గజ్వేల్‌లోని 179 పంచాయతీల్లో బీఆర్‌ఎస్ 92 గెలిచింది: మాజీ మంత్రి హరీశ్‌రావు
గజ్వేల్: కేసీఆర్ ప్రాతినిధ్యం వహి స్తున్న గజ్వేల్ నియోజకవర్గంలోని 179 పంచాయతీల్లో 92 సర్పంచ్ స్థానాలను బీఆర్‌ఎస్సే గెలిచిందని, కాంగ్రెస్ 68 స్థానాలకే పరిమితం కాగా రేవంత్‌రెడ్డి లెక్కలు తారు మారు చేసి చెబుతున్నారని మాజీ మంత్రి హరీశ్‌రావు ధ్వజమెత్తారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం కొడకండ్ల వద్ద ఎఫ్‌డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి తో కలిసి విలేకరులతో మాట్లాడారు.
అబద్ధాలను ప్రచారం చేయడంలో ముఖ్యమంత్రికి ఆస్కార్ అవార్డు ఇవ్వొచ్చని ఎద్దేవా చేశారు. గజ్వేల్‌ను కేసీఆర్ అభివృద్ధిలో ఆదర్శంగా తీర్చిదిద్దారని, అందువల్లే అత్యధిక సంఖ్యలో బీఆర్‌ఎస్ సర్పంచ్ స్థానాలను గెలుచుకుందని తెలిపారు. ఫుడ్ పాయిజన్ కారణంగా విద్యార్థులు ఆస్పత్రి పాలవుతున్నా, ఎంజీఎం ఆస్పత్రిలో రోగులను ఎలుకలు కొరుకుతున్నా సీఎంకు కనపడక పోవడం సిగ్గుచేటని దుయ్యబట్టారు. కాంగ్రెస్ కండువాలను కప్పుకున్న ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయకపోవడం ప్రజలంతా గమనిస్తున్నారన్నారు.


