
శుక్రవారం ఎల్బీ స్టేడియంలో జరిగిన కాంగ్రెస్ సమ్మేళనంలో కార్యకర్తలకు అభివాదం చేస్తున్న ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సీఎం రేవంత్‌రెడ్డి
ఆపిందెవరో మోదీ ప్రభుత్వం చెప్పాలి
పాక్ పీచమణిచే అవకాశాన్ని చేజేతులా కోల్పోయారు
ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ధ్వజం
పహల్గాం ఘటనపై కేంద్రానికి దేశం యావత్తు అండగా నిలిచింది
రాజకీయ పార్టీలు కూడా మోదీకి మద్దతుగా గొంతు కలిపాయి
కీలక సమయంలో చేతులు ఎత్తేయడమే మోదీకి చేతనవుతుంది
మోదీ మాదిరి అప్పట్లో ఇందిరా గాంధీ భయపడలేదు
కాంగ్రెస్ గ్రామాధ్యక్షులు, కార్యకర్తల సమ్మేళనంలో ప్రసంగం
ప్రజా ప్రభుత్వం పథకాలు దేశానికే రోల్‌మోడల్: సీఎం రేవంత్
వచ్చే ఎన్నికల్లో 100 ఎమ్మెల్యే, 15 ఎంపీ సీట్లు గెలిచి అధిష్టానానికి
బహుమతిగా ఇచ్చేందుకు కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్య
సాక్షి, హైదరాబాద్: పాకిస్తాన్‌పై యుద్ధాన్ని ఆకస్మికంగా ఎందుకు ఆపేశారో, అసలు ఆపిందెవరో దేశ ప్రజలకు మోదీ ప్రభుత్వం చెప్పాలని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే డిమాండ్ చేశారు. పహల్గాం ఘటనపై దేశం యావత్తు కేంద్ర ప్రభుత్వానికి అండగా నిలిచిందని చెప్పారు. దేశంలోని అన్ని రాజకీయపార్టీలు మోదీకి మద్దతు ఇస్తూ యుద్ధం చేయాలంటూ గొంతు కలిపాయని గుర్తుచేశారు. అయినా యుద్ధం కొనసాగించకుండా అర్ధాంతరంగా నిలిపివేయడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు.
దేశానికున్న బలగంతో వీరోచితంగా పోరాడి పాక్ పీచమణిచి పీఓకేను స్వాదీనం చేసుకునే అవకాశాన్ని చేజేతులా కోల్పోవడం అత్యంత దురదృష్టకరమంటూ ఖర్గే ధ్వజమెత్తారు. జబ్బలు చరుచుకునే మోదీ కి కీలక సమయంలో చేతులు ఎత్తేయడమే చేతనవుతుందని విమర్శించారు. దేశరక్షణ, సైనికులపై ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి గైర్హాజరు కావడం ఆయన దేశభక్తికి నిదర్శనమని ఎద్దేవా చేశారు. శుక్రవారం ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు, కార్యకర్తల సమ్మేళనానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు.
మోదీ మణిపూర్ ఎందుకు వెళ్లలేదు?
‘గంభీరంగా కనిపిస్తున్నట్లు నటించే మోదీ నిజానికి అత్యంత భయస్తుడు. ప్రధాని మోదీ ఇప్పటివరకు 42 దేశాల్లో పర్యటించారు. కానీ స్వదేశంలో అగి్నగుండంగా మారిన మణిపూర్‌కు మాత్రం వెళ్లలేదు. మణిపూర్ భారత్‌కు అత్యంత కీలకమైన ప్రదేశం. అక్కడ జరుగుతున్న ఆందోళనలను పరిశీలించేందుకు నేను, రాహుల్‌గాంధీ వెళ్లాం. బాధితులను పరామర్శించాం. మరి మోదీ ఎందుకు మణిపూర్ వెళ్లలేదు? వారు దేశ పౌరులు కాదా? దేశ ప్రజలను పట్టించుకోకుండా ప్రపంచ దేశాలు తిరుగుతూ దేశ ప్రజలను మోదీ రోడ్లపై వదిలేశారు. మోదీ మాదిరి అప్పట్లో ఇందిరాగాంధీ భయపడలేదు. బంగ్లాదేశ్‌కు స్వాతంత్య్రం కల్పిస్తామని చెప్పి చేసి చూపించారు..’ అని ఖర్గే చెప్పారు.
కాంగ్రెస్ సర్కారు వచ్చాకే అందరికీ అభివృద్ధి ఫలాలు
‘కార్యకర్తల కృషితోనే తెలంగాణలో పార్టీ అధికారంలోకి వచ్చింది. కార్యకర్తలే కాంగ్రెస్ పార్టీకి ఆత్మ. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నందున రాష్ట్రంలో కూడా బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని చేసిన ప్రచారాన్ని కాంగ్రెస్ కార్యకర్తలు తిప్పికొట్టారు. రాహుల్‌గాంధీ పాదయాత్ర సమయంలోనే కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని అర్థమైంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతే అన్ని వర్గాలకు అభివృద్ధి ఫలాలు అందుతున్నాయి. కీలక రంగాలు అద్భుతంగా పనిచేస్తున్నాయి. ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు, రైతుభరోసా, రుణమాఫీ లాంటి ఎన్నో పథకాలు అమల్లోకి వచ్చాయి. ఇవన్నీ ప్రజలకు చెప్పి ఓట్లు అడగాలి.
రాజ్యాంగం నుంచి లౌకిక పదాన్ని తొలగించలేరు..
హైదరాబాద్‌లోని కేంద్ర ప్రభుత్వ సంస్థలు దాదాపు 50కి పైగా కాంగ్రెస్ పాలనలో ఏర్పడ్డాయి. మరి మోదీ ప్రభుత్వం హైదరాబాద్‌కు ఏమిచ్చిందో చెప్పాలి. నల్లధనం తెచ్చి ప్రతి వ్యక్తికి రూ.15 లక్షలు ఇస్తానన్న మోదీ ఆ తర్వాత ఆ ఊసే ఎత్తడం లేదు. మోదీ, అమిత్‌షా అబద్ధాలు చెప్పి ప్రజలను పిచ్చోళ్లను చేస్తున్నారు. సెక్యులర్ అనే పదం రాజ్యాంగంలో లేదని బీజేపీ చెప్తోంది. కానీ రాజ్యాంగం నుంచి లౌకిక అనే పదాన్ని తీసేయలేరు. సెక్యులర్ అనే పదంతో ఇబ్బందిగా ఉంటే బీజేపీ పార్టీ ప్రణాళిక నుంచి ఆ పదం తొలగించి చూపించాలి..’ అని ఖర్గే సవాల్ చేశారు.
కాంగ్రెస్‌కు కార్యకర్తలే బ్రాండ్ అంబాసిడర్లు: సీఎం
‘తెలంగాణలో అధికార మదంతో తమకు తిరుగులేదనే అహంకారంతో ఉన్న బీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని కూలదోసి ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఘనత కాంగ్రెస్ కార్యకర్తలకే దక్కుతుంది. కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలే బ్రాండ్ అంబాసిడర్లు. కార్యకర్తల కృషితో ఏర్పాటైన ప్రజా ప్రభుత్వం..ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నప్పటికీ ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. ప్రభుత్వం ఏర్పాటైన 18 నెలల్లోనే రైతులకు రుణమాఫీ, రైతు భరోసా, సన్న వడ్లకు బోనస్, పేదలకు సన్న బియ్యం, ఇందిరమ్మ ఇళ్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు లాంటి ఎన్నో పథకాలు అమలు చేస్తున్నాం. ఈ పథకాలు దేశానికే రోల్‌మోడల్‌గా నిలుస్తున్నాయి. తెలంగాణ మోడల్ దేశానికే ఆదర్శంగా మారుతోంది. ఈ పథకాలను కేంద్ర ప్రభుత్వం సైతం అమలు చేయాల్సిన పరిస్థితి వస్తోంది..’ అని సీఎం రేవంత్ చెప్పారు.
ప్రభుత్వ పథకాలపై విస్తృత ప్రచారం చేయాలి
‘అద్భుతమైన పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నప్పటికీ వాటిని ప్రచారం చేసుకోవడంలో విఫలమవుతున్నాం. ప్రతి శాఖలో ఒక సంక్షేమ పథకం ఉంది. ఈ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి విస్తృత ప్రచారం కల్పించాల్సిన బాధ్యత కార్యకర్తలపైనే ఉంది. ప్రజా ప్రభుత్వం ప్రతి హామీ అమలు చేస్తుంది. అసెంబ్లీ ఎన్నికలప్పుడు కుల సర్వే హామీ ఇచ్చి అమలు చేసి చూపించాం. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దానిని జనగణనలో చేర్చింది. మహిళా సంఘాలకు ఆర్టీసీలో బస్సులు అద్దెకు ఇప్పించి లాభాలు గడించేలా ప్రోత్సహిస్తున్నాం. సోలార్ పవర్ ప్లాంట్లు, పెట్రోల్‌బంక్‌లు ఏర్పాటు చేయిస్తూ మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దుతున్నాం. కోటిమంది మహిళలను ఎస్‌హెచ్‌జీల్లో చేర్పించి కోటీశ్వరులుగా చేసే బాధ్యత ప్రభుత్వానిదే.
మోదీ, కిషన్‌రెడ్డి, కేసీఆర్ చర్చకు రావాలి
ప్రజా ప్రభుత్వం ఏర్పడిన మొదటి ఏడాదిలోనే 60 వేల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేశాం. 18 నెలల్లో రాష్ట్రానికి రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చాం. వంద నియోజకవర్గాల్లో రూ.20 వేల కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను ఏర్పాటు చేస్తున్నాం. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీలను స్థాపించాం. ఈ విషయాలన్నీ ప్రజలకు వివరించాలి. నిత్యం ప్రజల్లోనే ఉంటూ ప్రభుత్వ పథకాలపై విస్తృత ప్రచారం చేయాలి. ప్రభుత్వం రైతు భరోసా ఇవ్వదంటూ కొందరు వెకిలిగా వ్యాఖ్యానించారు. కానీ 9 రోజుల్లోనే రూ.9 వేల కోట్ల రైతు భరోసా అందించాం. ఈ అంశంపై మోదీ, కిషన్‌రెడ్డి, కేసీఆర్ చర్చకు రావాలి. రైతులకు ఎవరు మేలు చేశారో అసెంబ్లీ సాక్షిగా చర్చిద్దాం..’ అని ముఖ్యమంత్రి సవాల్ చేశారు.
కార్యకర్తల ఎన్నికలొస్తున్నాయి..
‘రాష్ట్రంలో నియోజకవర్గాల పునరి్వభజనతో అసెంబ్లీ స్థానాలు పెరుగుతాయి. వచ్చే ఎన్నికల్లో 100 అసెంబ్లీ, 15 పార్లమెంటు స్థానాల్లో విజయం సాధించి అధిష్టానానికి బహుమతి ఇచ్చేందుకు కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు. స్టేజిమీద ఉన్న నాయకుల ఎన్నికలు అయ్యాయి. ఇప్పుడు కార్యకర్తల ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో విజయం సాధించే బాధ్యత కార్యకర్తలపైనే ఉంది. కార్యకర్తల గెలుపు కోసం పూర్తి సహకారం అందిస్తాం. టిక్కెట్ల కోసం ఢిల్లీకి వెళ్లాల్సిన అవసరం లేదు. బీఫామే ఇంటికి వస్తుంది..’ అని సీఎం అన్నారు. కాగా బహిరంగ సభ అనంతరం ఖర్గే బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లారు.