నం.1 చేశాం : సీఎం​ కేసీఆర్‌

KCR Calls Telangana The Number One State In Country At State Formation Day Celebrations - Sakshi

నాలుగేళ్లలో రాష్ట్రాన్ని గొప్పగా తీర్చిదిద్దాం 

రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ 

సమైక్య పాలనలో అణచివేశారు

ఆ దైన్య స్థితి నుంచి ఇప్పుడు నంబర్‌ వన్‌గా మారాం 

సకల జనుల సంక్షేమమే లక్ష్యంగా కృషి చేస్తున్నాం 

కోటి ఎకరాలకు సాగునీరు అందించి తీరుతాం 

సికింద్రాబాద్‌ పరేడ్‌ మైదానంలో ఘనంగా ఆవిర్భావ వేడుకలు

సాక్షి, హైదరాబాద్‌ : ‘‘సమైక్య పాలనలో దారుణమైన అణచివేత.. దోపిడీ.. బతుకు మీద ఆశలు లేని నిస్సహాయత.. అలాంటి దైన్య స్థితి నుంచి కేవలం నాలుగేళ్లలోనే 21 శాతం ఆదాయ వృద్ధి రేటు కలిగిన ధనిక రాష్ట్రంగా తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. అభివృద్ధిలో, ప్రజా సంక్షేమ పథకాల అమల్లో దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది. నిరంతర ప్రగతిశీల రాష్ట్రంగా యావత్‌ ప్రపంచం దృష్టినీ ఆకర్షిస్తోంది. ఇది దశాబ్దాలుగా మనం చేసిన పోరాటానికి దక్కిన సార్థకతగా భావిస్తున్నా..’’ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శనివారం సికింద్రాబాద్‌లోని పరేడ్‌ మైదానంలో కేసీఆర్‌ జాతీయ పతాకాన్ని ఎగురవేసి.. పోలీసు గౌరవ వందనం స్వీకరించారు. తెలంగాణ అమర వీరులకు నివాళులు అర్పించారు. అనంతరం సుదీర్ఘంగా ప్రసంగించారు. రాష్ట్ర ఏర్పాటు పరిస్థితులను గుర్తు చేసుకుంటూ.. గత నాలుగేళ్లలో రాష్ట్రంలో అమలు చేసిన పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. 

కష్టాలను దూరం చేసుకుంటూ.. 
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే తప్ప తలరాత మారదనే వాస్తవాన్ని గ్రహించి, ఉవ్వెత్తున ఉద్యమించి స్వరాష్ట్రం సాధించుకున్నామని కేసీఆర్‌ పేర్కొన్నారు. ఆ క్రమంలో తెలంగాణ ప్రజల కష్టాలు, కడగండ్లు, వాటికి కారణాలు గుర్తించామని.. వాటిని పరిష్కరించే దిశగా మేనిఫెస్టో రూపొందించామని చెప్పారు. తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన మరుక్షణం నుంచే హామీలను అమలు చేస్తున్నామని.. విస్తృత ప్రజాప్రయోజనం కలిగించే కొత్త పథకాలను ప్రవేశపెట్టామని తెలిపారు. ‘సంపద సృష్టించాలి.. సృష్టించిన సంపదను ప్రజలకు పంచాలి..’అనే సూత్రం ప్రాతిపదికగా ప్రభుత్వం పురోగమిస్తోందన్నారు. దేశంలో మరే రాష్ట్రం అమలు చేయని అద్భుత కార్యక్రమాలను తెలంగాణలో చేపట్టామని.. పలు రాష్ట్రాల ప్రజా ప్రతినిధులు, అధికారులు వీటిని పరిశీలించి, తమ రాష్ట్రాల్లోనూ అమలు చేసేందుకు పూనుకుంటున్నారని తెలిపారు. ఇది తెలంగాణ బిడ్డలుగా మనందరికీ గర్వకారణమని పేర్కొన్నారు. 

సంక్షేమమే పరమావధిగా.. 
సంక్షేమానికి ప్రాధాన్యమిస్తూ అనేక పథకాలను చేపట్టామని కేసీఆర్‌ చెప్పారు. ప్రభుత్వం 42 లక్షల మంది అసహాయులకు నెలకు రూ.వెయ్యి చొప్పున పింఛన్‌ అందిస్తూ ఆసరాగా నిలుస్తోందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా బీడీ కార్మికులకు, ఒంటరి మహిళలకు, బోదకాలు బాధితులకు, మసీదుల్లో ప్రార్థనలు చేసే ఇమామ్, మౌజన్లకు కూడా ప్రభుత్వం జీవన భృతి కల్పిస్తోందన్నారు. కల్యాణలక్ష్మి ద్వారా పేదింటి ఆడపిల్లల పెళ్లికి ఆర్థిక సాయం చేస్తున్నామని, బడిపిల్లలకు సన్నబియ్యంతో భోజనం అందజేస్తున్నామని చెప్పారు. ఏకంగా రూ.40 వేల కోట్లతో 40 పథకాల ద్వారా ప్రజాసంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్న రాష్ట్రం దేశంలో తెలంగాణ ఒక్కటేనని పేర్కొన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అయ్యేందుకు వ్యవసాయంతో పాటు కులవృత్తులకు ఊతమిస్తున్నట్టు కేసీఆర్‌ చెప్పారు. ఆ దిశగా యాదవ, గొల్ల, కురుమలకు 75 శాతం సబ్సిడీపై గొర్రెల పంపిణీ, ముదిరాజ్, బెస్తలకు ప్రయోజనం కల్పించేలా చేప పిల్లల పంపిణీ చేపట్టామన్నారు. ఈత, తాటి చెట్లపై విధించే పన్ను రద్దు చేశామని.. పాడి రైతులకు లీటరుకు రూ.4 ప్రోత్సాహకంగా అందజేస్తున్నామని తెలిపారు. నిరుపేదల ఆత్మగౌరవాన్ని నిలిపేలా డబుల్‌ బెడ్రూం ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టామన్నారు. రాబోయే కొద్ది నెలల్లోనే రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాలకు మిషన్‌ భగీరథ ద్వారా తాగునీరు అందుతుందన్నారు. 
 
కోటి ఎకరాలకు నీరిచ్చి తీరుతాం.. 
రాష్ట్రంలో కోటి ఎకరాలకు సాగునీరు అందించి తీరాలనే దృఢ సంకల్పంతో ప్రాజెక్టులు చేపట్టామని కేసీఆర్‌ తెలిపారు. సమైక్య పాలకులు కావాలనే అంతర్రాష్ట్ర వివాదాలకు ఆస్కారమిచ్చేలా ప్రాజెక్టులను డిజైన్‌ చేసి, తర్వాత ఆ వివాదాలను సాకుగా చూపి ప్రాజెక్టులు నిర్మించలేదని ఆరోపించారు. దాంతో తమ ప్రభుత్వం ప్రాజెక్టులను రీడిజైన్‌ చేసి.. పనులు కొనసాగించాల్సి వచ్చిందని చెప్పారు. గత 70 ఏళ్లలో రాష్ట్రంలో ఏర్పడిన ప్రభుత్వాలేవీ మహారాష్ట్రతో ఒప్పందాలు చేసుకోలేకపోయాయని.. తాము తెలంగాణ ప్రజల విశాల ప్రయోజనాల కోసం ఎంతో పరిణతితో వ్యవహరించి.. అంతర్రాష్ట్ర ఒప్పందాలను సాధించుకోగలిగామని పేర్కొన్నారు. దీంతో గోదావరిపై ప్రాజెక్టులు నిర్మించుకోవడానికి ఉన్న అడ్డంకులన్నీ తొలిగాయన్నారు. గోదావరి, కృష్ణా నదుల మీద 23 భారీ ప్రాజెక్టులు, 13 మధ్యతరహా ప్రాజెక్టుల పనులు చేపట్టామని.. ఏటా బడ్జెట్లో రూ. 25 వేల కోట్లు కేటాయించుకుంటున్నామని చెప్పారు. 
 
భారీగా కొత్త ఆయకట్టుకు నీరు 
కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయల్‌ సాగర్, మిడ్‌ మానేరు, సింగూరు, ఎల్లంపల్లి, కిన్నెరసాని, పాలెం వాగు, కొమురంభీమ్, మత్తడివాగు, నీల్వాయి, జగన్నాథ్‌పూర్‌ వంటి పెండింగ్‌ ప్రాజెక్టులను పూర్తి చేయడం ద్వారా ఇప్పటికే 12 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరు అందిస్తున్నామని కేసీఆర్‌ చెప్పారు. ఈ ఏడాది మరో 8 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు. కొత్తగా తుమ్మిళ్ల, గట్టు ఎత్తిపోతల పథకాలు, సదర్‌ మాట్‌ బ్యారేజీ, మల్కాపూర్‌ రిజర్వాయర్‌ నిర్మాణానికి శ్రీకారం చుట్టామని.. ఎస్సారెస్పీ పునరుజ్జీవన పథకాన్ని చేపట్టామని తెలిపారు. దేవాదుల ప్రాజెక్టును పూర్తి చేయడంతో పాటు, 365 రోజుల పాటు ఆ ప్రాజెక్టుకు నీరు అందుబాటులో ఉండేలా గోదావరిపై తుపాకుల గూడెం బ్యారేజీని నిర్మిస్తున్నామన్నారు. వలస కూలీలకు నిలయమైన పాలమూరు, తీవ్ర దుర్భిక్షం ఎదుర్కొంటున్న ఉమ్మడి నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లోని భూములకు పాలమూరు–రంగారెడ్డి పథకం ద్వారా సాగునీరు అందుతుందన్నారు. 
 

శరవేగంగా పనులు.. 
భక్త రామదాసు ఎత్తిపోతల పథకాన్ని రికార్డు సమయంలో పూర్తి చేశామని.. అదే స్ఫూర్తితో తలపెట్టిన సీతారామ ఎత్తిపోతల పథకం పనులు శరవేగంగా సాగుతున్నాయని కేసీఆర్‌ చెప్పారు. గోదావరి జలాలను సమగ్రంగా వినియోగించుకునేలా నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవసాయానికి వరప్రదాయిని అన్నారు. నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, కరీంనగర్, సిరిసిల్ల, జగిత్యాల, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, వరంగల్‌ అర్బన్, వరంగల్‌ రూరల్, మహబూబాబాద్, భూపాలపల్లి, ఖమ్మం, సూర్యాపేట జిల్లాలకు సమృద్ధిగా నీరందించే కాళేశ్వరం ప్రాజెక్టును రికార్డు సమయంలో పూర్తిచేసే విధంగా పనులు జరుగుతున్నాయని తెలిపారు. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో వినియోగిస్తున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, భారీ ఎత్తున సాగుతున్న నిర్మాణ పనులను చూసేందుకు ఇతర ప్రాంతాల నుంచి కూడా ప్రముఖులు వచ్చారని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ ప్రజలకు జీవధారగా మారబోతున్నదని గవర్నర్‌ నరసింహన్‌ ప్రశంసించారని గుర్తుచేశారు. కేంద్ర జల సంఘం ప్రతినిధి బృందం కూడా రెండు రోజుల పాటు కాళేశ్వరం పనులను పరిశీలించి.. ఈ ప్రాజెక్టు దేశ చరిత్రలోనే విభిన్నమైనదని కొనియాడిందని చెప్పారు. మిషన్‌ కాకతీయ తోడ్పాటుతో రాష్ట్రంలో సాగయ్యే భూమి విస్తీర్ణం పెరిగిందని.. భూగర్భ జల మట్టాలు కూడా పెరిగాయని పేర్కొన్నారు. 
 
రైతులకు అండగా నిలిచేలా పథకాలు.. 
రాష్ట్రంలో రైతులను మరింతగా ఆదుకోవడానికి ఎంతో చేయాలన్న తపన మదిలో మెదులుతూనే ఉందని.. ఆ దిశగానే ‘రైతుబంధు’పథకాన్ని ప్రారంభించామని కేసీఆర్‌ తెలిపారు. ఒకవేళ రైతులెవరైనా చనిపోతే.. వారి కుటుంబానికి ఆధారంగా ఉండేలా రైతులకు జీవిత బీమా పథకాన్ని ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు. ఇకపై తెలంగాణలో ఏ రైతు మరణించినా.. వారి కుటుంబానికి పది రోజుల్లోగానే రూ. 5 లక్షల బీమా సొమ్ము అందుతుందని చెప్పారు. ఆగస్టు 15వ తేదీ నుంచి రైతులకు బీమా పత్రాలు అందించే కార్యక్రమం ప్రారంభవుతుందని వెల్లడించారు. ఇక రైతు రుణాల మాఫీ, సకాలంలో ఎరువులు–విత్తనాల సరఫరా, ఐదువేల ఎకరాలకు ఒక వ్యవసాయ విస్తరణాధికారి నియామకం, డ్రిప్‌ ఇరిగేషన్, పాలీహౌజ్‌లకు, యంత్ర పరికరాలకు భారీ సబ్సిడీలు, పెద్ద ఎత్తున గోదాముల నిర్మాణం, నీటితీరువా బకాయిల రద్దు, వ్యవసాయ ట్రాక్టర్లపై రవాణా పన్ను రద్దు వంటి వాటితో వ్యవసాయ రంగానికి కొత్త ఉత్తేజాన్ని కలిగించామని చెప్పారు. నాణ్యమైన నిరంతర ఉచిత విద్యుత్‌ సరఫరాతో రైతుల జీవితాల్లో వెలుగులు నిండాయన్నారు. 
 
విజయవంతంగా ‘ప్రక్షాళన’ 
రాష్ట్రంలో భూ వివాదాలకు చెక్‌ పెట్టేందుకు.. ఎవరూ చేయని విధంగా కేవలం వంద రోజుల్లో ‘భూరికార్డుల ప్రక్షాళన’కార్యక్రమాన్ని విజయవంతంగా చేపట్టామని కేసీఆర్‌ తెలిపారు. రాష్ట్రంలోని 2.38 కోట్ల ఎకరాల భూమికి సంబంధించిన రికార్డులను ప్రక్షాళన చేయడంతోపాటు.. కోటి 40 లక్షల ఎకరాల వ్యవసాయ భూమి విషయంలో స్పష్టత సాధించగలిగామని వెల్లడించారు. ఈ నెల 20వ తేదీలోగా రైతులందరికీ పట్టాదారు పాస్‌ పుస్తకాలు, రైతుబంధు చెక్కుల పంపిణీ పూర్తిచేసేలా అధికార యంత్రాంగం కృషి చేస్తోందని చెప్పారు. భూరికార్డుల ప్రక్షాళన ద్వారా తేలిన సమాచారాన్ని పొందుపరుస్తూ ప్రభుత్వం ‘ధరణి’పేరుతో వెబ్‌సైట్‌ రూపొందిస్తోందన్నారు. ఈ నెల 20 నాటికి భూములకు సంబంధించిన పూర్తి స్పష్టత సాధించి, ఆ వివరాలను పారదర్శకంగా ‘ధరణి’లో నమోదు చేస్తామని చెప్పారు. దీనివల్ల భూముల వివరాలన్నీ ఒకేచోట అందరికీ అందుబాటులో ఉంటాయని.. క్రయ, విక్రయాలు ఎప్పుడు జరిగినా వెంటనే మార్పులు నమోదవుతాయని తెలిపారు. 
 
సరికొత్తగా రిజిస్ట్రేషన్‌ విధానం 
అవినీతికి, జాప్యానికి ఆస్కారం లేని విధంగా రాష్ట్రంలో నూతన రిజిస్ట్రేషన్‌ విధానాన్ని త్వరలోనే ప్రారంభిస్తున్నామని.. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతమున్న 141 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలతోపాటు అన్ని మండలాల తహసీల్దార్లకు రిజిస్ట్రేషన్‌ బాధ్యతలు అప్పగిస్తున్నామని కేసీఆర్‌ తెలిపారు. నామమాత్రంగా ఉన్న పంచాయతీ పాలక వర్గాలను క్రియాశీలంగా మార్చేలా పంచాయతీ చట్టంలో మార్పులు చేశామని చెప్పారు. గ్రామాలకు దూరంగా ఉన్న తండాలు, గూడేలు, శివారు పల్లెలను ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా మార్చామన్నారు.  
 
రూ.1.29 లక్షల కోట్ల పెట్టుబడులు 
రాష్ట్రంలో కేవలం 15 రోజుల్లోనే పరిశ్రమల స్థాపన కోసం అవసరమైన అన్ని అనుమతులు ఇచ్చే విధానం తీసుకొచ్చామని.. దీంతో అనేక పరిశ్రమలు తరలి వస్తున్నాయని కేసీఆర్‌ తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 7,155 పరిశ్రమలు అనుమతి పొందాయని.. రూ.1.29 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని చెప్పారు. 
 
ఆరోగ్య తెలంగాణ కోసం.. 
రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగా ప్రభుత్వాస్పత్రుల పనితీరు మెరుగుపడి.. ప్రజల్లో విశ్వాసం పెరిగిందని కేసీఆర్‌ చెప్పారు. ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవించే మహిళలకు నాలుగు విడతలుగా రూ.12 వేలు చెల్లిస్తున్నామని, ఆడపిల్ల పుడితే మరో రూ.వెయ్యి అదనంగా అందిస్తున్నామని తెలిపారు. అంతేగాకుండా తల్లికి, నవజాత శిశువులకు కావల్సిన 16 రకాల వస్తువులతో కూడిన ‘కేసీఆర్‌ కిట్‌’ను కూడా అందిస్తున్నామన్నారు. రాష్ట్రంలో 39 ప్రభుత్వ డయాలసిస్‌ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని.. అందులో ఇప్పటికే 17 కేంద్రాలు పనిచేయడం ప్రారంభించాయని తెలిపారు. హైదరాబాద్‌లో వైద్యసేవలను మరింత విస్తరించి, పేదలందరికీ ప్రయోజనం కలిగించేలా వెయ్యికి పైగా బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఇక రాష్ట్రంలోని ప్రజలందరికీ ఉచితంగా కంటి పరీక్షలు చేసి, తగిన వైద్యం అందించేందుకు ‘తెలంగాణ కంటి వెలుగు’పేరిట పథకాన్ని రూపొందించామని.. ఆగస్టు 15 నుంచి ఉచిత కంటి పరీక్షల శిబిరాలు ప్రారంభం అవుతాయని వెల్లడించారు. 
 
‘సివిల్స్‌’లోనూ సత్తా చాటుతున్నాం.. 
ఇటీవల జరిగిన సివిల్స్‌ పరీక్షల్లో తెలంగాణ బిడ్డలు దేశం మొత్తమ్మీద ప్రథమ స్థానంతోపాటు అత్యుత్తమ ఫలితాలు సాధించి రాష్ట్రానికి మంచి పేరు తెచ్చారని కేసీఆర్‌ అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని వసతులతో ఏర్పాటు చేసిన గురుకులాలు అత్యుత్తమ ఫలితాలు సాధిస్తున్నాయని.. ఇతర రాష్ట్రాలు కూడా దీనిని అనుసరిస్తున్నాయని చెప్పారు. చివరిగా ‘జై తెలంగాణ.. జై భారత్‌’అంటూ కేసీఆర్‌ ప్రసంగాన్ని ముగించారు. వేడుకల్లో పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, అధికారులు, టీఆర్‌ఎస్‌ నేతలు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top