హెల్మెట్‌పెట్టు.. నీళ్లు పట్టు..

Helmet Compulsory For Taking Drinking Water In Adilabad Police Headquarter - Sakshi

శిరస్త్రాణం ఉంటేనే మినరల్‌వాటర్‌

ఏఆర్‌ హెడ్‌క్వార్టర్‌ వాటర్‌ ప్లాంటులో నిబంధన

ఆదేశాలు జారీ చేసిన ఎస్పీ

ఆదిలాబాద్‌కల్చరల్‌ : అది జిల్లా కేంద్రంలోని పోలీసు ఆర్మ్‌డ్‌ రిజర్వు(ఏఆర్‌)హెడ్‌క్వార్టర్‌. జిల్లా పోలీసు సిబ్బందికి తాగునీరు అందించే వాటర్‌ప్లాంట్‌ ఇక్కడే ఉంది. ఇందులో కొత్తేమి ఉందనుకుంటే మీరు మినరల్‌వాటర్‌లో కాలేసినట్లే.. పోలీసు సిబ్బందికి ప్యూరిపైడ్‌ డ్రింకింగ్‌ వాటర్‌ సప్లై చేస్తున్న ఈ వాటర్‌ ప్లాంట్‌కు వెళ్లి మంచినీరు తెచ్చుకోవాలంటే హెల్మెట్‌ తప్పక ధరించి వెళ్లాల్సిందే. హెల్మెట్‌ లేకపోతే అక్కడ నీరు సరఫరా చేయరు. మంచి నీటికి హెల్మెట్‌కు ఏమిటీ సంబంధం అని అనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ చదవండి.

ప్రతీరోజు ఎంతో మంది వాహనదారులు రోడ్డు భద్రత నిబంధనలు పాటించకుండా ప్రమాదాలకు గురవుతుండటం నిత్యం మనం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువగా చనిపోతుండటం జరుగుతోంది. ప్రమాదాలు జరిగిన చాలా సందర్భాల్లో ద్విచక్రవాహనం నడుపుతున్నప్పుడు శిరస్త్రాణం ధరించకపోవడమే ప్రధాన కారణంగా కనిపిస్తోంది. రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువగా హెల్మెట్‌ లేకపోవడంతోనే చాలామంది మృత్యువాత పడుతున్నారు. హెల్మెట్‌ ధరించి ఉంటే బతికేవాడేమోనని అందరూ అనుకోవడం మనం తరచుగా వింటుంటాం. రోడ్డు భద్రత నిబంధనల ప్రకారం రోడ్డుపై బైకు నడుపుతున్న ప్రతీవ్యక్తి హెల్మెట్‌ ధరించడం తప్పనిసరి. ఇటీవల దేవాపూర్‌ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో పోలీసు హెడ్‌కానిస్టేబుల్‌ మరణించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రమాదాలను నివారించేందుకు దీన్ని ముందుగా తమ శాఖలోనే అమలు చేయాలనే ఉద్దేశంతో ఎస్పీ విష్ణు ఎస్‌.వారియర్‌ ఈ నిబంధనలు జారీ చేశారు.

ఎస్పీ ఆదేశాలను పక్కాగా అమలు చేసేందుకు సంబంధిత పోలీసు అధికారులు హెడ్‌క్వార్టర్‌ ప్రధాన ద్వారం వద్ద ప్లెక్లీ సైతం ఏర్పాటు చేశారు. హెల్మెట్‌ లేకుండా లోనికి వెళ్లకుండా అడ్డుకునేలా అక్కడ గార్డులు విధులు నిర్వహించేలా చర్యలు తీసుకోవడం విశేషం. క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచే పోలీసుశాఖలో ఎవరైనా నిబంధనలు పాటించాల్సిందే. ఈ నేపథ్యంలో ఎస్పీ క్యాంపు కార్యాలయానికి, పోలీసుహెడ్‌క్వార్టర్స్‌కు వెళ్లాల్సి వస్తే తప్పనిసరిగా హెల్మెట్‌ ధరించాల్సిందే. హెడ్‌క్వార్టర్‌లోని వాటర్‌ప్లాంటు నుంచి ప్యూరిఫైడ్‌ డ్రింకింగ్‌ వాటర్‌ తెచ్చుకోవాలంటే హెల్మెట్‌ తప్పనిసరిగా పెట్టుకొని వెళ్లాలనే నిబంధన ఇటీవల విధించారు. హెల్మెట్‌లేనివారికి లోనికి అనుమతి నిరాకరించడమే కాకుండా వారికి నీటిక్యాన్‌ పట్టుకోవడానికి నిరాకరిస్తున్నారు. ద్విచక్రవాహనం బయట ఆపి క్యాన్‌తో వెళ్తున్న వారికి సైతం నీరు సరఫరా చేయడం లేదు. దీంతో తప్పనిసరిగా పోలీసు సిబ్బంది హెల్మెట్‌ ధరించి మంచినీటిని ప్లాంటు నుంచి తెచ్చుకుంటున్నారు. ఈ నిబంధన పోలీసులతోపాటు అక్కడికి వెళ్లే సామాన్యులకు సైతం  వర్తించేలా చేయడంతో మంచినీటి కోసం పోలీసు హెడ్‌క్వార్టర్‌ వెళ్లేవారంతా తప్పకుండా హెల్మెట్‌ ధరిస్తున్నారు. ఉదయం పూటా రోడ్డుపై వెళ్లే ఎంతోమంది శిరస్త్రాణం ధరించి మంచినీటీ క్యాన్‌లు పట్టుకెళ్తున్న పోలీసు సిబ్బందిని చూసి ఈ విషయం తెలియనివారు ఆశ్చర్యపోతున్నారు. కాగా ప్రమాదాల బారిన పడకుండా సురక్షితంగా ఉండేందుకు హెల్మెట్‌ను వాడే నిబంధన విధించడం ఎంతో మంచి నిర్ణయమని పలువురు ప్రశంసిస్తున్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top