ఎత్తిపోతలు షురూ!

Jurala Lift Irrigation Began Into Downstream Projects - Sakshi

జూరాలకు స్థానిక పరీవాహకం నుంచి 5 వేల క్యూసెక్కుల ప్రవాహం

నెట్టెంపాడు నుంచి ఎత్తిపోతలు మొదలు.. ఆపై భీమా, కోయిల్‌సాగర్‌

సాక్షి, హైదరాబాద్‌: జూరాల ప్రాజెక్టుపై ఆధారపడ్డ ప్రాజెక్టుల నుంచి నీటి ఎత్తిపోతల ప్రక్రియ మొదలైంది. స్థానిక పరీవాహకంలో కురిసిన వర్షాలతో ప్రవాహాలు కొనసాగు తుండటంతో జూరాల మీద ఉన్న నెట్టెంపాడు నుంచి తొలి ఎత్తిపోతలు మొదలుపెట్టగా, భీమా, కోయిల్‌ సాగర్‌ ద్వారా నీటి ఎత్తిపోతకు రంగం సిద్ధంచేశారు. ప్రస్తుతం వచ్చిన నీటిని వచ్చినట్లు ఎత్తిపోసి రిజర్వాయర్లు నింపనున్నారు. ఎగువ నుంచి ప్రవాహాలు పుంజుకున్నాక పూర్తిస్థాయి ఎత్తిపోతలు చేపట్టేందుకు యంత్రాంగం సిద్ధమైంది.

వచ్చింది వచ్చినట్లు ఎత్తిపోత
స్థానిక పరీవాహకంలో కురుస్తున్న వర్షాలతో జూరాలకు గడిచిన మూడు నాలుగు రోజులుగా 5వేల క్యూసెక్కుల ప్రవాహాలు వస్తున్నాయి. ఆదివారం సైతం ప్రాజెక్టు లోకి 5,703 క్యూసెక్కుల ప్రవాహం వచ్చి చేరిం ది. దీంతో ప్రాజెక్టులోకి ఈ సీజన్‌లో 2.70 టీఎంసీల కొత్త నీరు రావడంతో ప్రాజెక్టు నీటిమట్టం 9.66 టీఎంసీలకు గానూ 7.04 టీఎంసీలకు చేరింది. ప్రవాహాలు కొనసా గితే ప్రాజెక్టు నిండనుంది. ఎగువన ఆల్మట్టి లోకి స్థిరంగా ప్రవాహాలు కొనసాగుతున్నా యి.

దీనిలోకి ప్రస్తుతం 9,359 క్యూసెక్కుల ప్రవాహం వస్తుండటంతో ప్రాజెక్టులో నీటి నిల్వ 129 టీఎంసీలకు గాను 74 టీఎంసీలకు చేరింది. ఇక్కడ గరిష్టంగా మరో 50 టీఎంసీలు చేరగానే దిగువకు నీటి విడుదల మొదలుకానుంది. ఒక్కసారి దిగువకు వరద మొదలైతే కొనసాగుతూనే ఉంటుంది. అప్పటికే జూరాల నిండి ఉంటే నీరంతా దాని దిగువన ఉన్న శ్రీశైలానికి వెళుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని జూరాలకు వస్తున్న నీటిని వచ్చింది వచ్చినట్లు ఎత్తిపోయాలని నిర్ణయించారు.

వరద మొదలైతే ఆయకట్టుకు నీరు
శనివారం రాత్రి నుంచి ప్రభుత్వ ఆదేశాలతో నెట్టెంపాడు మోటార్‌ను ఆన్‌చేసి 448 క్యూసెక్కుల నీటిని రేలంపాడ్‌ రిజర్వాయర్‌కు తరలిస్తున్నారు. నేడో, రేపో భీమా, కోయిల్‌సాగర్‌లో ఒకట్రెండు పంపులను నడిపించి రిజర్వాయర్లు నింపనున్నారు. ఈ మూడు లిఫ్టులను పూర్తిస్థాయిలో నడిపిస్తే రోజుకు 4వేల క్యూసెక్కుల మేర నీటిని తరలించే అవకాశం ఉంది. ఎగువ నుంచి వరద మొదలయ్యాక ఆయకట్టుకు నీటిని విడుదల చేస్తూ చెరువులు నింపనున్నారు.

బీమా కింద 2లక్షలు, నెట్టెంపాడు కింద 2లక్షలు, జూరాల కాల్వల కింద లక్ష, కోయిల్‌సాగర్‌ కింద 30వేల ఎకరాలకు నీరివ్వాలని భావిస్తున్నారు. బీమా కింద 248 చెరువులు, కోయిల్‌సాగర్‌ కింద 37, జూరాల కింద 185, నెట్టెంపాడు కింద 100, ఆర్డీస్‌ కింద 5 చెరువులు నింపేలా ప్రణాళిక ఉంది. గత ఏడాది వరద ఉధృతంగా ఉండటంతో 90 శాతం చెరువులు నింపగలిగారు. ఈ ఏడాది సైతం జూలై 15 తర్వాత వరద ఉంటుందని, అప్పట్నుంచి చెరువులు పూర్తిస్థాయిలో నింపి ఆయకట్టుకు నీరివ్వాలని సాగునీటి యంత్రాంగం యోచిస్తోంది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top