రహస్యంగా మందు విక్రయాలు
షరతులు వర్తిస్తాయ్ గురూ..
ఇస్లాం పవిత్ర పుణ్యక్షేత్రాలకు నిలయమైన సౌదీ అరేబియాలో ఒకప్పుడు ’మద్యం’ మాట వినిపిస్తేనే కఠిన శిక్షలు ఉండేవి. కానీ, ఇప్పుడక్కడ క్రమేపీ వాతావరణం మారుతోంది. దశాబ్దాల నిషేధాన్ని పక్కన పెట్టి, అత్యంత రహస్యంగా మద్యం విక్రయాలను విస్తరిస్తోంది సౌదీ ప్రభుత్వం.
నిశ్శబ్దంగా.. నిషా వైపు!
రియాద్‌లోని ’డిప్లొమాటిక్ క్వార్టర్’లో ఒక గుర్తు తెలియని దుకాణం ఉంది.. బయట బోర్డు ఉండదు. లోపలికి కెమెరాలను రానివ్వరు. 2024 జనవరిలో కేవలం ముస్లిమేతర దౌత్యవేత్తల కోసం మొదలైన ఈ దుకాణం తలుపులు ఇప్పుడు మరికొందరికి తెరుచుకున్నాయి. ఎలాంటి అధికారిక ప్రకటన లేకుండానే, ’ప్రీమియం రెసిడెన్సీ’ ఉన్న విదేశీయులకు కూడా ఇక్కడ మద్యం కొనుగోలు చేసే అవకాశం కల్పించారు.
రక్షణ మామూలుగా లేదు!
ఈ దుకాణంలోకి వెళ్లడం అంత సులభం కాదు. ప్రవేశ ద్వారం దగ్గర క్షుణ్ణంగా తనిఖీలు చేస్తారు. ఫోన్లు, కెమెరాలను అనుమతించరు. ఆఖరికి మీరు పెట్టుకున్న కళ్లద్దాలు కూడా ’స్మార్ట్ గ్లాసెస్’ ఏమో అని సిబ్బంది తనిఖీ చేస్తారు. ధరల విషయానికి వస్తే.. దౌత్యవే త్తలకు పన్ను ఉండదు కానీ, ఈ కొత్త వినియోగదారులకు మాత్రం జేబులు ఖాళీ కావల్సిందే.
ఇప్పుడిక రియాద్‌లోనే ‘కిక్కు’
ఇప్పటి వరకు మందు తాగాలనిపిస్తే సౌదీ వాసులు పక్కనే ఉన్న బహ్రెయిన్ ద్వీపానికో లేదా దుబాయ్‌కో వెళ్లేవారు. కొంతమంది స్మగ్లింగ్ చేసిన మందును భారీ ధరకు కొనేవారు. కానీ, తాజా మార్పులతో ధనవంతులైన విదేశీయులకు ఇప్పుడు రియాద్‌లోనే ’కిక్కు’ దొరుకుతోంది. సౌదీలో సినిమాలు వచ్చాయి, మహిళలు డ్రైవింగ్ సీట్ ఎక్కారు, ఇప్పుడు మద్యం దుకాణాలు కూడా వచ్చేశాయి. అయితే ఇది కేవలం విదేశీయులకే పరిమితమా? లేక భవిష్యత్తులో అందరికీ అందుబాటులోకి వస్తుందా?.. అన్నది వేచి చూడాలి. ఏది ఏమైనా, సౌదీలో ఈ ’లిక్కర్ ఎక్స్‌పెరిమెంట్’ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
దశాబ్దాల నిషేధం!
సౌదీలో మద్యం ఎందుకు నిషేధించారో తెలుసా? 1951లో సౌదీ వ్యవస్థాపక రాజు అబ్దుల్ అజీజ్ కుమారుడు ప్రిన్స్ మిషారీ, మద్యం మత్తులో జెడ్డాలోని బ్రిటిష్ వైస్ కాన్సుల్‌ను కాల్చి చంపాడు. ఆ చేదు జ్ఞాపకంతో అప్పట్లో మద్యంపై కఠిన నిషేధం విధించారు. ఇప్పుడు విజన్ 2030లో భాగంగా మొహమ్మద్ బిన్ సల్మాన్ మళ్లీ మెల్లమెల్లగా నిబంధనలను సడలిస్తున్నారు.
– సాక్షి, నేషనల్ డెస్క్


