వేధిస్తున్నాడని.. చంపేసింది | Sakshi
Sakshi News home page

వేధిస్తున్నాడని.. చంపేసింది

Published Sat, Nov 1 2014 2:35 AM

వేధిస్తున్నాడని.. చంపేసింది - Sakshi

* భర్తను గొడ్డలితో నరికి హతమార్చిన భార్య
* శంషాబాద్ మండలం ఘాంసిమియాగూడ శివారులో ఘటన  

శంషాబాద్ రూరల్: మద్యానికి బానిసైన భర్త నిత్యం వేధిస్తుండడంతో భరించలేని భార్య ఆయనను గొడ్డలితో నరికి చంపేసింది. ఈ సంఘటన శంషాబాద్ మండలం ఘాంసిమియాగూడ శివారులో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. దోమ మండలం మోత్కూరుకు చెందిన దీమ వెంకటయ్య(37) కుల్కచర్ల మండలం బండి ఎల్కచర్ల నివాసి అయిన తన అక్క కూతురు కమలమ్మ అలియాస్ చిన్నమ్మను పదేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నాడు. వీరికి కుమారులు నవీన్(9), శ్రీకాం త్(6) ఉన్నారు. వెంకటయ్య మద్యానికి బానిసై నిత్యం భార్యను వేధిస్తున్నాడు.

ఇదిలాఉండగా మహబూబ్‌నగర్ జిల్లా కొందుర్గు మండలం కాసులబాద్ నివాసి సిద్ధులు కమలమ్మకు పెద్దమ్మ కొడుకు వరుస. ఇతను ఏడాది క్రితం శంషాబాద్ మండలం ఘాంసిమియాగూడకు వలస వచ్చి గ్రామ శివారులోని ఓ పౌల్ట్రీఫాంలో పనిచేస్తున్నాడు. సోదరి అయిన కమలమ్మ మోత్కూరులో గొడవపడుతుండడంతో ఆయన దంపతులను నెల రోజుల క్రితం తీసుకొచ్చి తాను పనిచేసే పౌల్ట్రీఫాంకు సమీపంలోని ఓ వ్యవసాయ క్షేత్రంలో పనికి కుదిర్చాడు. అయినా వెంకటయ్య ప్రవర్తనలో మార్పు రాలేదు.  గురువారం రాత్రి 9 గంటలకు మద్యం తాగి వచ్చిన వెంకటయ్య భార్యతో గొడవపడ్డాడు. దీంతో కమలమ్మ వెళ్లి సిద్ధులుకు విషయం చెప్పి ఆయనను తీసుకొచ్చింది.  
 
గొడ్డలితో మెడ నరికి..
వెంకటయ్య మరోమారు కమలమ్మ, సిద్దులుతోనూ గొడవపడ్డాడు. తమనెక్క డ చంపేస్తాడోనని కమలమ్మ భయపడి అక్కడే ఉన్న కారం పొడిని భర్త ముఖం పై చల్లింది. దీంతో వెంకటయ్య కింద పడిపోయాడు. వెంటనే కమలమ్మ గొడ్డలి తీసుకుని ఆయన మెడపై నరకడంతో అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. గొడ్డలిని గదిలోనే ఓ చోట దాచిపెట్టి, దానికి ఉన్న కట్టెను పొదల్లో పడేశారు. తర్వాత సిద్ధులు అక్కడి నుంచి వెళ్లి దుస్తులు మార్చుకున్నాడు.

శుక్రవారం ఉదయం ఏమి తెలియనట్లుగా సిద్ధులు తన మామ చనిపోయాడంటూ స్థానికులకు చెప్పా డు. పోలీసులు  ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మొదట్లో తమకేమి తెలియదని బుకాయించిన కమలమ్మ, సిద్ధులు చివరకు నేరాన్ని అంగీకరించారు. హత్యకు వినియోగించిన గొడ్డలిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను ఠాణాకు తరలించారు. పోలీసులు పోస్టుమార్టం అనంతరం మృ తదేహాన్ని బంధువులకు అప్పగించారు.
 
అయ్యో పాపం..
తండ్రి హత్యకు గురికావడం.. తల్లి జైలు కు వెళ్లాల్సి రావడంతో చిన్నారులు నవీ న్, శ్రీకాంత్‌లు అనాథలయ్యారు.

Advertisement
Advertisement