ఫలక్‌నుమా ప్యాలెస్‌కు 125 ఏళ్లు

Falaknuma Palace Completes 125 Years Special Story - Sakshi

 అక్టోబర్, 1894లో అందుబాటులోకి.. 

నిర్మాత సర్‌ వకారుల్‌ ఉమ్రా 

ఆరో నిజాం సొంతం 

ప్రస్తుతం తాజ్‌ ఫలక్‌నుమా హోటల్‌

సాక్షి,సిటీబ్యూరో: ఆకాశం ఛత్రం కింద అద్దంలా మెరిసే అద్భుత నిర్మాణం అది. వెన్నెల రాత్రి చందమామకే కన్నుకుట్టే సౌందర్యం దాని సొంతం. అంతటి అందం హైదరాబాద్‌ నగరానికే సొంతం. అదే ‘ఫలక్‌నుమా ప్యాలెస్‌’. ప్రపంచంలోని ఉత్తమ భవనాల్లో ఒకటిగా నిలిచిన ఈ ప్యాలెస్‌.. ఆరో నిజాం నవాబ్‌ మీర్‌ మహబూబ్‌ అలీఖాన్‌ హయాంలో హైదరాబాద్‌ రాజ్య ప్రధానిగా పనిచేసిన పైగా వంశస్తుడు సర్‌ వకారుల్‌ ఉమ్రా సారథ్యంలో నిర్మితమైంది. చార్మినార్‌కు ఐదు కి.మీ దూరాన ఉన్న కొండపై 1884లో శంకుస్థాపన చేసి.. దాదాపు పదేళ్ల పాటు నిర్మాణం సాగి 1894 అక్టోబర్‌లో పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చింది. అంటే ఈ ఇంద్రభవనానికి ఈ నెలతో 125 ఏళ్లు పూర్తయ్యాయి.

అప్పుల పాలైన వికారుల్‌
హైదరాబాద్‌ సంస్థానంలో ‘పైగా’లు నిజాంల సైన్యాధ్యక్షులుగా సేవలందించారు. ఆరో నిజాం బావమరిది, ప్రధాని అయిన సర్‌ వకారుల్‌ ఉమ్రా తనకుంటూ రాజ్యంలో ప్రత్యేక భవనాన్ని కట్టించాలని తలంచి ‘ఫలక్‌నుమా ప్యాలెస్‌’కు అంకురార్పణ చేశాడు. దాదాపు 32 ఎకరాల్లో 44 ప్రధాన గదులతో పాటు జనానా మహల్, గోల్‌ బంగ్లా, హరీం క్వార్టర్లు, వంటగది వంటి ఉన్నాయి. వకారుల్‌ వృశ్చిక రాశిలో పుట్టడం వల్ల ఈ భవనాన్ని కూడా ‘తేలు’ ఆకారంలో నిర్మించాడు. ఇండో ఆరేబియన్, పర్శియన్, ఇటాలియన్‌ శైలులు ఈ భవనంలో కనిపిస్తాయి. ప్యాలెస్‌కు వాడిన పాలరాయిని ఇటలీ నుంచి, కలప ఇంగ్లాండ్‌ నుంచి, గొడల పైకప్పు మీద ఫ్రెంచ్‌ చిత్రకారులతో అందమై డిజైన్లు గీయించారు. అయితే, ఈ ప్యాలెస్‌ నిర్మాణంతో వికారుల్‌ వద్దనున్న ధనం మొత్తం ఖర్చయిపోగా అప్పులపాలైపోయాడు. వాటిని తీర్చేందుకు భార్య సలహా మేరకు తన బావ, ఆరో నిజాంను తన ప్యాలెస్‌కు ఆహ్వానించాడు. నిజాం పరిస్థితిని అర్థం చేసుకోవడంతో పాటు నిర్మాణం నచ్చి ఫలక్‌నుమా ప్యాలెస్‌ను రూ.60 వేలకు సొంతం చేసుకున్నాడు. అలా 1897లో ఆరో నిజాం అధీనంలోకి వచ్చి రాయల్‌ గెస్ట్‌హౌస్‌గా మారింది. ఈయన 1911లో మరణించే వరకు ఇక్కడే నివాసమున్నాడు. తర్వాత ఏడో నిజాం ఉస్మాన్‌ అలీఖాన్‌ ప్యాలెస్‌ను యూరోపియన్‌ శైలిలో మార్పు చేయించాడు. 

హోటల్‌ తాజ్‌ఫలక్‌నుమాగా..

స్వతంత్ర భారతదేశంలో నిజాం పాలన ముగిశాక ఈ ప్యాలెస్‌ ఏడో నిజాం మనవడు బర్కత్‌ అలీఖాన్‌ ముకరంజా అధీనంలోకి వచ్చింది. 1948 నుంచి దాదాపు 2000 వరకు ఈ ప్యాలెస్‌లో ఎలాంటి కార్యక్రమాలు జరగలేదు. తర్వాత ముకరంజా మొదటి భార్య అస్రా తన అధీనంలో తీసుకొని 30 ఏళ్ల పాటు తాజ్‌ హోటల్‌ గ్రూప్‌కు ఇవ్వడంతో 2000 సంవత్సరంలో ఇది ‘తాజ్‌ ఫలక్‌నుమా’గా అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం నగరంలో అత్యంత ఖరీదైన హోటళ్లలో మొదటి స్థానంలో ఉంది. ఇందులోనే ప్రపంచంలోనే అతిపెద్ద పురాతన డైనింగ్‌ హాల్‌ ఉంది. ఇక్కడ ఒకేసారి 101 మంది భోజనం చేయవచ్చు. ఈ హోటల్‌లోని డైనింగ్‌ హాల్‌లో భోజనం చేయాలంటే పూటకు ఇకొక్కరికీ రూ.15 వేలు చెల్లించాల్సిందే. ఇక గదుల అద్దె కూడా రూ.20 వేల నుంచి మొదలై రూ.5 లక్షల వరకు ఉంది.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top