
కేంద్రంపై ఒత్తిడి తెస్తాం
‘పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ప్రజలకు ఇబ్బందులు కలగ కుండా చర్యలు తీసుకుంటాం.
రాష్ట్రంలో నోట్ల ఇబ్బందులపై హరీశ్‌రావు
సాక్షి, హైదరాబాద్: ‘పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ప్రజలకు ఇబ్బందులు కలగ కుండా చర్యలు తీసుకుంటాం. ఈ విషయమై కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీతో ఇప్పటికే సీఎం కేసీఆర్ మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితుల్లో గ్రామీణ ప్రాంతాలకు చిన్న నోట్లు వెళ్లే విధంగా చర్యలు తీసుకోవాల్సి ఉంది. రైతులకు ఇబ్బం దులు కలగకుండా మైక్రో ఏటీఎంలను ఏర్పా టు చేశాం. రైతు బంధు పథకంతో మార్కెట్లో తగిన ధర రానప్పుడు ధాన్యాన్ని మార్కెట్‌లోని గోదాంలోనే భద్రపరిచి ధాన్యం విలువలో 75 శాతం అప్పుడే తీసుకుని వెళ్లొచ్చు. తమ ఉత్ప త్తులను ఆరు నెలల్లోగా అమ్ముకుని, గతంలో తీసుకున్న మొత్తాన్ని తిరిగి చెల్లించే వీలుంది. 2004లో గరిష్టంగా రూ.లక్ష తీసుకునేందుకు వీలు కల్పించగా, ఇప్పుడు దాన్ని రూ.2 లక్షలకు పెంచడంతోపాటు, గతంలోని 3 శాతం వడ్డీని తొలగించాం’ అని రైతు బంధు పథకం అమలుపై చర్చ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు.
2017–18లో నీట్ ద్వారా అడ్మిషన్లు: లక్ష్మారెడ్డి
‘2017–18లో నీట్ పరీక్ష ద్వారానే మెడికల్ అడ్మిషన్లను నిర్వహించా ల్సి ఉంటుంది. వచ్చే ఏడాది సిద్దిపేటలో ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రారంభించి, అడ్మిషన్లు చేపట్టే ప్రయత్నం చేస్తాం. సింగరేణి యాజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో సింగరేణిలో మెడికల్ కాలేజీని ప్రారంభించే అవకాశం ఉంది. బీబీనగర్ నిమ్స్‌లో రూరల్ మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసే యోచన ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం 3,550 ఎంబీబీఎస్ సీట్లు, 573 పీజీ సీట్లుండగా, రాష్ట్రం ఏర్పడ్డాక 1,200 ఎంబీబీఎస్, 37 పీజీ సీట్లు పెరిగాయి’ అని మంత్రి లక్ష్మారెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుపై ప్రశ్నకు ఆయన పైవిధంగా సమాధానమిచ్చారు. ఎయిమ్స్ తరహాలో నిమ్స్ ఆస్పత్రి ఆధునీకరణకు చర్యలు ప్రారంభించినట్లు మరో ప్రశ్నకు సమధానంగా తెలిపారు.