చట్టాలపై అవగాహనతోనే సమర్థ పోలీసింగ్‌

K S Vyas 24th Memorial Lecture Event At Telangana Police Academy - Sakshi

నల్సార్‌ వర్సిటీ వీసీ ఫైజన్‌ ముస్తఫా 

రాజేంద్రనగర్‌: నిరంతరం శిక్షణ, చట్టాలపై సంపూర్ణ అవగాహనతోనే సమర్థవంతమైన పోలీసింగ్‌ సాధ్యమని నల్సార్‌ యూనివర్సిటీ వైస్‌ చాన్సలర్‌ ప్రొఫెసర్‌ పైజాన్‌ముస్తఫా అన్నారు. రాజ్యాంగం, మానవ హక్కులు, పోలీసింగ్‌ అనే అంశంపై హిమాయత్‌సాగర్‌లోని రాజా రామ్‌బహద్దూర్‌ వెంటరామిరెడ్డి తెలంగాణ రాష్ట్ర పోలీస్‌ అకాడమీలో సోమవారం ‘కె.ఎస్‌.వ్యాస్‌ 24వ స్మారక ఉపన్యాస’ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఫైజన్‌ ముస్తఫా మాట్లాడుతూ పలు రాష్ట్రాల్లోని పోలీసులు అతితక్కువ బడ్జెట్‌ కేటాయింపుల వల్ల సరైన శిక్షణ లేక ఒత్తిడితో పని చేస్తున్నారన్నారు.

దేశంలో పోలీసు విభాగాల్లో సుమారు ఐదున్నర లక్షల ఖాళీలున్నాయన్నారు. మొత్తం పోలీస్‌ వ్యవస్థలో 86% కానిస్టేబుళ్ల స్థాయి సిబ్బంది ఉండగా, 13% మంది ఇన్‌స్పెక్టర్లు, సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ క్యాడర్‌ వారు ఉన్నారని తెలిపారు. పోలీసు సిబ్బందితో పాటు ఇన్‌స్పెక్టర్, ఎస్సైలకు నిరంతరం మానవ హక్కులు, న్యాయ, చట్ట పరమైన అంశాలపై శిక్షణ ఇవ్వాలని సూచించారు. డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ పోలీసు అధికారులకు, యువతకు ఇప్పటికీ దివంగత వ్యాస్‌ రోల్‌ మోడల్‌గా ఉన్నారన్నారు.  ఈ కార్యక్రమంలో పోలీస్‌ అకాడమీ డైరెక్టర్‌ వి.కె.సింగ్, దివంగత వ్యాస్‌ కుమారుడు సీసీ ఎల్‌ఏ అడిషనల్‌ కమిషనర్‌ కేఎస్‌ శ్రీవత్స తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top