వీళ్లు ఇక మారరు.. | Irregularities In Electrical Department In Adilabad | Sakshi
Sakshi News home page

వీళ్లు ఇక మారరు..

Jul 18 2019 9:57 AM | Updated on Jul 18 2019 9:57 AM

Irregularities In Electrical Department In Adilabad - Sakshi

సాక్షి, ఆదిలాబాద్‌ : విద్యుత్‌శాఖ జూనియర్‌ లైన్‌మెన్‌ నియామకాల్లో అక్రమాలు జరిగాయన్నది వాస్తవం.. విద్యుత్‌ శాఖాధికారుల ప్రమేయం లేకుండా ఇది జరిగే ప్రక్రియ కాదన్నది కూడా నమ్మలేనిది. గుర్తు తెలియని వ్యక్తి తానే అభ్యర్థిని అని వచ్చి సెలక్షన్‌ కమిటీ ముందే వీడియో చిత్రీకరణలోనే విద్యుత్‌ స్తంభం పరీక్షలో పాల్గొని వెళ్లడం.. ఆ తర్వాత సర్టిఫికెట్ల విషయంలో అధికారుల దగ్గరికి వచ్చే వరకు అధికారులకు నకిలీ అభ్యర్థిపై అనుమానం రాలేదంటే వారు ఎంపిక ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారా.. లేని పక్షంలో ఆ ప్రక్రియ తామనుకున్నట్టుగా సాగేలా వ్యవహరిస్తున్నారా? అన్న అనుమానం కలగకపోదు. 

నో చేంజ్‌..
రాత పరీక్ష తర్వాత మొదటి విడతలో ఆదిలాబాద్‌ సర్కిల్‌ పరిధిలో 439 మందికి విద్యుత్‌ స్తంభం ఎక్కే పరీక్ష నిర్వహించారు. రెండో విడతలో 184 మంది అభ్యర్థులకు నిర్వహించడం జరిగింది. ఇక గురువారం నుంచి మూడో విడతలో 88 మంది అభ్యర్థులకు పరీక్ష నిర్వహించబోతున్నారు. అయితే రెండో విడత పరీక్షలో అక్రమాలు జరిగాయని తేటతెల్లమైనా దాన్ని అంగీకరించేందుకు టీఎస్‌ ఎన్‌పీడీసీఎల్‌ యాజమాన్యం   సిద్ధంగా లేనట్టు కనిపిస్తోంది. ఇంత జరిగినా సెలక్షన్‌ కమిటీని యథావిధిగా కొనసాగించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సెలక్షన్‌ కమిటీలో ఆదిలాబాద్‌ ఎస్‌ఈ చైర్మన్‌గా, డీఈలు, పీఓ సభ్యులుగా ఉన్నారు. కార్పొరేట్‌ ఆఫీస్‌ నుంచి వచ్చే సీజీఎం పర్యవేక్షకులుగా వ్యవహరిస్తారు. ఆయన కనుసన్నల్లోనే ప్రక్రియ సాగుతోంది. కాగా రెండో విడతపై ఇన్ని ఆరోపణలు వచ్చినా అదే సెలక్షన్‌ కమిటీని మూడో విడతకు కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై అభ్యర్థుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ ప్రక్రియలో వరంగల్‌లో నిపుణులైన కొంతమంది కార్మికులను నకిలీలుగా తీసుకొనివచ్చి ఈ వ్యవహారం సాగిస్తున్నట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.

439 పోస్టులు..
ఉమ్మడి జిల్లాలో 439 జేఎల్‌ఎం పోస్టులను భర్తీ చేస్తున్నారు. టీఎస్‌ ఎన్‌పీడీసీఎల్‌ నుంచి పాత ఐదు సర్కిళ్ల పరిధిలో పోస్టుల ప్రక్రియ జరుగుతుండగా, ఉమ్మడి జిల్లాలో ప్రస్తుతం మూడో విడత విద్యుత్‌ స్తంభాలు ఎక్కే పరీక్ష కొనసాగుతుంది. రెండో విడతలో నకిలీ అభ్యర్థి పోల్‌ క్‌లైమ్‌ టెస్ట్‌లో పాల్గొనడం కలకలం రేపుతోంది. ఇది నిరుద్యోగ అభ్యర్థుల్లో అనుమానాలకు తావిస్తోంది. మొత్తం ప్రక్రియలో అక్రమాలు చోటుచేసుకున్నాయన్న ఆరోపణలు బాహాటంగానే వ్యక్తమవుతున్నాయి. ఒక్కో పోస్టుకు లక్షల రూపాయలు వసూలు చేసుకున్నారన్న విమర్శలు లేకపోలేదు. మూడో విడతలో 88 మంది అభ్యర్థులకు గురువారం నుంచి పరీక్ష నిర్వహిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ఇప్పటికే అభ్యర్థులు ఆదిలాబాద్‌ చేరుకున్నారు. దీంతో బుధవారం పరీక్ష జరిగే ఎస్‌ఈ కార్యాలయం ఆవరణలో సందడిగా కనిపించారు. 

పూర్తి పారదర్శకంగా నియామకాలు
జేఎల్‌ఎం నియామక ప్రక్రియ పూర్తి పారదర్శకంగా నడుస్తుంది. రెండో విడతలో గుర్తు తెలియని వ్యక్తి వచ్చి స్తంభం ఎక్కే పరీక్షలో పాల్గొన్న విషయంలో పోలీసులకు ఫిర్యాదు చేశాం. ప్రస్తుతం అది విచారణ చేస్తున్నారు. లోపాలు ఉన్న పక్షంలో మేమే చర్యలు తీసుకుంటాం. అభ్యర్థులు ఎలాంటి సందేహాలు పెట్టుకోవద్దు.          
– ఉత్తం జాడే, విద్యుత్‌శాఖ ఎస్‌ఈ, ఆదిలాబాద్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement