సాయం ఆపేస్తే ఫీజులు పెంచే ప్రమాదం 

High Courts on Unaided and Aided Courses - Sakshi

ఎయిడెడ్‌ కోర్సుల్ని అన్‌ఎయిడెడ్‌ చేయడంపై హైకోర్టు  

సాక్షి, హైదరాబాద్‌: ఎయిడెడ్‌ కోర్సుల్ని అన్‌–ఎయిడెడ్‌గా మార్పు చేసి ఆర్థిక సాయాన్ని ఆపేస్తే ఆయా విద్యా సంస్థలు ఫీజుల్ని ఇష్టానుసారంగా పెంచే ప్రమాదం ఉందని హైకోర్టు అభిప్రాయపడింది. ఎయిడెడ్‌ కోర్సులకు ఇచ్చే ఆర్థిక సాయం నిలిపివేస్తూ ఈ ఏడాది మే 9న కళాశాల విద్యా శాఖ కమిషనర్‌ జారీ చేసిన ఉత్తర్వుల్ని సవాల్‌ చేస్తూ జగిత్యాల జిల్లాకు చెందిన శంకర్‌ ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఈ పిల్‌ను ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్‌ జె.ఉమాదేవిలతో కూడిన డివిజన్‌ బెంచ్‌ బుధవారం విచారించింది.

ప్రభుత్వ భూముల్ని తీసుకుని ఏర్పాటు చేసిన ఎయిడెడ్‌ కళాశాలలు ఆ తర్వాత ప్రభుత్వ పర్యవేక్షణ లేకుండా నిర్వహించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయని పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదించారు. అందులో భాగంగానే ఈ ఉత్తర్వులు జారీ అయ్యాయని, దీని వల్ల పేదలకు విద్య ఆర్థికంగా భారం కాబోతోందని తెలిపారు. ప్రవేశాలు, ఫీజులు నిర్ణయించడం ప్రభుత్వ పర్యవేక్షణలోనే ఉంటాయని ప్రభుత్వ న్యాయవాది వివరణ ఇచ్చారు. ప్రతివాదులైన ఉన్నత విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి, కళాశాల విద్యా శాఖ కమిషనర్‌లు తమ వాదనలతో కౌంటర్లు దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను వాయిదా వేసింది.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top