ఆలయం, మసీదులకు కాకతాళీయంగానే నష్టం జరిగింది 

KCR Feels Very Bad For Unfortunately Collapsing Of Masjid - Sakshi

కూల్చివేస్తున్న భవనాల శిథిలాలు వాటిపై పడ్డాయి

ఇలా జరగడం పట్ల ఎంతో చింతిస్తున్నాను : సీఎం కేసీఆర్‌

ప్రభుత్వ ఖర్చుతో ఎక్కువ విస్తీర్ణంలో కొత్తవి నిర్మిస్తాం

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ సెక్రటేరియట్‌ పాత భవనాల కూల్చివేత సందర్భంగా అక్కడున్న దేవాలయం, మసీదులకు కొంత ఇబ్బంది కలగడం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు తన విచారాన్ని, బాధను వ్యక్తం చేశారు. ‘తెలంగాణ రాష్ట్రం సెక్యులర్‌ రాష్ట్రం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ లౌకిక స్ఫూర్తిని కొనసాగిస్తాం. ఇది కాకతాళీయంగా జరిగిన సంఘటన. దీన్ని అందరూ సహృదయంతో అర్థం చేసుకోవాలి’’అని ముఖ్యమంత్రి శుక్రవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో కోరారు. ‘తెలంగాణ సెక్రటేరియట్‌ పాత భవనాలను కూల్చివేసి, కొత్త భవన సముదాయం నిర్మించడానికి ప్రభుత్వం పూనుకున్నది. ఈ క్రమంలో అక్కడున్న ఎత్తయిన భవనాలు కూల్చే సందర్భంలో పక్కనే ఉన్న ప్రార్థనా మందిరాలపైన శిథిలాలు పడి కొంత నష్టం జరిగిందనే విషయం నాకు తెలిసింది.

ఇలా జరగడం పట్ల నేను ఎంతో బాధపడుతున్నాను. చింతిస్తున్నాను. ఇలా జరిగి ఉండాల్సింది కాదు. పాత భవనాల స్థానంలో కొత్తవి నిర్మించడమే ప్రభుత్వ ఉద్దేశం తప్ప, ప్రార్థనా మందిరాలకు ఇబ్బంది కలిగించడం ప్రభుత్వ అభిప్రాయం కాదు’అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ‘ఇప్పుడున్న దానికన్నా ఎక్కువ విస్తీర్ణంలో, విశాలంగా ఎన్నికోట్లయినా వెనుకాడకుండా దేవాలయం, మసీదులను పూర్తి ప్రభుత్వ ఖర్చుతో నిర్మించి, వాటికి చెందిన వ్యక్తులకు అప్పగిస్తాం. దేవాలయం, మసీదు నిర్వాహకులతో నేనే త్వరలోనే సమావేశమవుతాను. వారి అభిప్రాయాలు తీసుకుని, కొత్త సచివాలయ భవన సముదాయంతో పాటుగా ప్రార్థనా మందిరాలను నిర్మించి ఇస్తామని హామీ ఇస్తున్నాను’అని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top