
సాక్షి, హైదరాబాద్: నవంబర్ 1 (బుధవారం) నుంచి తమ ఆస్పత్రుల్లో ఈఎస్‌ఐ రోగులకు వైద్య సేవలు నిలిపివేయనున్నట్లు సోమవారం తెలంగాణ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ ఒక ప్రకటనలో తెలిపింది. వైద్య బిల్లుల చెల్లింపుల్లో జరుగుతున్న తీవ్ర జాప్యానికి తోడు పెరిగిన ధరలకు అనుగుణంగా చెల్లింపులు జరపకపోవడాన్ని నిరసిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఈఎస్‌ఐతో రాష్ట్రవ్యాప్తంగా 43 స్పెషాలిటీ ఆస్పత్రులు అవగాహన ఒప్పందం కుదుర్చుకోగా, వీటిలో వరంగల్, కరీంనగర్‌లోని నాలుగు ఆస్పత్రులు మినహా మిగిలినవన్నీ హైదరాబాద్‌లోనే ఉన్నాయి.
వీటిలో రోజుకు సగటున 200 మంది ఈఎస్‌ఐ లబ్ధిదారులు ఇన్‌పేషెంట్లుగా చేరుతున్నారు. లబ్ధిదారులకు చికిత్స చేసి పంపిస్తున్నప్పటికీ సకాలంలో బిల్లులు చెల్లించడం లేదని, ఇప్పటికే ఆయా ఆస్పత్రులకు 2012 నుంచి ఇప్పటివరకు భారీ మొత్తంలో బకాయిలు చెల్లించాల్సి ఉందని అసోసియేషన్ ఆరోపించింది. పెరుగుతున్న ధరలకు విరుద్ధంగా ఈఎస్‌ఐ ప్యాకేజీలు ఉన్నాయని తెలిపింది. సకాలంలో వైద్య ఖర్చులు చెల్లించక పోవడంతో పాటు భారీగా బకాయిలు పేరుకుపోవడంతో ఇకపై ఈఎస్‌ఐ లబ్ధిదారులకు తమ అస్పత్రుల్లో ఉచిత సేవలు అందించడం కుదరదని తేల్చి చెప్పింది.
ఈ మేరకు ఈఎస్‌ఐ మెడికల్ కమిషనర్‌కు నోటీసులు కూడా అందజేసినట్లు పేర్కొంది. అయితే అసోసియేషన్ చెబుతున్న దాంట్లో వాస్తవం లేదని ఈఎస్‌ఐ మెడికల్ కమిషనర్ ఇమాన్యుయెల్ చెప్పారు. మే 2017 నుంచే బకాయిలు చెల్లించాలని, అది కూడా రూ.80 కోట్ల బకాయిలు మాత్రమేనని తెలిపారు. స్పెషాలిటీ ఆస్పత్రుల నిరాకరణ నేపథ్యంలో రోగులకు ఇబ్బంది కలగకుండా పలు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు.