నగదు, మద్యం సరఫరాపై నజర్‌  | Focus on cash and liquor supply | Sakshi
Sakshi News home page

నగదు, మద్యం సరఫరాపై నజర్‌ 

Oct 30 2018 3:00 AM | Updated on Oct 30 2018 8:45 AM

Focus on cash and liquor supply - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పోలీస్‌ శాఖ రెండు ప్రధానాంశాలపై దృష్టి సారించింది. నగదు, మద్యం సరఫరా, పంపిణీలను నియంత్రించేందుకు ప్రత్యేక ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లను రంగంలోకి దించింది. దీంతో గడిచిన 15రోజుల్లోనే రూ.25కోట్లకు పైగా నగదు సీజ్‌ చేసినట్టు పోలీస్‌ శాఖ వర్గాలు వెల్లడించాయి. ఓటర్లను ప్రలోభపెట్టే ఈ రెండింటిని నియంత్రించడానికి ప్రత్యేక కార్యాచరణ చేపట్టినట్టు తెలుస్తోంది.  

రాష్ట్ర సరిహద్దుల్లో 29 చెక్‌పోస్టులు 
నగదు, మద్యం సరఫరాకు చెక్‌పెట్టేందుకు రాష్ట్ర సరిహద్దుల్లో 29 చెక్‌పోస్టులు ఏర్పాటు చేసినట్టు పోలీస్‌ వర్గాలు తెలిపాయి. తెలంగాణకు ఉత్తర ప్రాంతంలో ఉన్న మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, దక్షిణ ప్రాంతంలో ఉన్న ఏపీ, కర్నాటక సరిహద్దుల్లో ఈ చెక్‌పోస్టులను ఏర్పాటు చేసినట్టు ఉన్నతాధికారులు వెల్లడించారు. ఈ చెక్‌పోస్టుల వద్ద రెవెన్యూ అధికారులతో కలిసి పోలీస్‌ శాఖ పనిచేస్తోందని, ఎలాంటి లెక్కలు, పత్రాలులేని డబ్బును పట్టుకొని ఐటీ శాఖకు అప్పగిస్తున్నామని, ఇప్పటివరకు రూ.25 కోట్లు స్వాధీనం చేసుకున్నట్టు ఉన్నతాధికారులు తెలిపారు. అదేవిధంగా 31జిల్లాల మధ్య ప్రధాన రహదారుల్లోనూ చెక్‌పోస్టులు ఏర్పాటు చేశామని, ఇలా 79 చెక్‌పోస్టులు పనిచేస్తున్నాయని స్పష్టం చేశారు. ఈ చెక్‌పోస్టుల ద్వారా ఇప్పటివరకు 65వేల లీటర్ల మద్యం అక్రమంగా రవాణా చేస్తుండగా పట్టుకున్నట్టు తెలిపారు.  

రంగంలోకి కేంద్ర బలగాలు... 
ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కేంద్ర బలగాలను భారీ స్థాయిలో మోహరించాలని పోలీస్‌ శాఖ ఎన్నికల కమిషన్‌ను కోరింది. ఈ మేరకు రాష్ట్రంలోని 60వేల మంది పోలీస్‌ సిబ్బందితోపాటు మరో 300 కంపెనీల పారామిలిటరీ బలగాలు కావాలని ఎన్నికల కమిషన్‌ను కోరింది. దీంతో నాలుగు రోజులక్రితం మొదటి దఫాలో భాగంగా 25 కంపెనీల బలగాలు రాష్ట్రానికి వచ్చాయని, మిగిలిన బలగాలు మరో వారంతర్వాత రెండు దఫాలుగా వస్తాయని, నోటిఫికేషన్‌ నుంచి ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేవరకు అన్ని జిల్లాలు, కమిషనరేట్లలో ఈ కంపెనీలు పహారా కాస్తాయని ఉన్నతాధికారులు తెలిపారు. ఎన్నికల నేపథ్యంలో పోలీస్‌ శాఖకు ప్రభుత్వం నుంచి రూ.100 కోట్ల మేర బడ్జెట్‌ రిలీజ్‌ అయ్యిందని, బలగాల సదుపాయాలతో పాటు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యేక ఏర్పాట్లకోసం వీటిని వినియోగించనున్నట్టు సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఒకరు తెలిపారు.  

నామినేషన్ల తర్వాత పరిశీలకులు 
అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ముగియగానే పరిశీలకులు వస్తారని సీనియర్‌ ఐపీఎస్‌ ఒకరు తెలిపారు. జనరల్‌ అబ్జర్వర్లు, ఎక్స్‌పెండీచర్‌ అబ్జర్వర్లు, పోలీస్‌ అబ్జర్వర్లు ఇలా మూడు రకాల పరిశీలకులు రాష్ట్రానికి చేరుకుంటారని, అదేవిధంగా ప్రతీ నియోజకవర్గానికి వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే రెవెన్యూ అధికారులు అబ్జర్వర్లుగా వ్యవహరించనున్నట్టు అధికార వర్గాలు స్పష్టం చేశాయి. రాష్ట్రంలోని ఎన్నికల తీరుతెన్నులు, విభాగాలు వ్యవహరిస్తున్న తీరుపై ఎప్పటికప్పుడు సెంట్రల్‌ ఎలక్షన్‌ కమిషన్‌కు అబ్జర్వర్లు నివేదికలు పంపిస్తారని, ప్రశాంత వాతావరణం, ఒత్తిడి లేకుండా అధికారులు, విభాగాలు పనిచేసేలా పోలీస్‌ శాఖ కృషిచేస్తోందని ఉన్నతాధికారులు వెల్లడించారు. 

మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో... 
రాష్ట్రంలోని ఆసిఫాబాద్, భూపాలపల్లి, మహబూబాబాద్, ఖమ్మం జిల్లాల్లో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలున్నాయని, ఈ ప్రాంతాల్లో ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు మూడు పద్ధతుల్లో భద్రతా చర్యలు చేపట్టనున్నట్టు తెలిసింది. పోటీ చేస్తున్న అభ్యర్థులకు భద్రత కల్పించడం, ఎన్నికల విధులు నిర్వర్తించే సిబ్బంది, పోలీసులకు రక్షణ కల్పించడం, మావోయిస్టుల నియంత్రణకు ముందస్తుగా ఛత్తీస్‌గఢ్, ఏపీ, మహారాష్ట్ర పోలీసులతో కోఆర్డినేషన్‌ చేసుకుంటున్నట్టు తెలిసింది. మావోయిస్టులు ఎన్నికల సమయంలో రాష్ట్రంలోకి అడుగుపెట్టకుండా ఉండేందుకు కూంబింగ్‌ను విస్తృ తం చేసినట్టు తెలిసింది. ఆయా రాష్ట్రాల అధికారులతో నిత్యం సంప్రదింపులు, సమాచార మార్పిడి చేసుకుంటూ ముందుకు వెళ్తున్నామని రాష్ట్ర ఉన్నతాధికారులు తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement