భూ మాఫియా నుంచి కాపాడండి

Huzurnagar Bypolls Lakshmi Narasamma Land Mafia Elections KCR - Sakshi

సాక్షి, సూర్యాపేట: భూమాఫియా దురాగతాల నుంచి తమను కాపాడలంటూ లక్ష్మీ నర్సమ్మ అనే 85 ఏళ్ల వృద్ధురాలు హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికల్లో నామినేషన్‌ వేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో లక్ష్మీ నరసమ్మ సోమవారం ఓ ప్రెస్‌ నోట్‌ విడుదల చేశారు. దానిలో తాను ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి ప్రజలకు తెలియజేశారు. ఆ వివరాలు.. 85 ఏళ్ల వయసులో గెలుస్తాననో.. గెలవాలనో ఎన్నికల్లో పోటీ చేయడం లేదు.. ప్రచారం చేసే ఉద్దేశం కూడా లేదని తెలిపారు లక్ష్మీ నర్సమ్మ. పోటీ చేయడానికి దారి తీసిన పరిస్థితులను, తన కుటుంబానికి జరిగిన అన్యాయం గురించి ప్రభుత్వానికి, ప్రజలకు తెలపాలనే ఉద్దేశంతోనే పోటీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. తమ కుటుంబానికి ఎంతో విలువైన భూమి ఉందని.. కానీ తాను, తన పిల్లలు పేదరికంలోనే మగ్గుతున్నామని తెలిపారు లక్ష్మీ నర్సమ్మ.

మొత్తం 179 ఎకరాల భూమి..
తమది  సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం శోభనాద్రిగూడెం గ్రామం అని తెలిపారు. 1940-50 మధ్య కాలంలో తన భర్త అచ్యుత రామశ్యాస్త్రి నిజాంకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో పాల్గొన్నారని.. జైలుకు కూడా వెళ్లారని తెలిపారు. ఆ కాలంలో గ్రామంలో తమకు సర్వే నంబర్‌ 488లో 179 ఎకరాల భూమి ఉండేదన్నారు. అంతేకాక సీలింగ్‌ యాక్ట్‌ వచ్చినప్పుడు తన భర్త స్వయంగా 79 ఏకరాల భూమిని ప్రభుత్వానికి ఇచ్చారని తెలిపారు. తమకు 13 మంది సంతానం అని.. ఉన్న వంద ఎకరాల భూమిని కుమారులకు సమంగా పంచి.. 30 ఏళ్ల క్రితం తన భర్త మరణించాడని పేర్కొన్నారు. ఈ భూమికి పట్టాలు ఉన్నాయని తెలిపారు. తమ భూమి పరిసర ప్రాంతంలో పులిచింతల ప్రాజెక్ట్‌ రావడంతో భూమికి డిమాండ్‌ పెరిగిందని దాంతో భూమాఫియా కన్ను తమ భూమి మీద పడిందన్నారు లక్ష్మీ నర్సమ్మ.

భూమాఫియా బెదిరింపులు..
భూమాఫియాకు జడిసి ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళితులు, గిరిజనులకు భూమి పథకంలో భాగంగా తమ భూమిని విక్రయించేందుకు నిర్ణయించామన్నారు. ఇందుకు అప్పటి జిల్లా కలెక్టర్‌ కూడా అంగీకరించారన్నారు. కానీ భూమాఫియా దళితులకు భూమి అమ్మడానికి వీలు లేదని.. తమకే అమ్మాలని.. అది కూడా అతి తక్కువ ధరకే అమ్మాలని తమను బెదిరిస్తున్నారని లక్ష్మీ నర్సమ్మ వాపోయారు. ఈ క్రమంలో తమ కుమారులపై దాడి కూడా చేశారన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే.. మీరు కూడా దాడి చేయండి అని సలహా ఇచ్చారన్నారు. ఈ విషయంలో ఇప్పటి వరకు కలెక్టర్‌, డీజీపీ, ఎస్పీ స్థాయి అధికారులతో పాటు తహశీల్దార్‌కు కూడా ఫిర్యాదు చేశామని.. ఫలితం లేదని వాపోయారు. తనకు పసుపు కుంకుమల కింద ఇచ్చిన భూమిని కూడా కబ్జా చేశారని లక్ష్మీనర్సమ్మ ఆవేదన వ్యక్తం చేశారు.

కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లాలనే..
దాంతో ఈ సమస్యను ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే తాను ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు లక్ష్మీనర్సమ్మ పేర్కొన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పట్ల తమకు ఎలాంటి వ్యతిరేకత లేదన్నారు. పైగా తమ కుటుంబంలోని 10 మంది ప్రభుత్వం ప్రవేశ పట్టిన రైతుబంధు పథకం లబ్ధిదారులే అన్నారు. ఇందుకు కేసీఆర్‌కు సర్వదా రుణపడి ఉంటామని తెలిపారు. ఇప్పుడు తాను చేసే ఈ చిరు ప్రయత్నం ద్వారా సమస్య పరిష్కారం అయ్యి.. తన కుమారులైన బాగా బతకాలని ఓ తల్లిగా ఆరాట పడుతున్నానని.. ఇందులో స్వార్థం లేదని అర్థం చేసుకోవాలని లక్ష్మీ నర్సమ్మ విజ్ఞప్తి చేశారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top