైనా అమ్మ ఒడే తొలిబడి.. చనుబాలు తాగించే తల్లి జో అచ్చుతానంద జోజోముకుందా అంటూ ఓ బిడ్డను ఆదర్శ బిడ్డగా తీర్చిదిద్దుతుంది. తన బిడ్డను ప్రపంచానికి పరిచయం కాకుండా ప్రపంచాన్ని కూడా బిడ్డకు పరిచయం చేస్తుంది. బంధువర్గాన్ని తెలిపే తొలి గురువు తల్లి. మా అమ్మగారు నేను చిన్నతనంలో ఉండగా నాకు చక్కటి పద్యాలు చెప్పారు. మేం చదివే రోజుల్లో అయ్యవారి బడే ఉండేది.

అక్కడ నుంచే గురువుల విద్య ప్రారంభం అయ్యేది. అందులో నీతి ఎక్కువ ఉండేది. మా స్వగ్రామానికి చెందిన దుబ్బాక గ్రామంలో మృత్యుంజయ శర్మ ఒక పద్యం చెబితే ఐదుసార్లు చదివి అప్పగించాను. రాయి లాంటి నన్ను మా గురువుగారు సాన బెట్టారు. వారి పుణ్యమా అని తొమ్మిదో తరగతిలోనే చెరువుగట్టుపై వృత్తపద్యాలు రాసిన. బమ్మెర పోతన అద్భుత భాగవతం అందించారు. ఎంతోమంది కవులు గొప్పగొప్ప సాహిత్యం అందించారు. నేటి కవుల్లో గోరటి వెంకన్న పాట ఎలా ఉంటుందో అందరికీ తెలుసు.. చక్కటి పదాలతో కష్టమైన విషయాలు కూడా అలవోకగా ఆయన చెప్పగలరు.

అమ్మ అంటే కడుపులో నుంచి వచ్చినట్లుంటుంది. మమ్మీ అంటే పెదవుల నుంచి వచ్చినట్లుంటుందని మన ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడుగారు ఎన్నో సభల్లో చెప్పారు. ఒకప్పుడు బతకలేక బడి పంతులు అన్నారు. ఇప్పుడు దేశాన్ని బతికించేవారు బడి పంతులు. సమాజం భవిష్యత్తు పంతుల్ల చేతుల్లోనే ఉంది. తెలుగు భాష బతకాలంటే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భాష పండితులు నడుంకట్టాలి. ఒక భాషా పండితుడు మరో భాషా పండితుడిని తయారు చేయాలి. ఓ కవి మరో కవిని తయారు చేయాలి. తెలుగు భాషను బతికించుకోవడం కోసం ప్రభుత్వం అన్నిరకాలుగా సహాయం చేస్తుంది' అని కేసీఆర్‌ హామీ ఇచ్చారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top