breaking news
illegal buildings collapse
-
ఇక సీజ్!
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట పడడం లేదు. చర్యలు తీసుకుంటున్నామని అధికారులు చెబుతున్నప్పటికీ విచ్చలవిడిగా వెలుస్తున్నాయి. అక్రమ నిర్మాణాలపై వార్తా పత్రికల్లో కథనాలు వచ్చినప్పుడో, హైకోర్టు మందలించినప్పుడో హడావుడిగా చర్యలు చేపడుతున్నా.. ఆ తర్వాత పట్టించుకోవడం లేదు. మరోవైపు కూల్చివేతల సందర్భంగా నిర్మాణాలను పూర్తిగా కూల్చడం లేదు. గోడల వరకు కూల్చివేసి వదిలేస్తుండడంతో అక్రమార్కులు రెండు మూడు నెలలు కాగానే తిరిగి నిర్మిస్తున్నారు. దీంతో అనుమతి లేకున్నా ఏమీ కాదనే ధీమాతో అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నవారు రోజురోజుకూ పెరిగిపోతున్నారు. జీహెచ్ఎంసీ ఈ ఏడాది ఇప్పటి వరకే 600కు పైగా అక్రమ నిర్మాణాలు కూల్చివేయడం గమనార్హం. అక్రమ నిర్మాణాలపై మున్సిపల్ పరిపాలన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అర్వింద్‌కుమార్ ఇటీవల సీరియస్ కావడంతో అధికారులు సర్వే నిర్వహించారు. ప్రస్తుతం జరుగుతున్న నిర్మాణాల్లోనూ156 స్ట్రెచ్‌లలో 455 అనధికారికమైనవి ఉన్నట్లు గుర్తించారు. అధికారుల అండదండ.. మరోవైపు టౌన్‌ప్లానింగ్ అధికారుల అండదండలతోనే అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నాయనే విమర్శలున్నాయి. ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటున్నా, హెచ్చరికలు చేస్తున్నా క్షేత్రస్థాయి అధికారులు భవన యజమానులతో కుమ్మక్కవుతుండడంతో అక్రమ నిర్మాణాలు ఆగడం లేదనే అభిప్రాయాలున్నాయి. మూడు కూల్చేలోగా మరో ఆరు పుట్టుకొస్తున్నాయి. నగరంలో భూముల విలువ ఎక్కువగా ఉండడం, అద్దెల డిమాండ్ కూడా అధికంగా ఉండడంతో రెండంతస్తులకు మాత్రమే అనుమతులుండే చోట నాలుగంతస్తులు వేస్తున్నారు. అదనపు అంతస్తులతో అద్దె రూపంలో భారీ ఆదాయం రావడమే ఇందుకు కారణమని అధికారులు భావిస్తున్నారు. అక్రమ నిర్మాణాలను కూల్చేసేందుకు వెళ్లే అధికారులు మొత్తం భవనాన్ని నేలమట్టం చేయడం లేదు. కేవలం అదనంగా నిర్మించిన అంతస్తులనే కూల్చివేస్తున్నారు. ‘నిబంధనల ప్రకారం అక్రమ నిర్మాణాలను మాత్రమే కూల్చివేయాలి. అందుకే కేవలం వాటినే కూలుస్తున్నాం. అంతేకాకుండా వాటి కూల్చివేతలతో అనుమతి పొందిన కింది అంతస్తులు దెబ్బతినకూడదు. కాబట్టి అక్రమ అంతస్తులను సైతం పూర్తిగా కూల్చకుండా కేవలం కొద్దిపాటి రంధ్రాలు చేస్తున్నామ’ని అధికారులు పేర్కొన్నారు. దీన్ని అవకాశంగా తీసుకొంటున్న అక్రమార్కులు కూల్చిన కొద్ది రోజులకే తిరిగి నిర్మాణం చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో దీనిపై ఆలోచించిన అధికారులు ఇకపై అక్రమ నిర్మాణాలను అధికారికంగా సీజ్ చేయాలని భావిస్తున్నారు. ఫైర్‌సేఫ్టీ ఏర్పాట్లు, పార్కింగ్ సదుపాయాలు, లైసెన్స్ లేని బార్లు, పబ్బులను సీజ్ చేసినట్లుగానే అక్రమ నిర్మాణాలను కూడా చేయాలని ఆలోచిస్తున్నారు. తద్వారా అక్రమంగా నిర్మించినా వినియోగానికి అవకాశం ఉండదు. కనుక భవిష్యత్‌లో అక్రమంగా అదనపు అంతస్తులు నిర్మించకుండా ఉంటారని భావిస్తున్నారు. దీంతోపాటు సీజ్ చేసిన వాటిని భవన యజమానులే కూల్చివేసేలా చర్యలు తీసుకోనున్నారు. దీంతో జీహెచ్ఎంసీకి కూల్చివేతల పని కూడా తప్పుతుంది. వీటికి సంబంధించి తగిన విధివిధానాలు రూపొందించి త్వరలో అమలు చేయనున్నట్లు జీహెచ్ఎంసీ చీఫ్ సిటీ ప్లానర్ ఎస్.దేవేందర్‌రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. -
ఇంతకాలం ఏం చేస్తున్నారు?
- అక్రమ నిర్మాణాల కూల్చివేతపై హైకోర్టు - అప్పుడు డబ్బులు తీసుకుని అనుమతులిచ్చారు... ఇప్పుడు ఆక్రమణలంటూ కూల్చివేతలా? - నోటీసులివ్వకుండా.. వారి వాదన వినకుండా కూల్చివేతలేమిటి? - ఆ రెండు శాఖల్లో అవినీతి ఉందని సీఎం స్వయంగా చెప్పారు - రాష్ట్రంలో ఏసీబీ ఉన్నట్లే అనిపించడం లేదంటూ ఘాటు వ్యాఖ్యలు - బంజారాహిల్స్‌లో రెండు కట్టడాల కూల్చివేతపై స్టే సాక్షి, హైదరాబాద్: నగరంలో నాలాలపై ఆక్రమణలు, ఇతర ప్రాంతాల్లోని అక్రమ కట్టడాల తొలగింపులో జీహెచ్ఎంసీ అధికారుల తీరుపై హైకోర్టు మండిపడింది. నాలాలు ఆక్రమణలకు గురయ్యాయని ఇప్పుడే తెలిసిందా అని ప్రశ్నించింది. డబ్బులు తీసుకుని వాటికి అనుమతులిచ్చి, ఇప్పుడు అక్రమమంటూ కూల్చివేతలకు దిగుతారా అని నిలదీసింది. ఏళ్ల తరబడి ఆక్రమణలు జరుగుతూ ఉంటే ఏం చేశారని, ఇన్నాళ్లూ ఎక్కడున్నారని మండిపడింది. అక్రమ కట్టడాలను తొలగించడంలో తప్పులేదని.. కానీ ఇది చట్టాలకు, నిబంధనలకు లోబడి జరగాలని స్పష్టం చేసింది. నోటీసులివ్వకుండా, వాదన వినిపించే అవకాశమివ్వకుండా ఒక్కసారిగా కూల్చివేతలు ఎందుకు చేపడుతున్నారో, అందులో అధికారుల చిత్తశుద్ధి ఎంతో తెలుసని వ్యాఖ్యానించింది. మా వాదన వినడం లేదు తమకు చెందిన నిర్మాణాలను కూల్చివేసేందుకు జీహెచ్ఎంసీ అధికారులు సిద్ధమవుతున్నారని..నోటీసులివ్వకుండా, తమ వాదన వినకుండానే ఈ చర్యలకు పాల్పడుతున్నారని హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌కు చెందిన టి.బ్రిజ్ మోహన్‌రెడ్డి, మతీన్ అహ్మద్, మక్బూల్ అహ్మద్, ముఖీన్ అహ్మద్‌లు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. లంచ్ మోషన్ రూపంలో అత్యవసరంగా దాఖలు చేసిన ఈ వ్యాజ్యాలపై బుధవారం మధ్యాహ్నం జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు విచారణ జరిపారు. తొలుత బ్రిజ్ మోహన్‌రెడ్డి తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. తర్వాత మతీన్ అహ్మద్ తదితరుల తరఫు న్యాయవాది తరుణ్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ..చట్టబద్ధంగా తమకు హక్కు ఉన్న భూమిలో చేపట్టిన నిర్మాణాలను కూడా అక్రమ నిర్మాణాలంటూ నోటీసులు ఇవ్వకుండానే కూల్చివేతకు సిద్ధమవుతున్నారన్నారు. మీకు ఇప్పుడే తెలిసిందా? పిటిషనర్ల వాదనలను ప్రభుత్వ న్యాయవాది సి.వి.భాస్కర్‌రెడ్డి తోసిపుచ్చారు. నీటి ప్రవాహాలకు అడ్డంకులుంటే వాటిని తొలగించి, ప్రవాహం సాఫీగా వెళ్లేలా చూసే అధికారం ప్రభుత్వానికి ఉందన్నారు. నాలాలు ఆక్రమించి నిర్మాణాలు చేపట్టడంతో ఇటీవలి వర్షాలకు ఇళ్లలో నీరు చేరిందన్నారు. ఈ సమయంలో న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ..‘‘నాలాలు ఆక్రమణలకు గురైన విషయం మీకు ఇప్పుడే తెలిసిందా? అనుమతులిచ్చేటప్పుడు తెలియలేదా అవి అక్రమ నిర్మాణాలని.. 20 ఏళ్లుగా అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నా అధికారులు ఏం చర్యలు తీసుకున్నారు? హైదరాబాద్‌లో 28వేల అక్రమ నిర్మాణాలున్నాయని ముఖ్యమంత్రే స్వయంగా చెప్పారు. మరి ఇంత కాలం చేశారు? అధికారులు సక్రమంగా పనిచేసి ఉంటే ఈ రోజు ప్రజల ఇళ్లలోకి నీళ్లు వచ్చే పరిస్థితి ఉండేది కాదు కదా..’’ అని పేర్కొన్నారు. లంచాలు పొంది అనుమతులిచ్చారు భవన నిర్మాణాలకు అనుమతులిచ్చే విషయంలో కొందరు అధికారులు లంచం తీసుకున్నారు కాబట్టే ఆక్రమణలు యథేచ్ఛగా కొనసాగుతున్నా పట్టించుకోలేదని న్యాయ మూర్తి వ్యాఖ్యానించారు. రెవెన్యూ, పురపాలకశాఖల్లో అవినీతి పేరుకుపోయిందని స్వయంగా ముఖ్యమంత్రే చెప్పారని గుర్తు చేశారు. ‘‘ ఈ రెండు శాఖల అధికారుల వ్యవహారశైలి చూస్తుంటే అసలు ఈ రాష్ట్రంలో ఏసీబీ ఉన్నట్లే అనిపించడం లేదు. ఇప్పుడు సీఎం చెప్పారని కూల్చివేతలు మొదలుపెట్టారు. లేకుంటే?.. ఈ కూల్చివేతలు, ఇవన్నీ కంటి తుడుపు చర్యలే. అక్రమ కట్టడాల కూల్చివేతను కోర్టు తప్పుబట్టడం లేదు. నోటీసులు ఇవ్వండి.. వాదనలు వినండి.. చట్ట ప్రకారం నిర్ణయం తీసుకోండి..’’ అని జస్టిస్ రామచంద్రరావు ఆదేశించారు. బ్రిజ్మోహన్రెడ్డి, మతీన్ అహ్మద్ తదితరుల నిర్మాణాల కూల్చివేతపై స్టే విధిస్తూ విచారణను 8 వారాలకు వాయిదా వేశారు. వారి బాధను పట్టించుకున్నారా? వాదనల సమయంలో కార్పొరేటర్ల ప్రస్తావన రాగా... కార్పొరేటర్లు, కౌన్సిలర్ల వ్యవహారం గురించి అందరికీ తెలుసని, పదవుల నుంచి దిగిపోయేలోపు వారిలో అత్యధికులు రూ.5 కోట్ల వరకు వెనకేసుకుంటున్నారని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. ‘‘ఇప్పటివరకు ఓ మంత్రి, ఓ కార్పొరేటర్ ఇల్లు కూల్చగలిగారా? ముందు వాటిని కూల్చి చూపండి. కష్టపడి ఇళ్లు కట్టుకున్న వారి బాధ ప్రభుత్వ బంగళాల్లో ఉండే వారికి ఏం తెలుస్తుంది? ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి కట్టుకున్న ఇళ్లను ఒక్క దెబ్బతో నేలమట్టం చేస్తామంటే వారి వేదన ఎలా ఉంటుందో వారికే తెలుసు. అలాంటిది కూల్చివేతలను అడ్డుకోవద్దని మీరు (జీహెచ్ఎంసీ, రెవెన్యూ న్యాయవాదులు) కోర్టుకు చెబుతున్నారు..’’ అని పేర్కొన్నారు. అధికారులూ బాధ్యులే అక్రమ నిర్మాణాల విషయంలో ఏళ్ల తరబడి మౌనంగా ఉండి.. అకస్మాత్తుగా చర్యలకు దిగిన ఘటనకు సంబంధించి గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఓ తీర్పును న్యాయమూర్తి జస్టిస్ రామచంద్రరావు ప్రభుత్వ న్యాయవాది చేత చదివించారు. అక్రమ నిర్మాణం చేపట్టిన వ్యక్తి చట్టపరమైన చర్యలకు ఎంత వరకు బాధ్యుడో, అనుమతులిచ్చిన అధికారి కూడా అంతే బాధ్యుడని ఆ తీర్పులో సుప్రీంకోర్టు చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు.