కైట్స్‌ ఎగిరే.. స్వీట్స్‌ అదిరే!

Hyderabad Kites Festival In Parade Grounds - Sakshi

అంబరాన ఆనంద విహారం  

అధరాన రుచులు సుమధురం  

మిఠాయిలు, పతంగులతో పరేడ్‌ గ్రౌండ్‌కు నూతన శోభ  

సాక్షి, సిటీబ్యూరో: కైట్, స్వీట్‌ ఫెస్టివల్‌తో సికింద్రాబాద్‌లోని పరేడ్‌ గ్రౌండ్‌ జనసందోహంగా మారింది. ఆనందాల పతంగులు అంబరంలో విహరించాయి. మిఠాయిల రుచుల సంగమం నోరూరించాయి.  టూరిజం, సాంస్కృతిక శాఖలు ఒకరోజు ముందే నగరానికి సంక్రాంతి శోభను తీసుకువచ్చాయి. సందర్శకుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపాయి. ఆదివారంఅంతర్జాతీయ కైట్‌ అండ్‌ స్వీట్‌ ఫెస్టివల్‌ను ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రారంభించారు.

విభిన్న ఆకారాల గాలిపటాలు, దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలకు చెందిన స్వీట్లు అదరహో అనిపించాయి.  వేడుకల్లో 20 దేశాల నుంచి 42 మంది కైట్‌ ఫ్లైయర్స్, 60 దేశవాళీ కైట్‌ క్లబ్‌ సభ్యులు పాల్గొన్నారు. థాయ్‌లాండ్, సింగపూర్, సౌత్‌కొరియా, ఇండోనేషియా, చైనా, ఫ్రాన్స్, సౌత్‌ ఆఫ్రికా, శ్రీలంక, టర్కీ తదితర దేశాల నుంచి వచ్చిన ఔత్సాహికులు పతంగులతో సందడిచేశారు.  స్వీట్‌ ఫెస్టివల్‌లో భాగంగా 22 విదేశాలు, దేశంలోని 25 రాష్ట్రాలకు చెందిన 1,200 రకాల స్వీట్లు కొలువుదీరాయి. ఈ నెల 15 వరకు ఫెస్టివల్‌ కొనసాగనుంది.  కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్‌ స్వామిగౌడ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి, పర్యాటక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం, సాంస్కృతిక శాఖ డైరెక్టర్‌ మామిడి హరికృష్ణ పాల్గొన్నారు.  

పక్షులకు ప్రాణాంతకం కావొద్దు
అంతర్జాతీయ కైట్‌ ఫెస్టివల్‌లో పక్షి ప్రేమికుడు సత్తి రామచంద్రారెడ్డి ఓ స్టాల్‌ ఏర్పాటు చేశారు. పతంగులకు మాంజా వాడకూడదని, కాటన్‌ దారాలను ఉపయోగించాలని అవగాహన కల్పించారు. పట్టణ ప్రాంతాల్లో ఉండే చిన్న పక్షులు కనుమరుగు కాకుండా వాటికి గూళ్లు ఏర్పాటు చేయడం, తాగునీరు అందించాలని, బాల్కనీ లేదా టెర్రస్‌పై దాణా ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు.  

తియ్యని వేడుక
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో ప్రారంభమైన స్వీట్‌ ఫెస్టివల్‌లో తెలుగురుచులతో పాటు దేశంలోని అన్ని రాష్ట్రాల స్వీట్లు రుచి చూడవచ్చు. అవీ సరిపోలేదనుకుంటే అంతర్జాతీయ రుచులను ఆస్వాదించవచ్చు. అర్జెంటీనా, నేపాల్, అఫ్గానిస్థాన్, సోమాలియా, కొరియా, ఇటలీ, శ్రీలంక, జర్మనీ, ఫ్రాన్స్, బ్రిటన్‌ ఇలా 22 దేశాల స్వీట్లతో పాటు అసోం, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, గుజరాత్, బెంగాలీ ఇలా 25 రాష్ట్రాల తీపి వంటలూ ఇక్కడకొలువుదీరాయి.  

నేపాల్‌..
రాధిక, ఐశ్వర్య, జెమిశ్, సునీల్, రమేశ్, సంత్‌ బహదూర్‌ మేమంతా నేపాల్‌ నుంచి వచ్చాం. ఇక్కడే చాలా ఏళ్లుగా ఉంటున్నాం. ఈ ఫెస్టివల్‌లో నేపాల్‌లో బాగా పాపులరైన సిల్‌కోట్, గోర్కలీ చట్నీని మా స్టాల్‌లో అందిస్తున్నాం.   

అసోం..  
మేం అసోంలోని గువాహటి నుంచి వచ్చాం. చందన, సరపర్ణ, మొనాలిసా, పాపోరి నలుగురం కలిసి మా ప్రాంతంలో చేసే నల్లబియ్యం, తెల్లబియ్యం పాయసం చేశాం. ఇక్కడ ఇలా తొలిసారి అస్సాం వంటలు అందరితో పంచుకోవటం మాకు పండగలా ఉంది.  

బెంగళూరు..
మేం గృహిణులం. బెంగుళూరు నుంచి ఈ ఫెస్టివల్‌లో పాల్గొనడానికి వచ్చాం.  బియ్యం పిండితో చేసిన రోజ్‌ ఫ్లవర్స్‌ చూడటానికి అలంకరణ కోసం తెచ్చుకునే పూలలా ఉన్నా వీటిని బియ్యం పిండితో తయారు చేశాం. 7 కప్‌ కేక్స్‌ నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top