భళారే చార్‌కోల్‌ చిత్రాలు

IT Student Micro Art Classes in Youtube Channel Hyderabad - Sakshi

ఆకట్టుకుంటున్నఐటీ విద్యార్థి గీసిన చిత్రాలు

సృజనకు  పని కల్పించిన లాక్‌డౌన్‌

యూట్యూట్‌లో మైక్రో ఆర్ట్‌ పాఠాలు

సందేశాత్మకమైన చార్కోల్, మైక్రో ఆర్టే లక్ష్యం

అగ్గిపుల్ల, సబ్బుబిల్ల, కుక్కపిల్ల కాదేదీ కళకు అనర్హం అన్న మహాకవి శ్రీశ్రీ మాటలను నిజం చేస్తూ ఓ విద్యార్థి బొగ్గు(చార్‌ కోల్‌)తో అందమైన చిత్రాలను వేస్తూ ఆకట్టుకుంటున్నాడు. చిన్నతనంలో చాలామంది కర్రబొగ్గుకనిపిస్తే బండలు, గోడలపై వివిధ చిత్రాలను గీస్తూ టైంపాస్‌ చేసేవారు. కానీ ఆ విద్యార్థి గీస్తున్న చిత్రాలు ఆలోచింపజేస్తున్నాయి. నిజంగాబొగ్గుతో ఇంత అందంగా బొమ్మలు వేయవచ్చా..? అనే ఆలోచన కలిగిస్తున్నాయి. బొగ్గుతో రాశికన్నా చిత్రాన్ని గీసి సోషల్‌ మీడియాలో పెడితే..ఏకంగా నటి రాశికన్నా మెచ్చుకుంది. నటీనటుల చిత్రాలతో పాటు ప్రకృతి, కరోనా కారణంగా ఎదురవుతున్న కష్టాలను చిత్రాల ద్వారా తెలియజేశాడు. లాక్‌డౌన్‌ సమయాన్ని వృథా చేసుకోకుండా బొమ్మలు గీయడం మొదలు పెట్టాడు.. ఇప్పుడు అందరితో ఔరా అనిపించుకుంటున్నాడు.

లక్డీకాపూల్‌:  నగరానికి చెందిన బి.పవన్‌ విష్ణుసాయి జైపూర్‌లోని మణిపూర్‌ విశ్వవిద్యాలయంలో బీటెక్‌ మొదటి సంవత్సరం చదువుతున్నాడు.అతడి తండ్రి బి.రాము ఎక్స్‌ సర్వీస్‌మెన్‌. సీఆర్‌పీఎఫ్‌లో సేవలందించారు. తల్లి బి.రాజేశ్వరీ నగరంలోని బిట్స్‌పిలానిలో బ్యూటీషియన్‌. కరోనా వైరస్‌ నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌ కారణంగా పవన్‌ నగరానికి చేరుకున్నారు. ఆ సమయంలో ఖాళీగా ఉండకుండా ఆర్ట్‌పై దృష్టి పెట్టాడు. అందుకు చార్‌కోల్, మైక్రోఆర్ట్‌ను ఎంచుకున్నాడు. ఈ రంగంలో అనుభవం లేనప్పటికీ.. చిన్నతనంలో ఛాయచిత్రాలు గీసిన అనుభవానికి మెరుగులు దిద్దాడు. ఇందుకు తల్లిదండ్రుల ప్రోత్సాహం కూడా తోడుకావడంతో పరిణితి చెందిన చిత్రకారుడి తరహాలో పవన్‌ ప్రకృతి అందాలకు రూపం ఇస్తూ.. పలువురి దృష్టిని ఆకర్షిస్తున్నాడు.

కేవలం చార్‌కోల్‌తో ఛాయచిత్రాలు గీయడమే కాకుండా యూట్యూబ్‌ ద్వారా చార్‌కోల్, మైక్రోఆర్ట్‌పై పాఠాలు చెప్పే స్థాయికి చేరాడు. ఒకవిధంగా చెప్పాలంటే లాక్‌డౌన్‌ తనకు కెరీర్‌లో మార్గనిర్దేశం చేసిందని అతడు పేర్కొంటున్నాడు. టెన్త్‌లో బొమ్మలు వేసిన అనుభవానికి మరింతగా మెరుగులు దిద్దుకునేందుకు లాక్‌డౌన్‌ దోహదపడిందని చెబుతున్నారు. తన చిత్రాలకు ఇన్‌స్ట్రాగామ్‌లో ప్రసంశలు కూడా అందుతున్నాయని వివరించారు. ప్రముఖ సినీ నటి రాశిఖన్నా చార్‌కోల్‌తో గీసిన ఆమె చిత్రాన్ని మెచ్చుకుంది. ఆమె సందేశం తనకు మరింత ఊతమిచ్చిందని అతడు చెప్పారు. ఐటీ రంగంలో రాణిస్తూనే.. చార్‌కోల్‌ మైక్రోఆర్ట్‌ రంగంలో తన ప్రతిభ చాటుకుంటూ ఓ మంచి ఛాయచిత్రకారుడిగా నిలవాలన్నదే తన లక్ష్యమని పవన్‌ పేర్కొన్నారు. ఈ క్రమంలో సందేశాత్మక చిత్రాలతో సమాజానికి మార్గదర్శకంగా నిలిచేందుకు తనవంతు కృషి చేస్తానని స్పష్టం చేస్తున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top