హామీలు అమలు చేయకపోతే ధిక్కారమే

High Court clearance to both states - Sakshi

‘డీఈఈల’ కేసులో రెండు రాష్ట్రాలకు హైకోర్టు స్పష్టీకరణ  

8వ తేదీలోగా ఏపీకి జాబితా ఇస్తాం: తెలంగాణ 

జాబితా అందిన 4 నెలల్లోగా సీనియార్టీ ఖరారు చేస్తాం: ఏపీ

సాక్షి, హైదరాబాద్‌: నీటిపారుదల శాఖలో రాష్ట్ర విభజనకు ముందున్న డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్ల (డీఈఈ) సీనియార్టీ తుది జాబితా ఖరారు విషయంలో రెండు తెలుగు రాష్ట్రాలు ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే కోర్టు ధిక్కారంగా పరిగణిస్తామని హైకోర్టు పేర్కొంది. రాష్ట్ర విభజనకు పూర్వం ఉన్న ఉద్యోగుల ప్రకారం జోన్‌ 5, జోన్‌ 6లలోని డీఈఈల సీనియార్టీ జాబితాను ఈ నెల 8లోగా ఏపీ సర్కార్‌కు అందజేస్తామని తెలంగాణ ప్రభుత్వం హైకోర్టుకు హామీ ఇచ్చింది. తెలంగాణ నుంచి జాబితా అందిన నాలుగు నెలల్లోగా సీనియార్టీ జాబితాను ఖరారు చేస్తామని ఏపీ సర్కార్‌ కూడా హైకోర్టుకు స్పష్టం చేసింది. రెండు ప్రభుత్వాల హామీలను ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ సురేశ్‌ కుమార్‌ కెయిత్, జస్టిస్‌ అభినంద్‌ కుమార్‌ షావిలిలతో కూడిన ధర్మాసనం రికార్డుల్లో నమోదు చేసింది. వీటిని అమలు చేయనిపక్షంలో కోర్టు ధిక్కారంగా పరిగణిస్తామని ఇటీవల ధర్మాసనం ప్రకటించింది.  

ఇదీ నేపథ్యం...  
డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్లకు ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్లుగా (ఈఈ) పదోన్నతులు కల్పించే విషయంలో తెలంగాణ ఓ సీనియారిటీ జాబితా రూపొందించింది. ఈ జాబితాను సవాల్‌ చేస్తూ కొందరు ఇంజనీర్లు హైకోర్టును ఆశ్రయించారు. రాష్ట్ర పునర్విభజన చట్టం నిబంధనల ప్రకారం సీనియారిటీ జాబితా రూపొందించే అధికారం ఆంధ్రప్రదేశ్‌కు మాత్రమే ఉందని, అందువల్ల ఈఈ పదోన్నతులకు తెలంగాణ ఈఎన్‌సీ రూపొందించిన సీనియారిటీ జాబితా అమలును నిలిపేయాలని వారు వాదించారు.

ఒకే బ్యాచ్‌కు చెందిన ఇంజనీర్లు కొందరు ఐదో జోన్‌లో చీఫ్‌ ఇంజనీర్‌ స్థాయిలో ఉంటే, అదే బ్యాచ్‌కు చెందిన ఇంజనీర్లు జోన్‌–6లో డిప్యూటీ ఇంజనీర్ల స్థాయిలోనే పనిచేస్తున్నారని, సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం జూనియర్ల కింద సీనియర్లు పనిచేయరాదని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం విడిగా పదోన్నతులు కల్పిస్తే తమకు అన్యాయం జరుగుతుందని హెచ్‌.మనోహర్‌ మరో ఇద్దరు దాఖలు చేసిన కేసులో గతంలో హైకోర్టు.. సీనియార్టీ జాబితా విషయంలో ముందుకెళ్లవద్దని మధ్యంతర ఆదేశాలిచ్చింది. తాజాగా రెండు తెలుగు రాష్ట్రాలు జాబితాపై హామీ ఇవ్వడంతో వ్యాజ్యాలు పరిష్కారమైనట్లు ధర్మాసనం ప్రకటించింది.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top