చీపురుతో కొడితే చనిపోయారా?

High court has expressed awe in the allegations of Police - Sakshi

చీపురేమన్నా మరణాయుధమా? 

ఇది మేం నమ్మాలా? 

విస్మయం వ్యక్తం చేసిన హైకోర్టు 

సాక్షి, హైదరాబాద్‌: చీపురు కట్ట.. అది కూడా విరిగిపోయిన చీపురుతో కొట్టడం వల్లే ఓ మహిళ మృతి చెందిందన్న పోలీసుల ఆరోపణపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. చీపురుతో కొడితే చనిపోతారా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. కొడితే చనిపోవడానికి చీపురు ఏమైనా మారణాయుధమా అంటూ ప్రాసిక్యూషన్‌ను ప్రశ్నించింది. కేసు పూర్వాపరాల్లోకి వెళ్లకుండా హత్యారోపణలు ఎదుర్కొంటున్న తల్లీ కొడుకులకు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది.

ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్‌ రాఘవేంద్ర సింగ్‌ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్‌ ఎ.రాజశేఖర్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. కరీంనగర్‌ జ్లిలాకు చెందిన తూర్పాటి కామాక్షి అనే మహిళను యు.వెంకటమ్మ, ఆమె కుమారుడు రాజశేఖర్‌లు చీపురు కట్టతో కొట్టి చంపారంటూ పోలీసులు కేసు నమోదు చేశారు.

విచారణ జరిపిన కింది కోర్టు.. వీరిద్దరికీ యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. దీనిపై వారు హైకోర్టులో అప్పీల్‌ దాఖలు చేశారు. బెయిల్‌ మంజూరు చేయాలని కోరారు. దీనిపై విచారణ సందర్భంగా వెంకటమ్మ, రాజశేఖర్‌ల తరఫు న్యాయవాది ఎన్‌.హరినాథ్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. మహిళను నడిరోడ్డుపై విరిగిన చీపురుతో కొట్టి చంపారని పోలీసులు ఆరోపిస్తున్నారని ధర్మాసనానికి తెలిపారు. డాక్టర్‌ నివేదిక ప్రకారం పక్కటెముకలు విరిగి, బ్రెయిన్‌లో రక్తం గడ్డ కట్టడం వల్ల చనిపోయినట్లు తేలిందని చెప్పారు. ఇది హత్య కాదని పేర్కొన్నారు. అయితే ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం ఆ మహిళది హత్యేనని పోలీసుల తరఫు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ తెలిపారు.

పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ వాదనలతో ఏకీభవించని ధర్మాసనం.. తాము ఈ కేసు పూర్వాపరాల్లోకి ప్రస్తుతం వెళ్లట్లేదని తెలిపింది. నిందితులిద్దరికీ షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది. ఇరువురూ చెరో రూ.30 వేల చొప్పున పూచీకత్తు సమర్పించాలని ఆదేశించింది. జైలు నుంచి విడుదలైన వెంటనే నివాస ధ్రువీకరణ పత్రాలు పోలీసులకు ఇవ్వాలని, అలాగే ప్రతి సోమవారం పోలీసుల ముందు హాజరు కావాలని సూచించింది. కేసు విచారణ సందర్భంగా కోర్టు ముందు హాజరు కావాలని స్పష్టం చేసింది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top