
సాక్షి, గద్వాల: తెలంగాణ పీసీసీ నాయకత్వ వైఫల్యం కారణంగానే కాంగ్రెస్ పార్టీకి ఘోర పరాజయాలు ఎదురవుతున్నాయని బీజేపీ నేత డీకే అరుణ అన్నారు. పార్టీ మారినందుకు తానను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తే.. అది కాంగ్రెస్‌కే నష్టమని పేర్కొన్నారు. కీలకమైన లోక్‌సభ ఎన్నికల ముందు కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన డీకే.. మంగళవారం అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ తనకు మహబూబ్‌నగర్ ఎంపీ టికెట్ ఇవ్వకున్నా.. తనకన్నా సమర్థులైన నాయకుడికి ఇచ్చి ఉంటే బాగుండేదని ఆమె అభిప్రాయపడ్డారు. మహబూబూనగర్ నుంచి బీజేపీ ఎంపీగా పోటీచేస్తున్నట్లు ఆమె ప్రకటించారు. (నాకు కాంగ్రెస్‌లో చాలా నష్టం జరిగింది)
వచ్చే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలోపు రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేస్తానని అరుణ చెప్పారు. దేశ రక్షణకు ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వం చాలా అవసరమని పేర్కొన్నారు. పార్టీ ఆదేశాలకు లోబడి పనిచేస్తానని, చివరి వరకు బీజేపీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. గౌరవం లేని చోట ఉండటం ఇష్టం లేకనే పార్టీ మారినట్లు డీకే అరుణ ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా తెలంగాణ కాంగ్రెస్‌లో సీనియర్ నేతగా, మాజీ మంత్రిగా వ్యవహరించిన అరుణ.. హఠాత్తుగా బీజేపీలో చేరడం హాట్ టాఫిక్‌గా మారింది.