రోగనిరోధక శక్తిని పెంచే వంగడాలు సృష్టించండి

Governor Tamilisai Calls Agricultural Scientists To Create Immune Boosting Crops - Sakshi

వ్యవసాయ శాస్త్రవేత్తలకు గవర్నర్‌ తమిళిసై పిలుపు

సాక్షి,హైదరాబాద్‌: రోగనిరోధక శక్తిని పెంపొందించే వంగడాలను అభివృద్ధిచేసి, అలాంటి పంటలను పండించే విధంగా రైతులను ప్రోత్సహించాలని వ్యవసాయశాస్త్రవేత్తలకు గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ పిలుపునిచ్చారు. మన ముందు తరాలు తీసుకున్న పోషకాహారంతో ఎక్కువ సంవత్సరాలు జీవించారని, కానీ ఇప్పటితరంలో చాలామంది మధుమేహం వస్తుందని వరి అన్నంకు దూరంగా ఉంటున్నారని పేర్కొన్నారు. వరి వంగడాలను శాస్త్రీయంగా పరిశోధించి వాటిలో చక్కెర శాతాన్ని తగ్గించడానికి ప్రయత్నించాలి అని గవర్నర్‌ ఈ సందర్భంగా వ్యవసాయ శాస్త్రవేత్తలను కోరారు. ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయ అధికారులతో గురువారం ఆమె వీడియో కాన్ఫిరెన్స్‌ ద్వారా రాజ్‌భవన్‌ నుంచి సమీక్ష నిర్వహించారు. వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిశోధకులు అభివృద్ధిచేసిన తెలంగాణ సోన అనే ప్రత్యేక వెరైటీని ప్రోత్సహించడం ద్వారా యువతను వరి అన్నానికి దగ్గర చేయవచ్చని తద్వారా మన దక్షిణ భారతదేశ సంప్రదాయాన్ని కూడా కాపాడుకోవచ్చని వివరించారు.

తాటి చెట్టును పూర్వీకులు ఓ కల్పవక్షంగా భావించారని, ఆ చెట్టు ప్రతి భాగం కూడా ఎన్నోరకాలుగా ఉపయోగపడుతుందని ఇప్పడు ఆ చెట్లను కాపాడుకోవడంతోపాటు వాటిని మరింత విస్తృతంగా పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ఆ చెట్టు ద్వారా తయారయ్యే నీరా పానీయంలో ఎన్నో పోషకవిలువలు కలిగివుందని, ఈ పానీయాన్ని ఎక్కువ కాలం నిల్వవుంచే విధంగా పరిశోధనలు జరగాలని వివరించారు. తాటిచెట్టు ద్వారా వివిధ ఉత్పత్తులను తయారుచేసే కుటీర పరిశ్రమలు తమిళనాడు, కేరళలో ఎంతోమందికి ఉపాధి కల్పిస్తున్నాయని అలాగే తాటిచెట్టు తమిళనాడు రాష్ట్ర అధికారిక చెట్టు అని తెలిపారు. అనారోగ్యకరమైన కొన్ని వంటనూనెలతోనే అనేక రోగాలు మొదలవుతున్నాయని ఒక వైద్యురాలిగా తన అనుభవంలో గమనించానని, ఇలాంటి సందర్భంలో ఆరోగ్యకరమైన వంటనూనెల ఉత్పత్తిలో విస్తృత పరిశోధనలు జరగాలని సూచించారు. ఆహారపు అలవాట్లలో వస్తున్న విపరీత పోకడల గురించి, సరైన ఆహారపు అలవాట్లపై అవగాహన కార్యక్రమాలు చేపట్టి ప్రజలను చైతన్యవంతులను చేయాలని పేర్కొన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top