అనాథాశ్రమంలో ఫుడ్‌ పాయిజన్‌

Food Poison in Orphan Home in Hyderabad - Sakshi

15 మంది విద్యార్థులకు అస్వస్థత

నిలోఫర్‌ హాస్పిటల్‌కు తరలింపు

నిలకడగా చిన్నారుల ఆరోగ్యం  

అంజుమన్‌ ఖాదిమల్‌ ముసల్మిన్‌ ఆర్ఫనేజ్‌ హామ్‌లో ఘటన

కాచిగూడ/నాంపల్లి: ఏకేఎం ట్రస్ట్‌ ఆధ్వర్యంలో కాచిగూడలో నిర్వహిస్తున్న అంజుమన్‌ ఖాదిమల్‌ ముసల్మిన్‌ ఆర్ఫనేజ్‌ హాస్టల్లో శనివారం రాత్రి ఫుడ్‌ పాయిజన్‌ అయి 15 మంది చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. చిన్నారులను హుటాహుటిన అర్దరాత్రి నిలోఫర్‌ ఆస్పత్రికి తరలించారు. ప్రాణాపాయం ఏమీ లేదని చిన్నారుల ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. అయితే వీరంతా శనివారం రాత్రి బిర్యానీ, స్వీటు తిన్నారని అప్పటి నుంచి అస్వస్థతకు గురయ్యారని తోటి విద్యార్థులు తెలిపారు. బిర్యానీని వేరే ఫంక్షన్‌లో మిగిలిన తర్వాత తెచ్చారని తెలిసింది. ఇలా ప్రతి ఫంక్షన్‌లో మిగిలిన భోజనాన్ని ట్రస్టు ఆధ్వర్యంలో పలు విద్యాసంస్థల్లోని విద్యార్థులకు సరఫరా చేస్తారని, ఎప్పటిలాగే నిన్న రాత్రి కూడా ఇలాగే భోజనం సరఫరా జరిగిందని తెలిసింది. కాచిగూడ పోలీసులు అసలు ఏ ఫంక్షన్‌ నుంచి ఈ భోజనాన్ని చిన్నారులకు తీసుకువచ్చారన్న కోణంలో విచారణ చేస్తున్నారు.

కోలుకుంటున్న విద్యార్థులు...  
విషాహారం తిని అస్వస్థతకు గురై నిలోఫర్‌లో చికిత్స పొందుతున్న 15 మంది విద్యార్థులు కోలుకుంటున్నారు. నిలోఫర్‌ వైద్యులు విద్యార్థులకు అత్యవసర వైద్య సేవలందిస్తున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులందరూ కాచిగూడలోని అంజుమన్‌ ఖాదిమల్‌ ముసల్మిన్‌ (అనాథ శరణాలయం) చదువుకుంటున్నారు. శనివారం రాత్రి 8 గంటల సమయంలో బర్గర్, షావర్మా, రోటీ, బిర్యానీ, అంజీర్‌కా మీఠాలను భుజించారు. రాత్రి 11 గంటల సమయంలో వీరు అస్వస్థతకు గురయ్యారు. అనారోగ్యం పాలైన విద్యార్థులను అర్దరాత్రి హుటాహుటిన రెడ్‌హిల్స్‌లోని నిలోఫర్‌ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చేరిన చిన్నారుల్లో ఏడుగురు బాలికలు, 8 మంది బాలురు ఉన్నారు. ఈ చిన్నారులు ఒకటో తరగతి నుంచి 6వ తరగతి మధ్యలో విద్యను అభ్యసిస్తున్నారు. వీరందరూ ప్రస్తుతం కోలుకుంటున్నారు. విషాహారం తీసుకోవడంతోనే చిన్నారులు అనారోగ్యం పాలయ్యారని వైద్యులు నిర్ధారించారు. 

అనాథాశ్రమాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి
పిల్లలకు నిర్లక్ష్యంగా ఆహారాన్ని అందించిన అంజుమన్‌ ఖాదిమల్‌ ముసల్మిన్‌ ఆనాథాశ్రమాన్ని ప్రభుత్వం వెంటనే స్వాధీనం చేసుకుని నిర్వాహకులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని బాలల హక్కుల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు అచ్యుతరావు డిమాండ్‌ చేశారు. పిల్లలకు విషతుల్యమైన ఆహారం అందించిన వారిని, ఆస్పత్రి పాలయ్యేలా చేసిన ఆశ్రమ నిర్వాహకులపై చట్టపరంగా తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు. అనాథాశ్రమ నిర్వాహకులు బయట ఎవరో తినగా మిగిలిన ఆహారాన్ని ఆశ్రమ పిల్లలకు పెట్టడంతోనే వారు అనారోగ్యానికి గురయ్యారని చెప్పారు. నిలోఫర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారుల్లో ముగ్గురి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని ఆయన తెలిపారు. గుర్తింపు లేని ఈ ఆనాథాశ్రమంపై వెంటనే చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top