తెలంగాణ తిరుపతిగా ‘యాదాద్రి' | Sakshi
Sakshi News home page

తెలంగాణ తిరుపతిగా ‘యాదాద్రి'

Published Sat, Jan 7 2017 3:40 AM

తెలంగాణ తిరుపతిగా ‘యాదాద్రి' - Sakshi

అద్భుత టెంపుల్‌ సిటీగా ప్రసిద్ధి చెందుతోంది: గవర్నర్‌
లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న నరసింహన్‌ దంపతులు


సాక్షి, యాదాద్రి: యాదాద్రి పుణ్యక్షేత్రం తెలంగాణ తిరుపతిగా అభివృద్ధి చెందుతోందని గవర్నర్‌ నరసింహన్‌ అన్నారు. శుక్రవారం ఆయన కుటుంబ సమేతంగా యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రధానా లయ విస్తరణ పనులను పరిశీలించారు. పనుల పురోగతిపై వైటీడీఏ అధికారులు, ఆర్కిటెక్ట్‌లను అడిగి తెలుసుకున్నారు. పనుల పురోగతిపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గవర్నర్‌ మాట్లాడుతూ.. గర్భాల యానికి మార్పులు చేర్పులు లేకుండా మిగతా విస్తరణ పనులు జరుగుతు న్నాయని పేర్కొన్నారు. అద్భుతమైన రీతిలో చేపట్టిన ఆలయ విస్తరణ పనులు పూర్తయితే యాదాద్రి పుణ్య క్షేత్రం టెంపుల్‌ సిటీగా, దేశంలోనే ప్రముఖ ఆలయంగా ప్రసిద్ధి చెందుతోందని గవర్నర్‌ తెలిపారు. యాదాద్రి క్షేత్రంలో నగదురహిత లావాదేవీలు నిర్వహించడం అభినందనీయ మని చెప్పారు. కాగా, గవర్నర్‌ రెండు దుకాణాల వద్ద ఆగి డిజిటల్‌ లావాదేవీల గురించి అడిగి తెలుసుకున్నారు.

ఆలయ పనులపై ‘పవర్‌ పాయింట్‌’
ప్రధానాలయ విస్తరణ, వివిధ అభివృద్ధి పనులను దేవస్థానం అధికారులు పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా గవర్నర్‌కు వివరించారు. ఎక్కడెక్కడ రాజ గోపురాలు వస్తున్నాయి, మాడ వీధులు ఏ విధంగా వస్తున్నాయి, దివ్యవిమాన గోపురం ఎలా ఉంటుంది, శివాలయం ఏ విధంగా రూపుదిద్దుకోబోతుంది అనే విషయాలను వారు వివరించారు. ఈ సందర్భంగా గవర్నర్‌ పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. స్వామి వారి అభిషేకానికి తిరుపతి తరహాలో బావి నుంచి నీటిని తెచ్చి అభిషేకం చేయాలన్నారు. రోడ్ల విస్తరణను త్వరగా పూర్తి చేయాలన్నారు.

ఆలయ గోపురాలు ఎక్కడ ఏర్పాటు చేస్తారు.. ధ్వజస్తంభం ఎక్కడ, భక్తులు ఎటు వైపు నుంచి స్వామి అమ్మవార్లను దర్శించుకుంటారని, ఆంజనేయస్వామి 108 అడుగుల విగ్రహాన్ని ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. భక్తులు క్షేత్ర పాలకుడిని దర్శించుకున్న తర్వాతే ఆలయంలోకి వెళ్లే విధంగా ఏర్పాటు చేయాలని గవర్నర్‌ సూచించారు. అలాగే శ్రీపర్వతవర్ధిని రామలింగేశ్వరస్వామి, శివాలయం ప్లానింగ్‌ను గవర్నర్‌కు చూపించారు. శివాలయ నిర్మాణానికి సంబంధించిన ప్లానిం గ్‌ పూర్తి అయిందని, త్వరలోనే టెండర్లు పిలు స్తామని అధికారులు గవర్నర్‌కు వివరించారు.

Advertisement
Advertisement