హోటళ్లపై బల్దియా కొరడా

GHMC Officials Rides On Hyderabad Hotels - Sakshi

వ్యర్థాల నిర్వహణలో విఫలమైన రెస్టారెంట్లు

సీజ్‌ చేసి, జరిమానాలు విధించిన అధికారులు

నిబంధనలు పాటించని హోటళ్లు, రెస్టారెంట్లపై జీహెచ్‌ఎంసీ అధికారులు కొరడా ఝళిపించారు. సోమవారం నగరంలోని పలు ప్రాంతాల్లో దాడులు జరిపి కొన్నింటిని సీజ్‌ చేశారు. మరికొన్నింటికి భారీగా జరిమానాలువిధించారు. 

సాక్షి, సిటీబ్యూరో: బల్క్‌ గార్బేజ్‌ను ఉత్పత్తి చేస్తూ పలుమార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ కంపోస్ట్‌ ఎరువుల తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయని ముషీరాబాద్‌లోని బావర్చీ హోటల్‌ను జీహెచ్‌ఎంసీ అధికారులు సీజ్‌ చేశారు. దీంతో పాటు కూకట్‌పల్లి సర్కిల్‌ నిజాంపేట్‌లోని సహారా కేఫ్‌ రెస్టారెంట్‌లో అపరిశుభ్రంగా కిచెన్‌ నిర్వహించడంతో సీజ్‌ చేశారు. వ్యర్థాలను డ్రైనేజీలో వేయడం, సిల్ట్‌ చాంబర్‌లను నిర్మించుకోకపోవడంతో త్రిపురా బార్‌ అండ్‌ రెస్టారెంట్‌కు రూ.20వేల జరిమానాను విధించారు. మూసాపేట సర్కిల్‌లోని దేవి గ్రాండ్‌ హోటల్‌లో అపరిశుభ్ర వాతావరణం, ధ్రువీకరించని మాంసం ఉపయోగించడం, డ్రైనేజీలో వ్యర్థాలను వేయడం తదితర కారణాలతో  రూ. 30,100 జరిమానాగా విధించారు.

వ్యర్థపదార్థాల నిర్వహణ చట్టం అనుసరించి 50కిలోలకుపైగా వ్యర్థాలను ఉత్పత్తి చేసేవారు తప్పనిసరిగా కంపోస్ట్‌ యూనిట్లను ఏర్పాటు చేసుకోవాలి. 50 కిలోలకు బదులుగా వంద కిలోల వ్యర్థాలను ఉత్పత్తిచేసే హోటళ్లు, రెస్టారెంట్‌లు, ఫంక్షన్‌హాళ్లు విధిగా కంపోస్ట్‌ ఎరువుల తయారీ యూనిట్‌లను డిసెంబర్‌ 25లోపు  ఏర్పాటు చేయాలని  జీహెచ్‌ఎంసీ నగరంలోని హోటళ్లు, రెస్టారెంట్లు, ఫంక్షన్‌హాళ్లు, కళ్యాణమండపాలు, బాంకెట్‌ హాళ్లకు ఇప్పటికే పలుమార్లు నగరమేయర్‌ బొంతు రామ్మోహన్, కమిషనర్‌ ఎం.దానకిషోర్‌లు నగరంలోని హోటళ్లు, రెస్టారెంట్లు, ఫంక్షన్‌హాళ్ల యజమానులతో సమావేశాలు నిర్వహించారు. ఈ విషయమై కంపోస్ట్‌ యూనిట్లను ఏర్పాటు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్న బడా హోటళ్లు, రెస్టారెంట్ల వద్ద గతంలో జీహెచ్‌ఎంసీ అధికారులు, సిబ్బంది గాంధీగిరీ కూడా నిర్వహించారు. మార్కెట్‌లో లభ్యమయ్యే కంపోస్ట్‌ ఎరువుల తయారీ యంత్రాల ధరలు, అవి దొరికే ప్రాంతాలు, విక్రయించే సంస్థల వివరాలను జీహెచ్‌ఎంసీ వెబ్‌సైట్‌లో ప్రదర్శించడంతో పాటు ప్రత్యేక ప్రదర్శనలు కూడా ఏర్పాటు చేసింది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top