నల్లా.. గుల్ల | Sakshi
Sakshi News home page

నల్లా.. గుల్ల

Published Tue, Jun 18 2019 12:18 PM

GHMC Commissioner Warning to Illegal Tap Connections - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: అక్రమ నల్లాలు పలు అపార్ట్‌మెంట్‌ వాసుల పాలిట శాపంగా మారుతున్నాయి. తెలిసీ తెలియక ఫ్లాట్స్‌కొనుగోలు చేసి..తీరా జలమండలి విజిలెన్స్‌ పోలీసుల తనిఖీల్లో అక్రమ నల్లాలు బయటపడితే సదరు బహుళ అంతస్తుల భవంతిలో నివసిస్తున్న అందరు ఫ్లాట్స్‌ ఓనర్లపై క్రిమినల్‌ కేసులు నమోదవుతున్నాయి. ఇటీవలఒకటి కాదు..రెండు కాదు ఏకంగా 150 మంది వినియోగదారులు ఈ జాబితాలో చిక్కుకొని విలవిల్లాడుతున్నారు. కొనుగోలుకు ముందే సదరు భవనానికి జీహెచ్‌ఎంసీ నుంచి అన్నిరకాల నిర్మాణ అనుమతులు, జలమండలి నల్లా కనెక్షన్‌కు సంబంధించిన వివరాలు తెలుసుకుంటే ఈ చిక్కులు తప్పుతాయని జలమండలి అధికారులు స్పష్టం చేస్తున్నారు.

అక్రమ నల్లాల దందా ఇలా...
గ్రేటర్‌ పరిధిలోని పలు ప్రాంతాల్లో శరవేగంగా అపార్ట్‌మెంట్ల నిర్మాణం జరుగుతోంది. ఆయా ప్రాంతాల్లో నిర్మితమౌతున్న బహుళ భవంతులకు నిర్మాణ విస్తీర్ణం, అంతస్తులు, ఫ్లాట్స్‌ సంఖ్య ఆధారంగా కనెక్షన్‌ చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. జలమండలికి నిబంధనల మేరకు కనెక్షన్‌ చార్జీలు చెల్లించాలంటే రూ.8–10 లక్షల మధ్యన ఖర్చు అవుతుంది. అయితే కొందరు బిల్డర్లు కక్కుర్తిగా వ్యవహరించి క్షేత్రస్థాయి సిబ్బంది సహకారంతో సదరు భవనానికి అక్రమ నల్లాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. మరికొందరు బిల్డర్లు 50 ఫ్లాట్స్‌ ఉన్న భవంతికి సైతం కేవలం గృహవినియోగ నల్లా 15 ఎంఎం కనెక్షన్‌ మాత్రమే అధికారికంగా తీసుకొని అనధికారికంగా 40 ఎంఎం నల్లాను ఏర్పాటుచేసుకుంటున్నారు. ఈ భాగోతాలన్నీ ఇటీవల జలమండలి విజిలెన్స్‌ పోలీసుల తనిఖీల్లో గుట్టలుగా బయటపడుతున్నాయి. 

కేసులపాలవుతున్నారిలా..
గ్రేటర్‌ పరిధిలోని 20 నిర్వహణ డివిజన్ల పరిధిలో జలమండలికి 9.80 లక్షల నల్లా కనెక్షన్లున్నాయి. ఇవి కాకుండా మహానగరంలో అక్రమనల్లాలు సుమారు లక్షకు పైగానే ఉన్నట్లు బోర్డు వర్గాల్లో బహిరంగ రహస్యమే. క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న సిబ్బంది సహకారంతో భూమి లోపలున్న అక్రమ నల్లాల గుట్టు తవ్విచూసినప్పుడే రట్టవుతోంది. జలమండలి సరఫరా చేస్తున్న విలువైన తాగునీటిలో సరఫరా, చౌర్యం తదితర నష్టాలు 40 శాతం మేర ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. అయితే అక్రమ నల్లాలున్న వినియోగదారులపై ఇటీవల జలమండలి విజిలెన్స్‌ పోలీసులు ఐపీసీ 430,379,269 సెక్షన్ల కింద సమీప పోలీస్‌స్టేషన్లలో క్రిమినల్‌ కేసులు నమోదుచేస్తున్నారు. అక్రమార్కులకు భారీగా జరిమానా విధించడతోపాటు నేరం రుజువైన పక్షంలో ఐదేళ్ల వరకు జైలుశిక్ష పడుతుందని విజిలెన్స్‌ పోలీసులు స్పష్టంచేస్తున్నారు. ఇటీవలికాలంలో సుమారు 150 మంది వినియోగదారులపై ఇలాంటి కేసులు నమోదైనట్లు తెలిపారు. 

క్రమబద్ధీకరణ ఇలా...
అక్రమనల్లాలు ఇప్పటికీ గుట్టుచప్పుడుగా కొనసాగుతున్న భవంతుల యజమానులు ఇప్పటికైనా కళ్లు తెరిచి జలమండలి నిర్దేశించిన రెట్టింపు కనెక్షన్‌ చార్జీలు(నిర్మాణ విస్తీర్ణాన్ని బట్టి), మూడేళ్లపాటు సరాసరి కనీస నీటిబిల్లును వాటర్‌బోర్డుకు చెల్లించి తమ అక్రమనల్లాలను క్రమబద్ధీకరించుకోవాలని జలమండలి అధికారులు సూచిస్తున్నారు.

తాజాగా మరో గుట్టు రట్టు..
షాపూర్‌ నగర్‌లోని నెహ్రూనగర్‌కు చెందిన ఇంటినెంబర్‌– 66 భవనానికి అధికారుల అనుమతి లేకుండా  అక్రమంగా నల్లా కనెక్షన్‌ ఉన్నట్లు సోమవారం జలమండలి విజిలెన్స్‌ అధికారుల తనిఖీలో గుర్తించారు. సదరు భవనానికి అక్రమ నల్లా  కనెక్షన్‌ తొలగించడంతో పాటు సంబంధిత భవన యాజమాని జి. ప్రమీలపై జీడిమెట్ల పోలీస్‌ స్టేషన్‌లో ఐపీసీ 269,430, 379 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

నిగ్గు తేలుస్తాం
జలమండలి ఆదాయాని భారీగా గండికొడుతూ..గ్రేటర్‌ పరిధిలో పలు భవంతులకున్న అక్రమనల్లాల నిగ్గు తేల్చాలని బోర్డు విజిలెన్స్‌ పోలీసులకు స్పష్టమైన ఆదేశాలిచ్చాం. అక్రమార్కులు దారికొచ్చేవరకు వరుస తనిఖీలు నిర్వహిస్తాం. వినియోగదారులు సైతం ఫ్లాట్స్‌ కొనుగోలుకు ముందు జీహెచ్‌ఎంసీ నుంచి భవన నిర్మాణ అనుమతులు, జలమండలి నల్లా కనెక్షన్‌ వివరాలు తనిఖీ చేసుకున్న తర్వాతనే కొనుగోలు చేయాలి.    – ఎం.దానకిశోర్, జలమండలి ఎండీ

Advertisement
Advertisement