అబ్బబ్బో.. మబ్బుల్లోనే!

Hyderabadies Very Speed In Flight Jouneys - Sakshi

ఫ్లైట్‌ జర్నీలో హైదరాబాదీల మహా స్పీడ్‌

అంతర్జాతీయ, దేశీయ ప్రయాణాల వృద్ధిలో రెండో స్థానం

బెంగళూరు తర్వాత హైదరాబాదీల దూకుడు

దేశీయ ప్రయాణాల్లో విజయవాడ, తిరుపతిలు సైతం

సాక్షి, హైదరాబాద్‌ : విమాన ప్రయాణంలో తెలుగు రాష్ట్రాలు టాప్‌ స్పీడ్‌లో దూసుకెళ్తున్నాయి. దేశీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణాల వృద్ధిలో దేశంలో బెంగళూరు తొలి స్థానంలో ఉండగా, హైదరాబాద్‌ సెకండ్‌ ప్లేస్‌లో నిలిచింది. మరో వైపు ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, తిరుపతిలు సైతం భారీ వృద్ధిని సాధించాయి. తాజాగా ఇండియన్‌ ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ విడుదల చేసిన వార్షిక నివేదికలో అంతర్జాతీయ టెర్మినల్‌ కలిగిన మహా నగరాల్లో బెంగళూరు, హైదరాబాద్‌ దేశీయ, అంతర్జాతీయ ప్రయాణాల్లో మొదట్రెండు స్థానాల్లో నిలబడ్డాయి. ప్రయాణికుల సంఖ్యలో ఢిల్లీ, ముంబైలు తొలి రెండు స్థానాల్లో ఉన్నా 2018–19 కాలంలో వృద్ధిని సాధించలేకపోయాయి. దేశీయ ప్రయాణాల్లో ముంబైలో ఏకంగా 2017–18తో పోలిస్తే 1.3% ప్రయాణికులు తగ్గి పోగా, అంతర్జాతీయ ప్రయాణికుల్లో 5.7% వృద్ధితో దేశంలోని మిగిలిన మెట్రో నగరాల వరసలో చివరకు చేరింది.

బెంగళూరు–భాగ్యనగరం పోటాపోటీ
బెంగళూరు–హైదరాబాద్‌లో ఫ్‌లైట్‌ జర్నీ విషయంలో పోటాపోటీగా నిలబడ్డాయి. ఐటీ, సినిమా, ఫార్మా, హెల్త్, ఎడ్యుకేషన్‌ రంగాలు భారీగా విస్తరించటంతో జాతీయ సగటు కంటే ఈ రెండు నగరాలు అత్యధిక ప్రయాణికులతో తొలి రెండు స్థానాలను దక్కించుకున్నాయి. దేశీయ ప్రయాణాల్లో బెంగళూరు 24.8 శాతం ప్రయాణికుల వృద్ధితో తొలి స్థానంలో నిలబడితే, హైదరాబాద్‌ 20.4 శాతం వృద్ధితో రెండో స్థానంలో నిలిచింది. మూడ్నాలుగు స్థానాల్లో చెన్నై, కోల్‌కతా మహా నగరాలు నిలిచాయి. ఇక విదేశీ ప్రయాణాల్లో 17.5 శాతం వృద్ధితో బెంగళూరు మొదటి స్థానంలో నిలిస్తే.. 8.1 శాతం వృద్ధితో హైదరాబాద్‌ రెండో స్థానం దక్కించుకుంది.

విజయవాడ, తిరుపతిలు సైతం..
ఇక దేశీయ విమానాశ్రయాలు కలిగిన పట్టణాల విషయంలో తిరుచ్చి మొదటి ప్లేస్‌లో ఉండగా, విజయవాడ, తిరుపతి పట్టణాలు రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతికి ఇటీవలి కాలంలో ఫ్లైట్‌ కనెక్టివిటీ పెరగటంతోపాటు ప్రయాణాల సంఖ్య కూడా భారీగా పెరిగింది. దీంతో ఒక్క ఏడాదిలోనే 57.9 శాతం వృద్ధితో దేశంలోని దేశీయ విమానాశ్రయ కేటగిరిలో రెండో స్థానంలో నిలిచింది.

సమాన దూరంలో హైదరాబాద్‌: నీలిమ, స్టాఫ్‌వేర్‌ ఇంజనీర్, హైదరాబాద్‌
‘దేశంలోని అన్ని నగరాలకు హైదరాబాద్‌ సమాన దూరంలో ఉంటుంది. దీనికి తోడు సమయం కలసి రావటం కోసం ఫ్‌లైట్‌ జర్నీ ఎంచుకోవటం తప్పనిసరి. నేను ఇప్పటికే 60 దేశాలు తిరిగివచ్చా. గతంతో పోలిస్తే ఇప్పుడు విమాన చార్జీలు పెద్దగా వ్యయం ఏమీ కావు.

మరిన్ని ఎయిర్‌పోర్ట్‌లు రావాలి: పి.నవీన్‌రెడ్డి, సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్, హైదరాబాద్‌
‘హైదరాబాద్‌ ఐటీ హబ్‌గా మారింది. ఇంకా విస్తరించే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాలో మరిన్ని పట్టణాలకు ఎయిర్‌పోర్టులు, ఫ్‌లైట్‌ కనెక్టివిటీ పెరగాలి. హైదరాబాద్‌ మహానగరం విస్తరిస్తున్నంత వేగంగానే ఇతర దేశాలు, నగరాలకు వెళ్లేందుకు అనువుగా ఎయిర్‌పోర్టులను విస్తరించాలి.

చిన్న నగరాల్లో..
నగరం          2017–18    2018–19    వృద్ధి
తిరుచ్చి       1,37,019    3,28,058    139.9
విజయవాడ  7,46,392    11,78,559    57.9
తిరుపతి       5,84,732    8,34,652    42.7

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top