నాలుగు సెట్‌లేసుకో!

Four Types Of Nominations Applications in Elections - Sakshi

బీ ఫారం ఇచ్చిన పార్టీకి జై.. లేకుంటే ఇండిపెండెంట్‌గా సై.. అదీ వద్దనుకుంటే నైనై..!!

ఎన్నికల్లో పోటీ చేయడమంటే ఆషామాషీ కాదు. ప్రచారం మాట అటుంచితే.. నామినేషన్‌ ప్రక్రియ చాలా జాగ్రత్తగా చేయాలి. బరిలోకి దిగే అభ్యర్థులు ఒక్కొక్కరూ గరిష్టంగా నాలుగు సెట్ల నామినేషన్లు దాఖలు చేయవచ్చు. పొరపాట్లు దొర్లితే.. ఒక సెట్‌ కాకుంటే మరొకటి పనికొస్తుంది. ప్రధాన పార్టీ అభ్యర్థులైతే పార్టీ పేరుతో మూడు, ఇండిపెండెంట్‌గా ఒకటి వేస్తారు. ఆ మొత్తం ప్రక్రియ ఎలా సాగుతుందంటే..

సాక్షి, సిటీబ్యూరో: నామినేషన్‌ వేసే అభ్యర్థులు గరిష్టంగా నాలుగు సెట్‌ల వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చు. నామినేషన్‌ పత్రాలు భర్తీ చేయడంలో ఏవైనా పొరపాట్లు దొర్లినా.. ఎక్కువ దిద్దుబాట్లు లేకుండా ఉండేందుకు ఒకటి కాకపోతే మరొకటైనా సక్రమంగా ఉంటుందని  భావించి కొందరు అభ్యర్థులు ఒకటి కంటే ఎక్కువ నామినేషన్లు దాఖలు చేస్తుండటం అందరికీ తెలిసిందే. దీంతోపాటు ప్రతిపాదించే వారి సంతకాలు సరిగ్గా లేకున్నా.. వారు నియోజకవర్గ  స్థానికులు కాకున్నా ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు చాలామంది ఒకటి కంటే ఎక్కువ నామినేషన్లు దాఖలు చేస్తుంటారు. ఇలా నాలుగు సెట్ల వరకు నామినేషన్లు వేసేందుకు అవకాశం ఉంది.

టికెట్‌ రాని పక్షంలో..
ఎన్నికల సంఘం ఏ ఉద్దేశంతో  ఈ సదుపాయం కల్పించినా.. ఒక పార్టీని నమ్ముకుంటే టికెట్‌ రాని పక్షంలో టికెటిచ్చేందుకు మరోపార్టీ ముందుకొస్తే ఆ అవకాశాన్నీ వినియోగించుకునేందుకు  ఇది ఉపకరిస్తుంది. ఎటొచ్చీ నామినేషన్‌ దాఖలు సమయంలోనే పార్టీ పేరును పేర్కొనాలి. బీ ఫారం లేకపోయినప్పటికీ నామినేషన్‌ దాఖలు చేసే అభ్యర్థి మూడు పార్టీలను పేర్కొంటూ మూడు సెట్ల  నామినేషన్లు.. ఇండిపెండెంట్‌గా మరో సెట్‌ నామినేషన్‌ను దాఖలు చేయవచ్చు. నామినేషన్‌ గడువు ముగిసేలోగా ఏదైనా పార్టీ బీ ఫారం ఇస్తే.. ఆ పార్టీ  అభ్యర్థి అవుతారు. లేని పక్షంలో కాబోరు. నామినేషన్‌ దాఖలు సమయంలో పార్టీ పేరును పేర్కొనకుంటే మాత్రం బీఫారం దక్కించుకున్నా వృథానే. 

పార్టీ బీ ఫారం ఇవ్వకుంటే..
ఏ పార్టీ బీ ఫారం ఇవ్వని పక్షంలో ఇండిపెండెంట్‌గానైనా బరిలో నిలవాలనుకుంటే మాత్రం నామినేషన్‌ దాఖలు సమయంలోనే పోటీ చేస్తున్న నియోజకవర్గంలోని స్థానిక ఓటర్లు పదిమంది ప్రతిపాదించాల్సి ఉంటుంది. ఓటరు జాబితాలో వారి పేరున్నట్లు రుజువులు సమర్పించాలి. అదే  గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ బీ ఫారం ఇస్తే  స్థానిక  ఓటరు ఒక్కరు ప్రతిపాదిస్తే సరిపోతుంది. గుర్తింపు పొందిన రాజకీయపార్టీల అభ్యర్థి మాదిరే ఇండిపెండెంట్‌గానూ ఒక్కరు ప్రతిపాదిస్తే సరిపోతుందనుకుంటే మాత్రం అనర్హులవుతారు. బరిలో నిలిచే అవకాశం ఉండదు. ఎన్నికల తరుణంలో ఎప్పుడేం జరుగుతుందో తెలియని అనూహ్య పరిణామాల నేపథ్యంలో గోడ దూకి పార్టీ మారే వారు ముందస్తుగా కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు. ఇండిపెండెంట్‌గానైనా సత్తా చూపించగలననుకుంటే మాత్రం పదిమంది ప్రతిపాదకులు ఉండాల్సిందే. లేని పక్షంలో నామినేషన్‌ నాడే పరిస్థితి గల్లంతవుతుంది. 

మూడు నియోజకవర్గాల్లో నో..
ఒక అభ్యర్థి ఒక్క నియోజకవర్గం నుంచే కాకుండా రెండు నియోజకవర్గాల నుంచీ పోటీ చేయవచ్చు. పలుపార్టీల ముఖ్యనేతలు పలు సందర్భాల్లో రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేయడం తెలిసిందే.  అయితే గరిష్టంగా రెండు నియోజకవర్గాల నుంచి మాత్రమే పోటీ చేసే వీలుంటుంది. అంతకుమించి మూడో నియోజకవర్గంలో కూడా పోటీ చేయాలనుకుంటే మాత్రం కుదరదని జీహెచ్‌ఎంసీ ఎన్నికల విభాగంలోని అధికారి తెలిపారు. 

బీ ఫారం మార్చవచ్చు..  
గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు తొలుత ఒక అభ్యర్థికి బీ ఫారం ఇచ్చాక, తిరిగి అభ్యర్థిని మార్చాలనుకున్నా సాధ్యమే. అయితే తొలుత బీ ఫారం ఇచ్చిన అభ్యర్థి బదులుగా తమ పార్టీనుంచి సంబంధిత నియోజకవర్గానికి కొత్త అభ్యర్థిని నిలబెడుతున్నామని పేర్కొంటూ సిరాతో సంతకం చేసిన విజ్ఞాపన పత్రాన్ని రిటర్నింగ్‌ అధికారికి నామినేషన్ల  గడువు ముగిసే లోగా అందజేయాలి. అంతిమంగా ఎవరికి బీ ఫారం ఇస్తే వారే పార్టీ అభ్యర్థి అవుతారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top