సదా మీ సేవలోనే.. | I Will Keep All My Election Promises Says KCR | Sakshi
Sakshi News home page

సదా మీ సేవలోనే..

Jan 26 2020 2:23 AM | Updated on Jan 26 2020 2:23 AM

I Will Keep All My Election Promises Says KCR - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ‘తెలంగాణ ప్రజలకు మనవి చేస్తున్న. మా పట్ల మీరింత విశ్వాసం చూపుతున్నరు. మీ పట్ల మేము సదా కృతజ్ఞతతో ఉండాలి. మీకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. సాధారణ ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో కొన్ని పెండింగ్‌ ఉన్నయి. 57 ఏళ్లు దాటిన వాళ్లకు వృద్ధాప్య పెన్షన్‌ ఇస్తామన్నం. మార్చి 31 తర్వాత నుంచి 57 ఏళ్లు దాటిన వారందరికీ రూ.2,016 వృద్ధాప్య పింఛన్‌ ఇస్తం’ అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. ‘తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు త్వరలోనే పీఆర్సీ నివేదిక తీసుకుని వారి పదవీ విరమణ వయో పరిమితిని పెంచుతాం. పీఆర్సీ ఎంతో కొంత ఇస్తారని ఉద్యోగులు ఆశిస్తరు. కానీ రాష్ట్ర ఆదాయాభివృద్ధి మైనస్‌లో ఉంది. ఢిల్లీలోని కేంద్రం సక్కగా పనిచేయట్లేదు. మన రాష్ట్రానికే జీఎస్టీ కింద ఇంకా రూ.1,131 కోట్లు రాష్ట్రానికి రావాల్సి ఉంది. రేపో మాపో ప్రధానికి లేఖ రాస్తాను. ఐజీఎస్టీ కింద రూ.2.814 కోట్లు రావాలి. ఇస్తారా? ఎగ్గొడ్తరా తెలియదు. పీఆర్సీ అంటే డబ్బులు కావాలి. నేనే పిల్చి ఉద్యోగ సంఘాలతో మాట్లాడుతా. తృణమోపణమో జీతాలు పెంచుతాం’ అని హామీ ఇచ్చారు. 

గల్ఫ్‌ కార్మికుల కోసం ఓ పాలసీ 
‘తెలంగాణ హెల్త్‌ ప్రొఫైల్‌ కోసం కార్యాచరణ ప్రారంభించబోతున్నాం. కంటివెలుగు సూపర్‌ డూపర్‌ హిట్‌ అయింది. ప్రపంచంలోనే అతిపెద్ద స్క్రీనింగ్‌ కార్యక్రమం అని ఎల్వీ ప్రసాద్‌ ఆస్పత్రి అధిపతి జీఎన్‌రావు అన్నారు. చెవి, ముక్కు, గొంతు, బీపీ, షుగర్‌ ఇతర వ్యాధుల నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తం. గల్ఫ్‌ కార్మికుల కోసం త్వరలో పాలసీ తీసుకొస్తాం. దీనిపై అధ్యయనం చేసేందుకు త్వరలో 17 మంది ఎమ్మెల్యేలను అక్కడి పంపుతా. ఆ తర్వాత నేను కూడా వెళ్లి పరిస్థితు లను తెలుసుకుంటా. ఉన్న ఊళ్లోనే నెలకు రూ.30 వేలు వచ్చే పరిస్థితి ఉంటే గల్ఫ్‌ వెళ్లి మనవాళ్లు సచ్చేది ఎందుకు? వారికి ఇక్కడే ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకుంటం. న్యాక్‌ కింద ప్రతి నియోజకవర్గానికి ఒక శిక్షణ కేంద్రం పెట్టి నిర్మాణరంగంలో శిక్షణ ఇప్పిస్తాం. ఏడాదిలోగా నిరక్షరాస్యతను తగ్గించుకుంటాం’ అని వెల్లడించారు. 

అంత డబ్బు ఏం చేసుకుంటరు..? 
‘రెవెన్యూలో విపరీతమైన గందరగోళాలు జరుగుతున్నయి. పెట్రోల్‌ డబ్బాలు తీసుకుని పోయి ఎమ్యార్వోను తగలబెట్టుడు. తనను తగలబెట్టు కుని సావుడు జరుగుతున్నయి. ఈ మధ్య పెట్రోల్‌ డబ్బా ఫ్యాషన్‌ అయిపోయింది. అవినీతి నిరోధకశాఖ నివేదికలో నంబర్‌ వన్‌ అవినీతి శాఖగా రెవెన్యూ శాఖ ఉంది.  రెవెన్యూ శాఖ లోని విచ్చలవిడితనాన్ని, అరాచకాన్ని, వ్యాధుల ను పొడగొట్టాలంటే కచ్చితనంగా సర్జరీ అవసరం. మందులతో రోగం కుదరదు. ఎవరు ఏమనుకున్నా నేను భయపడను. మాకు ఎవరూ బాసులు లేరు.. ప్రజలే మా బాసులు. వారికి మంచి జరగాలన్నదే మా లక్ష్యం. రోజూ జమా బంధీ జరగాలి. ఆ పద్ధతిలో పటిష్టమైన ఆన్‌లైన్‌ విధానం తెస్తాం. ఏ రోజు కొనుగోళ్లు ఆ రోజు పట్టా మార్పిళ్లు జరిగిపోవాలి. రెవెన్యూ ఉద్యోగులను పిలిపించి మాట్లాడుతం. (భూ ముల వ్యవహారాలు) వారి దగ్గర ఉండాలా? లేదా వేరే వారికి ఇవ్వాలా? అడిగి తెలుసుకుంటం. వారిని పక్కన పెడ్తం అని కొన్ని పత్రికల్లో రాసింది కరెక్టు కాదు. అట్ల మీరు ఆగం గాకండి. మీరు పనిచేస్తానంటే ఓకే. మీతోనే పనిచేయిస్తం. లేకుంటే వేరే శాఖకు ఇస్తం. మీరే పని చేయాలని రాజ్యాంగంలో ఎక్కడైనా రాసి ఉందా? ప్రభుత్వాలనే తీసిపారేస్తరు ప్రజలు. మిమ్మల్ని తీసిపారేయడం ఎంత? సంఘాలంటే నిర్ణయాత్మకంగా పనిచేయాలి’ అని కేసీఆర్‌ రెవెన్యూ ఉద్యోగులను ఉద్దేశిం చి కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే అసెంబ్లీ సమావే శాల్లో కొత్త రెవెన్యూ చట్టం తీసుకొస్తామన్నారు.

నెల రోజుల్లో పట్టణ ప్రగతి 
‘పల్లె ప్రగతి తరహాలో నెల రోజుల్లో పట్టణ ప్రగతి నిర్వహిస్తాం. చైర్‌పర్సన్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లందరికీ శిక్షణ తరగతులు ఏర్పాటుచేస్తాం. కాలుష్యం, ట్రాఫిక్, రోడ్లు, తాగునీటి సరఫరా వం టి పట్టణీకరణ సవాళ్లపై శిక్షణ ఇస్తాం. ఖానం మెట్టు, ఖాజాగూడలో 20 ఎకరాల్లో సెంటర్‌ ఫర్‌ అర్బన్‌ ఎక్సలెన్స్‌ ఏర్పాటు చేసి శిక్షణ, పరిశోధనలు ప్రారంభిస్తాం. ప్రతి నెలా పంచాయతీలకు 399 కోట్లు ఇస్తున్నం. పట్టణాలకు ఏటా రూ.2,000 కోట్ల వరకు ఇస్తాం’ అని కేసీఆర్‌ తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement