భూమి దక్కకపోతే చచ్చిపోవాలనుకున్న..!

Farmer Field Pass Book Problem Facebook Video Solved By CM KCR - Sakshi

సాక్షి,బెల్లంపల్లి: ‘‘మాకున్న గా ఏడెకరాల భూమిని నమ్ముకుని బతుకుతున్నం. గా భూమి దప్ప మాకింకేదిక్కులేదు. ఎలాంటి ఆస్తిపాస్తులు సుత లేవ్‌. మా అయ్య కాపాడుకుంట అచ్చిన భూమి నాగ్గాక్కుండ పోయినంక ఇక బతుకుడెందుకు..? నా భూమి నాకు  పట్టా కాకపోతే చచ్చిపోవాలని అనుకున్న..’’ ఇదీ నెన్నెల మండలం నందులపల్లి గ్రామానికి చెందిన బాధిత రైతు కొండపల్లి శంకరయ్య ఆవేదన. యాభై ఏళ్ల నుంచి సాగు చేసుకుంటున్న భూమిని రెవెన్యూ అధికారులు మామూళ్లకు కక్కుర్తిపడి మరో వ్యక్తి పేరిట పట్టా చేయడంతో శంకరయ్య పది నెలల నుంచి పడిన బాధ వర్ణణాతీతం. వివరాలిలా ఉన్నాయి..

కొండపల్లి మల్లయ్యకు కూతురు, కుమారుడు శంకరయ్య ఉన్నారు. కూతురికి పెళ్లి చేసి అత్తారింటికి పంపించాడు. శంకరయ్యకు కూడా పెళ్లి చేయడంతో ఆయనకు ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. ముప్పై ఏళ్ల క్రితం శంకరయ్య తండ్రి మల్ల య్య చనిపోయాడు. ఆయన మరణాంతరం నందులపల్లి గ్రామ శివారు సర్వేనంబర్‌ 271/ఏలో 7.01 ఎకరాల భూమి వారసత్వంగా శంకరయ్య పేరిట 20 ఏళ్ల క్రితం పట్టా అయింది.

ఆ  భూమిలో నుంచి రెండు ఎకరాల్లో పత్తి పంట, మిగతా 5 ఎకరాల్లో వరి సాగు చేసుకుంటూ శంకరయ్య కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం డబ్బులు తనకు కూడా వస్తాయని ఎంతగానో ఆశపడ్డాడు. కానీ ఆ పథకం కింద నయాపైసా చేతికి అందలేదు. భూ రికార్డుల ప్రక్షాళనలో భాగంగా అందరి మాదిరిగా పట్టాదారు పాసు పుస్తకం కూడా రాలేదు. దీంతో ఆందోళనకు గురైన శంకరయ్య పలుమార్లు రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ పెద్దిరాజు, గ్రామ వీఆర్వో కరుణాకర్‌ను కలిసి పాసుపుస్తకం ఇప్పించాలని ప్రాధేయపడ్డాడు. ఎప్పుడు కలిసి అడిగినా ధరణి వెబ్‌సైట్‌ పని చేయడం లేదని, ఆన్‌లైన్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తాయని నిరక్షరాస్యుడైన శంకరయ్యకు ఇన్నాళ్లూ రెవెన్యూ ఉద్యోగులు నమ్మబలుకుతూ వచ్చారు. 

తహసీల్దార్‌ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణ..
పట్టాదారు పాసు పుస్తకం కోసం రెవెన్యూ అధికారుల చుట్టూ శంకరయ్య ఎంతగా తిరిగాడో లెక్కలేదు. భూ ప్రక్షాళన కార్యక్రమం ఆరంభమైనప్పటి నుంచి తహసీల్దార్‌ కార్యాలయం చుట్టూ వందకు పైబడి సార్లు చెప్పులరిగేలా తిరిగాడు. అంతకుమించి ఆర్‌ఐ, వీఆర్వో చుట్టూ రోజు గుడికి వెళ్లి దేవుడిని దర్శించుకున్నట్లుగానే తహసీల్‌ కార్యాలయం చుట్టు ప్రదక్షిణ చేశాడు. ఏ ఒక్కనాడూ ఆ అధికారులు కరుణించిన పాపాన పోలేదు. కనీసం ఆన్‌లైన్‌లో పట్టాదారు పేరు మార్పిడి చేసి, శంకరయ్య పేరున పట్టాదారు పాసు పుస్తకం మంజూరు చేసి, చేసిన తప్పును సరిదిద్దుకోలేకపోయారు. పైగా అమాయకుడైన శంకరయ్యను ఎప్పటికప్పుడు తిప్పించుకుని ఎంతో వేదన కలిగించారు. కాసులకు ఆశపడి ఏకంగా మరొకరి పేరుమీద భూమిపట్టా చేసి ఆ పేద కుటుంబానికి ప్రత్యక్ష నరకం చూపించారు.
 
బాధపడని రోజు లేదు..! 
భూప్రక్షాళన కార్యక్రమం అయిపోయినప్పటి నుంచి పాసు పుస్తకం, రైతుబంధు చెక్కు కోసం శంకరయ్య దిగులు ప్రారంభమైంది. భూమి తన వద్దే ఉన్నా.. ఆ భూమిని తానే సాగు చేసుకుంటున్నా ఎందువల్ల పట్టా పాసు పుస్తకం, రైతుబంధు చెక్కు ఇవ్వడం లేదో రోజు ఇంట్లో భార్యాబిడ్డలతో కుమిలిపోయే వాడు. ఎప్పుడిస్తారో అని రోజు పడిగాపులు కాసేవాడు. ఆ దిగులుతో అన్నం ముద్ద నోట్లోకెళ్లేది కాదు. భార్య, కొడుకులు ఎంత ధైర్యం చెప్పినా ప్రయోజనం లేకపోయింది. ఆయనను చూసీ ఆ ఇల్లాలు, కొడుకులు కూడా సరిగా అన్నం తినని రోజులు కోకోల్లలు. ఆ తీరుగా భూమి పట్టా రాకుండా ఆ బాధిత కుటుంబం బాధ పడని రోజంటూ లేకుండా పోయింది.

చివరికి శంకరయ్య పెద్ద కొడుకు శరత్‌ ఓ ఆలోచన చేసి ఫేస్‌బుక్‌లో ‘మన వ్యవసాయం–మన పంటలు’ గ్రూపులో తన తాత మల్లయ్య పేరిట పట్టాదారు పాసు పుస్తకం, రైతుబంధు చెక్కు అందించని తీరును వీడియో లైవ్‌గా పోస్టు చేశాడు. ఆ పోస్టు సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యంత్రి కేసీఆర్‌ కంట పడడం, ఆ సమస్య ఏంటో పరిశీలించాలని కలెక్టర్‌ భారతీ హోళీకేరీని ఆదేశించడంతో శంకరయ్య సమస్య వెలుగు చూసింది. సీఎం కేసీఆర్‌ ఫోన్‌ చేసి నేరుగా శరత్‌తో మాట్లాడడం, ఆడియో వైరల్‌ కావడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కేసీఆర్‌ ఆదేశాలతో కలెక్టర్‌ విచారణలో రెవెన్యూ అధికారులు లీలలు ఒక్కసారిగా బయట పడ్డాయి. చివరికి కలెక్టర్‌ విచారణ జరిపి బాధిత రైతు పేరిట పట్టాదారు పాసుపుస్తకం ఆన్‌లైన్‌లో మార్చారు. మొదటి విడత రైతుబంధు చెక్కు అందజేసి రెండో విడతకు సంబంధించి బ్యాంకు ఖాతాలో జమ చేస్తామని అధికారులు చెప్పారు. అక్రమాలకు పాల్పడిన ఆర్‌ఐ, వీఆర్వోలను సస్పెండ్‌ చేయడంతో కథ సుఖాంతమైంది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top