
సాక్షి, హైదరాబాద్: ఓటర్ల జాబితాపై అప్రమత్తంగా ఉండాలని, బూత్‌ల వారీగా జాబితాలను పరిశీలించి అర్హులందరూ జాబితాలో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని ఏఐసీసీ కార్యదర్శి శ్రీనివాస కృష్ణన్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులకు సూచించారు. మంగళవారం ఆయన గాంధీభవన్‌లో నిజామాబాద్, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల డీసీసీ అధ్యక్షులు, ఆయా జిల్లాలోని నియోజకవర్గాల సమన్వయకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కృష్ణన్ మాట్లాడుతూ.. ఓటర్ల జాబితాలను క్షుణ్ణంగా పరిశీలించాలని, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, సానుభూతిపరుల ఓట్లు గల్లంతవ్వకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
పోలింగ్ బూత్ కమిటీల ఏర్పాటులో ఎట్టి పరిస్థితుల్లోనూ జాప్యం వహించొద్దని, వారం రోజుల్లోగా అన్ని బూత్ కమిటీలను నియమించాలని చెప్పారు. ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో కేడర్‌పై దృష్టి సారించి చైతన్య పరచాలని సూచించారు. టీఆర్‌ఎస్ పాలనా వైఫల్యాలను ఎండగట్టడంతో పాటు కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న హామీలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. సమావేశంలో జిల్లాల కాంగ్రెస్ అధ్యక్షులు కటకం మృత్యుంజయం, నాయిని రాజేందర్‌రెడ్డి, తాహెర్‌బిన్ హమద్ తదితరులు పాల్గొన్నారు.