ఇక సీజ్‌!

GHMC Targets Illegal Building Constructions - Sakshi

అక్రమ నిర్మాణాల అడ్డుకట్టకు జీహెచ్‌ఎంసీ వ్యూహం  

కూల్చివేతలకు స్వస్తి

కూలగొట్టినా తిరిగి నిర్మిస్తున్న నేపథ్యంలో నిర్ణయం  

త్వరలోనే అమలు  

సాక్షి, సిటీబ్యూరో: నగరంలో అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట పడడం లేదు. చర్యలు తీసుకుంటున్నామని అధికారులు చెబుతున్నప్పటికీ విచ్చలవిడిగా వెలుస్తున్నాయి. అక్రమ నిర్మాణాలపై వార్తా పత్రికల్లో కథనాలు వచ్చినప్పుడో, హైకోర్టు మందలించినప్పుడో హడావుడిగా చర్యలు చేపడుతున్నా.. ఆ తర్వాత పట్టించుకోవడం లేదు. మరోవైపు కూల్చివేతల సందర్భంగా నిర్మాణాలను పూర్తిగా కూల్చడం లేదు. గోడల వరకు కూల్చివేసి వదిలేస్తుండడంతో అక్రమార్కులు రెండు మూడు నెలలు కాగానే తిరిగి నిర్మిస్తున్నారు. దీంతో అనుమతి లేకున్నా ఏమీ కాదనే ధీమాతో అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నవారు రోజురోజుకూ పెరిగిపోతున్నారు. జీహెచ్‌ఎంసీ ఈ ఏడాది ఇప్పటి వరకే 600కు పైగా అక్రమ నిర్మాణాలు కూల్చివేయడం గమనార్హం. అక్రమ నిర్మాణాలపై మున్సిపల్‌ పరిపాలన శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ అర్వింద్‌కుమార్‌ ఇటీవల  సీరియస్‌ కావడంతో అధికారులు సర్వే నిర్వహించారు. ప్రస్తుతం జరుగుతున్న నిర్మాణాల్లోనూ156 స్ట్రెచ్‌లలో 455 అనధికారికమైనవి ఉన్నట్లు గుర్తించారు. 

అధికారుల అండదండ..  
మరోవైపు టౌన్‌ప్లానింగ్‌ అధికారుల అండదండలతోనే అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నాయనే విమర్శలున్నాయి. ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటున్నా, హెచ్చరికలు చేస్తున్నా క్షేత్రస్థాయి అధికారులు భవన యజమానులతో కుమ్మక్కవుతుండడంతో అక్రమ నిర్మాణాలు ఆగడం లేదనే అభిప్రాయాలున్నాయి. మూడు కూల్చేలోగా మరో ఆరు పుట్టుకొస్తున్నాయి. నగరంలో భూముల విలువ ఎక్కువగా ఉండడం, అద్దెల డిమాండ్‌ కూడా అధికంగా ఉండడంతో రెండంతస్తులకు మాత్రమే అనుమతులుండే చోట నాలుగంతస్తులు వేస్తున్నారు. అదనపు అంతస్తులతో అద్దె రూపంలో భారీ ఆదాయం రావడమే ఇందుకు కారణమని అధికారులు భావిస్తున్నారు. అక్రమ నిర్మాణాలను కూల్చేసేందుకు వెళ్లే అధికారులు మొత్తం భవనాన్ని నేలమట్టం చేయడం లేదు. కేవలం అదనంగా నిర్మించిన అంతస్తులనే కూల్చివేస్తున్నారు. ‘నిబంధనల ప్రకారం అక్రమ నిర్మాణాలను మాత్రమే కూల్చివేయాలి. అందుకే కేవలం వాటినే కూలుస్తున్నాం. అంతేకాకుండా వాటి కూల్చివేతలతో అనుమతి పొందిన కింది అంతస్తులు దెబ్బతినకూడదు. కాబట్టి అక్రమ అంతస్తులను సైతం పూర్తిగా కూల్చకుండా కేవలం కొద్దిపాటి రంధ్రాలు చేస్తున్నామ’ని అధికారులు పేర్కొన్నారు. దీన్ని అవకాశంగా తీసుకొంటున్న అక్రమార్కులు కూల్చిన కొద్ది రోజులకే తిరిగి నిర్మాణం చేపడుతున్నారు.

ఈ నేపథ్యంలో దీనిపై ఆలోచించిన అధికారులు ఇకపై అక్రమ నిర్మాణాలను అధికారికంగా సీజ్‌ చేయాలని భావిస్తున్నారు. ఫైర్‌సేఫ్టీ ఏర్పాట్లు, పార్కింగ్‌ సదుపాయాలు, లైసెన్స్‌ లేని బార్లు, పబ్బులను సీజ్‌ చేసినట్లుగానే అక్రమ నిర్మాణాలను కూడా చేయాలని ఆలోచిస్తున్నారు. తద్వారా అక్రమంగా నిర్మించినా వినియోగానికి అవకాశం ఉండదు. కనుక భవిష్యత్‌లో అక్రమంగా అదనపు అంతస్తులు నిర్మించకుండా ఉంటారని భావిస్తున్నారు. దీంతోపాటు సీజ్‌ చేసిన వాటిని భవన యజమానులే కూల్చివేసేలా చర్యలు తీసుకోనున్నారు. దీంతో జీహెచ్‌ఎంసీకి కూల్చివేతల పని కూడా తప్పుతుంది. వీటికి సంబంధించి తగిన విధివిధానాలు రూపొందించి త్వరలో అమలు చేయనున్నట్లు జీహెచ్‌ఎంసీ చీఫ్‌ సిటీ ప్లానర్‌ ఎస్‌.దేవేందర్‌రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top