
జిల్లాల వారీగా పరిశ్రమల సర్వే: జూపల్లి
పరిశ్రమలపై జిల్లాల వారీగా సమగ్ర సర్వే నిర్వహిం చాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.
సాక్షి, హైదరాబాద్: పరిశ్రమలపై జిల్లాల వారీగా సమగ్ర సర్వే నిర్వహిం చాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. చిన్న మధ్యతరహా, భారీ పరిశ్రమల వివరాలన్నీ సేకరించాలని మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. కేటగిరీల వారీగా ప్రస్తుతం ఎన్ని పరిశ్రమలు పనిచేస్తున్నాయి.. వాటికి అవసరమయ్యే విద్యుత్ సామర్థ్యం ఎంత... మూతపడ్డ పరిశ్రమలెన్ని, అందుకు దారితీసిన కారణాలేమిటి... అవసానదశలో ఏవైనా పరిశ్రమలు ఉన్నాయా... తదితర వివరాలన్నీ సమగ్ర సర్వే ద్వారా అధ్యయనం చేయాలని నిర్ణయించారు.
బుధవారం సచివాలయంలో పరిశ్రమల శాఖ కార్యదర్శి సవ్యసాచిఘోష్, అడిషనల్ డెరైక్టర్ మధుసూదనరెడ్డి, చేనేత జౌళి శాఖ ఇన్‌చార్జి కమిషనర్ నర్సింహారావులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. కొత్త పారిశ్రామిక విధానంలో ప్రవేశపెట్టిన టీ-ఐడి యా, టీ-ప్రైడ్ పథకాలకు జనవరి ఒకటో తేదీ లోగా మార్గదర్శకాలను ఖరారు చేయాలని నిర్ణయించారు. రిటైర్డ్ ఉద్యోగుల సేవలను వినియోగించుకోవాలని ఆదేశించారు. కేంద్రం నుంచి పరిశ్రమల విభాగానికి ఏమేం నిధులు వచ్చా యో వివరాలు రూపొందించాలని కోరారు. విదేశాల నుంచి పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు తెలంగాణ పారిశ్రామిక విధానాన్ని విశ్వవ్యాప్తం గా ప్రచారం చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. సందర్భాన్ని బట్టి ప్రవాస భారతీయులతో సదస్సులు ఏర్పాటు చేయాలని సూచించారు.