అమ్మలేదు... నాన్న పోషించలేడు!

Father Left His Two Daughters In Sishu Vihar - Sakshi

షాద్‌నగర్‌ రూరల్‌: ఆ చిన్నారులకు జన్మనిచ్చిన తల్లి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది.. చిన్నారుల ఆలనా, పాలనా తండ్రికి భారంగా మారింది. ముక్కుపచ్చలారని పసిమొగ్గలను లాలించేందుకు అమ్మ లేకపోవడం.. వారి బాధ్యత నాన్నకు భారం కావడంతో ఆ చిన్నారులను ఐసీడీఎస్‌ అధికారులు శిశు విహార్‌కు తరలించారు. ఈ ఘటన శుక్రవారం షాద్‌నగర్‌ పట్టణంలో చోటు చేసుకుంది. ఆదిలాబాద్‌ జిల్లా జైనత్‌ మండల దీపాయిగూడకు చెందిన గణేష్‌ 16 సంవత్సరాల క్రితం షాద్‌నగర్‌కు వలస వచ్చాడు. పట్టణంలో కూలీ పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఈ నేపథ్యంలో షాబాద్‌ మండలం సర్దార్‌నగర్‌కు చెందిన శ్రీలతతో పరిచయం ఏర్పడింది. (అమ్మ బతకాలని..)

9 సంవత్సరాల క్రితం గణేష్, శ్రీలత ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇద్దరూ కూలీపని చేస్తూ రైల్వే స్టేషన్‌ సమీపంలో జీవనం కొనసాగిస్తున్నారు. వారికి శ్రీగాయత్రి(4), హన్సిక(17నెలలు) చిన్నారులు ఉన్నారు. శ్రీలత మూడు నెలల క్రితం గుండె సంబంధిత వ్యాధితో మృతిచెందింది. చిన్నారుల ఆలనా పాలనా చూసే తల్లి లేకపోవడంతో వారి బాధ్యత తండ్రికి భారంగా మారింది. ఈ విషయాన్ని తండ్రి గణేష్‌ అంగన్‌వాడీ టీచర్‌ జయమ్మ ద్వారా ఐసీడీఎస్‌ అధికారులకు సమాచారాన్ని అందించాడు. కరోనా వైరస్‌ నేపథ్యంలో ఆ చిన్నారులను రెండు నెలల పాటు హోం క్వారంటైన్‌లో ఉంచి శుక్రవారం సీడీపీఓ నాగమణి ఆధ్వర్యంలో శిశు విహార్‌ ప్రతినిధులకు అప్పగించారు. (బుల్లెట్‌పై వంటలు.. రుచి చూడాల్సిందే!)

నేను పెద్దయ్యాక మళ్లీ వస్తా
చిన్నారులను అధికారులు శిశువిహార్‌కు తీసుకువెళ్లే సమయంలో ‘నాన్న నేను మళ్లీ వస్తా’ అంటూ చిన్నారి శ్రీగాయత్రి తండ్రి గణే‹శ్‌కు చెప్పింది. ‘మా అమ్మ బిస్కెట్లు, చాకెట్లు ఇప్పిస్తుండె. ఇప్పుడు గుండెనొప్పితో చనిపోయింది. అందుకే నేను మా చెల్లి హాస్టల్‌కు వెళ్తున్నాం. నేను పెద్దయ్యాక మళ్లీ వస్తా’ అంటూ ఆ చిన్నారి చెప్పిన మాటలు అందిరి మనసులను కదిలించాయి. ముక్కుపచ్చలారని పిల్లలు పసితనంలోనే తల్లిని కోల్పోయి మేము హాస్టల్‌కు వెళుతున్నామంటూ అమాయకత్వంతో ఆ చిన్నారి చెప్పడాన్ని చూసిన వారి కళ్లు చెమ్మగిల్లాయి.(భళారే చార్‌కోల్‌ చిత్రాలు)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top