ఓట్ల పండుగకు.. పయనం..

Hyderabad To Vijayawada Toll Gate In Choutuppal - Sakshi

టోల్‌ప్లాజా వద్ద వాహనాల బారులు 

మంగళవారం అర్ధరాత్రి నుంచే  ప్రారంభమైన రద్దీ 

రాత్రి భారీగా స్తంభించిన వాహనాలు

సాక్షి, చౌటుప్పల్‌ (మునుగోడు): హైదరాబాద్‌–విజయవాడ 65వ నంబర్‌ జాతీయ రహదారి బుధవారం జనజాతరను తలపించింది. ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకునేందుకు హైదరాబాద్‌లో స్థిరపడిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన ప్రజానీకం పెద్దఎత్తున తమ స్వగ్రామాలకు తరలివెళ్తోంది. దీంతో హైవేపై వాహనాల రద్దీ ఏర్పడింది.  రాత్రికి అనూహ్యంగా రెండింతలకు పెరిగింది. టోల్‌ప్లాజా నుంచి కిలోమీటరున్నర దూరంలో ఉన్న జిల్లేడుచెలుక గ్రామం వరకు వాహనాలు  స్తంభించాయి. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని రాయలసీమ మినహా.. మిగతా 9 జిల్లాల ప్రజానీకం ఈ రహదారి మీదుగానే వెళ్తుంటారు.

వేలాది వాహనాలు ఒక్కసారిగా వస్తుండడంతో చౌటుప్పల్‌ వద్ద జాతీయ రహదారిపై విజయవాడ మార్గంలో ఎక్కడ చూసినా వాహనాలే కనిపించాయి. హైదరాబాద్‌–విజయవాడ జాతీయ రహదారికి అనుసం«ధానంగా  నార్కట్‌పల్లి–అద్దంకి రహదారి సైతం ఉండడంతో రద్దీ భారీగా ఏర్పడింది. పంతంగి టోల్‌ప్లాజా పరిసరాలు వాహనాలతో కిక్కిరిసాయి. ఇరువైపులా 16ద్వారాలు ఉండగా విజయవాడ వైపు 11 గేట్లు తెరిచా రు. వాహనాలు ఎక్కువసేపు నిలిచి ఉండడంతో.. వాహనదారులు, టోల్‌ సిబ్బంది నడుమ ఘర్షణ తలెత్తింది. పోలీసులు జోక్యం చేసుకోవడంతో సద్దుమనిగింది. సంక్రాంతి పండగ సందర్భంగా ఏర్పడే రద్దీతో పోలిస్తే ప్రస్తుతం ఏర్పడిన రద్దీ ఎక్కువే అని చెప్పవచ్చు.  

హైవేపై వాహనాల రద్దీ
కేతేపల్లి (నకిరేకల్‌) :
తెలుగు రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించుకునేందుకు స్వస్థలాలకు వెళ్లవారి వాహనాలతో 65 నంబరు జాతీయ రహదారిపై బుధవారం రద్దీ కొనసాగింది. జాతీయ రహదారిపై బుధవారం సాయంత్రం ప్రారంభమైన వాహనాల రద్దీ రాత్రికి పెరిగింది. కొర్లపహాడ్‌ టోల్‌ప్లాజా వద్ద ఫీజు చెల్లించేందుకు వాహనాలు బారులుదీరాయి. వాహనాల రద్దీకి అనుగుణంగా టోల్‌ప్లాజా నిర్వహకులు విజయవాడ వైపు కౌంటర్లు పెంచారు. దీంతో టోల్‌ప్లాజా వద్ద ఎలాంటి ట్రాఫిక్‌జామ్‌కు ఆస్కారం లేకుండా వాహనాలు సాఫీగా వెళ్లాయి.   

మాడ్గులపల్లి వద్ద ట్రాఫిక్‌ జామ్‌
మాడుగులపల్లి (నల్లగొండ) :
ఈనెల 11న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో జరిగే ఎన్నికలకు హైదరబాద్‌లో నివాసవుంటున్న ఆంధ్ర ప్రజలు బుధవారం సొంతూళ్లకు ప్రయాణా కావడంతో.. అద్దంకి–నార్కట్‌పల్లి రహదారిపై మాడ్గులపల్లి టోల్‌ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. సుమారు కిలో మీటరు మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top