తెలంగాణ రైతులపై టీడీపీ నాయకులకు ప్రేముంటే మనకు రావాల్సిన విద్యుత్ వాటాను అడ్డుకుంటున్న ఏపీ సీఎం చంద్రబాబునాయుడుని నిలదీయాలని ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ అన్నారు.
సంస్థాన్ నారాయణపురం : తెలంగాణ రైతులపై టీడీపీ నాయకులకు ప్రేముంటే మనకు రావాల్సిన విద్యుత్ వాటాను అడ్డుకుంటున్న ఏపీ సీఎం చంద్రబాబునాయుడుని నిలదీయాలని ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ అన్నారు. సంస్థాన్ నారాయణపురంలో ఆదివారం జరిగిన విలేకరుల సమావేశం లో ఆయన మాట్లాడారు. కృష్ణపట్నం ప్లాంటును 4నెలలుగా పనిచేయకుండా చేసిందెవరో మీకు తెలియదా? అని టీడీపీ నాయకులను ప్రశ్నించారు. కృష్ణపట్నం ప్రాజెక్టులో తెలంగాణకు రావాల్సిన విద్యుత్ వాటాను ఇవ్వాలని, ఎన్‌టీఆర్ భవన్ నుంచి కృష్ణపట్నం, విజయవాడల వరకు టీడీపీ నాయకులు బస్సుయాత్ర చేయాలని సూచించారు. 17ఏళ్లలో టీడీపీ చేయలేనిది, 3, 4నెలల్లోనే టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎలా చేస్తుందన్నారు. టీడీపీ నాయకులు ఏపీ కోవర్టులుగా మారి, తెలంగాణ ప్రజలను గందరగోళానికి గురి చేస్తున్నారన్నారు. తెలంగాణ విభజన, హైదరాబాద్ విషయంలో చప్పుడు చేయని టీడీపీ నాయకులు, ఇప్పుడు చంద్రబాబును చూసుకొని అవివేకంగా మాట్లాడుతున్నారన్నారు. బస్సుయాత్రల పేరుతో రైతులు మనోధైర్యం కోల్పోయే విధంగా టీడీపీ నాయకులు వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఈ సమావేశంలో నీళ్ల లింగస్వామి, ఏర్పుల అంజమ్మ, ఆంజనేయులు, వడ్డేపల్లి రాములు, తెలంగాణ భిక్షం, జక్కిడి ప్రభాకర్‌రెడ్డి, రమేష్, భానుచందర్, కృష్ణ తదితరులున్నారు.