మద్యం వ్యాపారుల సిండికేట్‌..

Excitement For Liquor Merchants In Ranga Reddy - Sakshi

సాక్షి, వికారాబాద్‌: మద్యం వ్యాపారుల్లో ఒకటే టెన్షన్‌.. మరికొన్ని గంటల్లో డ్రా పద్ధతిన వైన్‌ షాపులను కేటాయించనున్నారు. వీటికోసం దరఖాస్తు చేసుకున్న వారు అదృష్టం తమనే వరించాలని దేవుళ్లను మొక్కుకుంటున్నారు. బినామీల పేరిట టెండర్లు వేసిన రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు సైతం ఉత్కంఠగా ఉన్నారు. మద్యం దుకాణాల కోసం దరఖాస్తు చేసుకున్న వ్యక్తులు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు తహతహలాడుతున్నారు. లక్కీ డ్రా కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.

తాండూరు, వికారాబాద్‌ నియోజకవర్గాల్లో అత్యధికంగా మద్యం అమ్మకాలు జరిగే వైన్‌షాపులు 10 నుంచి 20  వరకు ఉన్నాయి. ధారూరు, కుల్కచర్ల, పెద్దేముల్, దోమ, మన్నెగూడ, బషీరాబాద్, వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్‌ పట్టణాల్లోని మద్యం దుకాణాలకు ఎక్కువగా పోటీ ఉంది. వ్యాపారం బాగా జరిగే మద్యం దుకాణాలను ఎలాగైనా దక్కించుకోవాలని సిండికేట్‌ వ్యాపారులు పట్టుదలగా ఉన్నట్లు సమాచారం. ఇందుకోసం తాము ఎంపిక చేసుకున్న మద్యం దుకాణాలకు ఎక్కువ దరఖాస్తులు రాకుండా ఈ గ్రూపులోని సభ్యులు జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఎవరైనా బలంవంతంగా దరఖాస్తు చేసేందుకు ముందుకు వచ్చినా ఓ ప్రజాప్రతినిధి ద్వారా అడ్డుకున్నట్లు  వినికిడి. తాండూరు సర్కిల్‌లోని ఓ మద్యం దుకాణానికి గుంటూరు జిల్లాకు చెందిన ఓ వ్యాపారి దరఖాస్తు చేశారు. ఈ విషయం తెలిసిన స్థానిక సిండికేట్‌ సభ్యులు.. లక్కీడ్రాలో గుంటూరు వ్యాపారికి షాపు దక్కినా తమకే వదిలేసేలా ఒత్తిడి తీసుకువచ్చినట్లు సమాచారం.

తాండూరు కు చెందిన ఓ రాజకీయ నాయకుడు, మహిళా నాయకురాలు మద్యం దుకాణాలు దక్కించుకునేందుకు తెరవెనక పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. లక్కీ డ్రాలో తమకు షాపులు దక్కకున్నా.. లాటరీ వచ్చిన వ్యాపారుల సిండికేట్‌! వారి నుంచి లైసెన్స్‌లు పొందేలా సిండికేట్‌ సభ్యులు చక్రం తిప్పుతున్నట్లు సమాచారం.

ఇదిలా ఉండగా ఎక్సైజ్‌ అధికారులు మాత్రం జిల్లాలో సిండికేట్‌ అనేది లేదని చెబుతున్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకు కలెక్టర్‌ సమక్షంలో లక్కీ డ్రాలు తీసి దుకాణాలను కేటాయిస్తామని అసిస్టెంట్‌ ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ మల్లారెడ్డి తెలిపారు. షాపుల కేటాయింపు పూర్తి పారదర్శకంగా ఉంటుందన్నారు. 

ఏర్పాట్లు పూర్తి.. 
వికారాబాద్‌లో మొత్తం 46 మద్యం దుకాణాలకు ఎక్సైజ్‌ అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. వీటికోసం మొత్తం 683 టెండర్లు దాఖలయ్యాయి. వీటిలో అత్యధికంగా తాండూరు సర్కిల్‌లోని 16 మద్యం దుకాణాలకు 206, వికారాబాద్‌ సర్కిల్‌లోని 11 షాపులకు 202 దరఖాస్తులు వచ్చాయి. శుక్రవారం లక్కీ డ్రా ద్వారా దుకాణాలను కేటాయించనున్నారు. వికారాబాద్‌లోని అంబేడ్కర్‌ భవనంలో ఉదయం 11 గంటలకు కలెక్టర్‌ ఆయేషా మస్రత్‌ ఖానమ్‌ పర్యవేక్షణలో లక్కీ డ్రా నిర్వహిస్తారు. ఇందుకోసం ఎక్సైజ్‌ అధికారులు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top