అధికార పార్టీలో.. అంతర్మథనం | Group Politics In TRS Nalgonda | Sakshi
Sakshi News home page

అధికార పార్టీలో.. అంతర్మథనం

Jul 29 2018 11:04 AM | Updated on Mar 18 2019 9:02 PM

Group Politics In TRS Nalgonda - Sakshi

సాక్షిప్రతినిధి, నల్లగొండ: అధినేత నిర్వహిస్తున్న పార్టీ అంతర్గత సర్వేలతో ఏ స్థానంలో ఎంత బలంగా ఉన్నామో, ఎన్నికల నాటికి ఎంత పుంజుకోగలమో అన్న అంశాల్లో అధికార టీఆర్‌ఎస్‌ నాయకత్వానికి ఒకింత స్పష్టత వస్తున్నట్లు తెలుస్తోంది. మూడేళ్లుగా విడతల వారీగా ఎమ్మెల్యేల పనితీరు, ప్రభుత్వ పథకాలపై జనాల్లో ఉన్న ఆదరణ, పార్టీ పరిస్థితిపై సర్వేల ద్వారా అవగాహనకు వస్తున్న ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ ముఖ్యమైన కొన్ని స్థానాలపై సూచనలు చేశారని సమాచారం. ప్రధానంగా ఉమ్మడి నల్ల గొండ జిల్లా పరిధిలోని హుజూర్‌నగర్, నాగార్జునసాగర్, నల్లగొండ నియోజకవర్గాలపై టీఆర్‌ఎస్‌ ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తోంది. ఈ మూడు చోట్ల నుంచి పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత జానారెడ్డి, సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

ఈ స్థానాల్లో తమ పార్టీ, ఇన్‌చార్జుల పరిస్థితి, తదితర అంశాలపై వచ్చిన సమాచారంపై చర్చ జరిగిందని చెబుతున్నారు. ఈ మూడు నియోజకవర్గాల్లో గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ఓటమి పాలైంది. నల్లగొండలో మూడో స్థానంలో నిలిచింది. అంతే కాకుండా కాంగ్రెస్‌లో ముఖ్యులుగా ఉన్న ఈ ముగ్గురు నాయకులు ఆయా స్థానాల వరుసగా గెలుస్తూ వస్తున్నారు. ఈ కారణంగానే ఈసారి ఎలాగైనా ఈ స్థానాలను సొంతం చేసుకోవాలన్న పట్టుదలతో టీఆర్‌ఎస్‌ ఉంది. కానీ, వివిధ సర్వేల్లో వస్తున్న ఫలితాలను బట్టి, ఇక్కడ ఏం చేసినా పెద్దగా ఉపయోగం ఉండదన్న అభిప్రాయానికి నాయకత్వం వచ్చిందని, ఎన్నికల ముందు చూసుకోవచ్చన్న నిర్ణయంతో ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ మూడు చోట్ల ఇన్‌చార్జులకు ఆయా సర్వేల్లో వస్తున్న శాతాలు విస్మయం కలిగించేవిగా ఉండడం, విపక్షానికి చెందిన ఎమ్మెల్యేలకే ఒకింత అనుకూలంగా ఫలితాలు ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు.


టీఆర్‌ఎస్‌ గ్రూపులే కాంగ్రెస్‌కు బలం
కాంగ్రెస్‌ ముఖ్యనేతలున్న ఈ మూడు చోట్ల మాత్రమే కాకుండా జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్‌లో గుంపుల లొల్లి నడుస్తోంది. చివరకు సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు ఉన్న చోటా గ్రూపుల గొడవ ఉంది. గత ఎన్నికల్లో ఓటమి పాలై, ప్రస్తుతం ఇన్‌చార్జులు ఉన్న స్థానాల్లోనూ ఇదే పరిస్థితి. ఇతర పార్టీల ఎమ్మెల్యేలు తమ పార్టీలోకి మారిన చోటా గ్రూపుల తలనొప్పి తప్పడం లేదని చెబుతున్నారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న హుజూర్‌నగర్‌లో గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ రెండో స్థానంలో నిలవగా, ఆ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన శంకరమ్మ ప్రస్తుతం పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా వ్యవహరిస్తున్నారు. ఇక్కడ ఒక వర్గం శ్రేణులు ఆమెకు సహాయ నిరాకరణ చేస్తున్నాయన్న అభిప్రాయం ఉంది.

మరో వైపు ఈసారి టికెట్‌ కోసం రేసులో ఉన్న ఎన్‌ఆర్‌ఐ సైదిరెడ్డి కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. స్థానిక, స్థానికేతర అంశాన్ని తెరపైకి తెస్తున్నారు. కనీసం ఇక్కడ టీఆర్‌ఎస్‌లో మూడు గ్రూపులు ఉన్నట్లు చెబుతున్నారు. సీఎల్పీ నేత జానారెడ్డి నియోజకవర్గం నాగార్జునసాగర్‌లో సైతం ఇన్‌చార్జ్‌ నోముల నర్సింహయ్యకు, ఈ సారి పోటీ చేసే అవకాశం కోసం వేచి చూస్తున్న ఎంసీ కోటిరెడ్డి వర్గాలతోపాటు, ఎన్‌ఆర్‌ఐ గడ్డంపల్లి రవీందర్‌రెడ్డి ప్రయత్నాల్లో ఉన్నారు. ఇక్కడా గ్రూపుల లొల్లి ఉంది.  సీఎల్పీ ఉప నేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నల్లగొండలోనూ టీఆర్‌ఎస్‌లో గ్రూపులు నాలుగుకుపైగానే ఉన్నాయి. దుబ్బాక నర్సింహారెడ్డి, కంచర్ల భూపాల్‌రెడ్డి ప్రధాన వర్గాలుగా ఉన్నా,  చకిలం అనిల్‌కుమార్, చాడ కిషన్‌రెడ్డి వంటి వారు తమకు అవకాశం రాకపోతుందా అని ఎదురుచూసే జాబితాలో ఉన్నారు. ఈ గ్రూపులేవీ కలిసి పనిచేయడం లేదు. మిర్యాలగూడ, దేవరకొండ, మునుగోడుల్లో గ్రూపుల్లేకుండా టీఆర్‌ఎస్‌ రాజకీయమే కనిపించడం లేదు. అధికార పార్టీలో ఉన్న ఈ గ్రూపులే ప్రస్తుతం కాంగ్రెస్‌కు బలంగా మారాయన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.


చేరికలతో బలం పెరిగేనా?
పార్టీ ఆవిర్భావం నుంచి తమకు ఏనాడూ దక్కని స్థానాలపై దృష్టి పెట్టిన టీఆర్‌ఎస్‌ ఆయా చోట్ల చేరికల ద్వారా బలం పెంచుకునే దిశలో పనిచేస్తోంది. ప్రధానంగా జిల్లా కేంద్రమైన నల్లగొండలో కోమటిరెడ్డిని ఢీ కొట్టడం కోసం ఆయన అనుచరవర్గాన్ని తమవైపు తిప్పుకునే పనిలో ఉంది. దీనిలో భాగంగానే త్వరలోనే మరికొందరి చేర్చుకునే పనిలో ఉందంటున్నారు. సీఎల్పీ నేత జానారెడ్డిని ఈసారి ఇంటికి పంపిస్తామంటున్న గులాబీ నేతలు ఆ నియోజకవర్గంలో ఏ చిన్న అవకాశం వచ్చినా వదులకోవడం లేదు. కిందిస్థాయి నేతలు, ముఖ్య కార్యకర్తలు ఎవరినీ విడవకుండా పార్టీలోకి ఆహ్వానించి కండువాలు కప్పేస్తున్నారు. ఇదే వ్యూహం దాదాపు అన్ని నియోజకవర్గాల్లో అమలు చేస్తోంది. కాగా, ఎంత కష్టపడినా ఉపయోగం లేదనుకుంటున్న కొన్ని స్థానాలనూ జిల్లాలో టీఆర్‌ఎస్‌ గుర్తించిందన్న ప్రచారమూ జరుగుతుండడం విశేషం.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement