‘పంచాయతీ’ రెండో విడత షురూ 

Elections for 4135 Panchayats in the second phase - Sakshi

రేపటి వరకు నామినేషన్ల స్వీకరణ గడువు

రెండో దశలో 4,135 పంచాయతీలకు ఎన్నికలు

సర్పంచ్‌ పదవికి తొలిరోజు 4,850 నామినేషన్లు  

సాక్షి, హైదరాబాద్‌: గ్రామ పంచాయతీ ఎన్నికల రెండో విడత నామినేషన్ల దాఖలు ప్రక్రియ శుక్రవారం మొదలైంది. రెండో దశలో 4,135 గ్రామ పంచాయతీలు, 36,602 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. సర్పంచ్‌ పదవికి తొలి రోజు 4,850 నామినేషన్లు దాఖలవగా వార్డు సభ్యుల స్థానాలకు 9,198 నామినేషన్లు వచ్చాయి. ఆదివారంతో నామినేషన్ల స్వీకరణ గడువు ముగియనుంది. సోమవారం నామినేషన్ల పరిశీలనకు అధికార యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. అసంపూర్తి సమాచారం, అవసరమైన పత్రాలు జత చేయకపోవడం, ఆయా అంశాలకు సంబంధించిన పూర్తి వివరాలు జోడించని కారణంగా గతంలో పలువురు సర్పంచ్, వార్డు మెంబర్‌ అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురైన సందర్భాలున్నాయి. ఈ నేపథ్యంలో నామినేషన్ల పరిశీలనకు ప్రాధాన్యత ఏర్పడింది. నామినేషన్ల తిరస్కరణ అవకాశాలను తగ్గించుకునేందుకు వీలుగా నామినేషన్ల పరిశీలనకు అభ్యర్థులు వివిధ డాక్యుమెంట్లు తమ వద్దే ఉంచుకుంటే శ్రేయస్కరమని అధికారులు చెబుతున్నారు. 

రేపు మధ్యాహ్నం 3 వరకు నామినేషన్ల ఉపసంహరణ... 
తొలి విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల పరిశీలన తర్వాత ఆదివారం మధ్యాహ్నం 3 గంటల్లోగా, రెండో విడత ఎన్నికల నామినేషన్లను సోమవారం పరిశీలించాక గురువారం (17న) మధ్యాహ్నం 3 గంటల్లోగా అభ్యర్థులు పోటీ నుంచి ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. ఇందుకోసం ఫారం–7 (అనుబంధం–8)లో అభ్యర్థి తన సంతకంతో లిఖితపూర్వక నోటీసును రిటర్నింగ్‌ అధికారికి వ్యక్తిగతంగా సమర్పించడం ద్వారా అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకోవచ్చు. ఈ నోటీసును అభ్యర్థి వ్యక్తిగతంగా సమర్పించలేకుంటే ప్రపోజర్‌ లేదా ఎన్నికల ఏజెంట్‌ ద్వారా లిఖితపూర్వకంగా ధ్రువీకరిస్తూ రిటర్నింగ్‌ అధికారికి పంపించవచ్చు. ఉపసంహరణ నోటీసుతోపాటు అభ్యర్థి గుర్తింపు సరైనదేనని ధ్రువీకరించాక అభ్యర్థి నోటీసుకు రిటర్నింగ్‌ అధికారి రశీదు ఇవ్వాలి. తాను పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ఉపసంహరణ నోటీసును రిటర్నింగ్‌ అధికారికి సమర్పించాక దాన్ని రద్దు చేసే అవకాశం ఉండదు. అభ్యర్థుల ఉపసంహరణ నోటీసులు అందిన వెంటనే రిటర్నింగ్‌ అధికారి గ్రామ పంచాయతీ నోటీస్‌ బోర్డుపై ఫారం–7(అనుబంధం–9)లో నోటీస్‌ వివరాలు పబ్లిష్‌ చేయాలి. ఆదివారం మధ్యాహ్నం 3 గంటల లోపు ఉపసంహరణ ప్రక్రియ ముగుస్తుంది. 

తిరస్కరించే నామినేషన్లపై అప్పీలుకు చాన్స్‌... 
గ్రామ పంచాయతీ సర్పంచ్‌/వార్డు మెంబర్‌ అభ్యర్థి నామినేషన్‌ తిరస్కరణకు గురైన పక్షంలో సంబంధిత రెవెన్యూ డివిజనల్‌/సబ్‌ కలెక్టర్‌ వద్ద రిటర్నింగ్‌ అధికారి నిర్ణయంపై అప్పీలు చేసుకోవచ్చు. నామినేషన్ల పరిశీలన తేదీ మర్నాడు నామినేషన్ల తిరస్కరణపై అప్పీలు దాఖలు చేసుకోవచ్చు. అప్పీలు దాఖలు చేసిన మరుసటి రోజే ఆ అప్పీలును సంబంధిత అధికారి పరిష్కరిస్తారు. 2006 ఎన్నికల నిర్వహణ నియమావళిలోని 13వ నిబంధన ప్రకారం అప్పీలు చేసుకునే వీలు కల్పించారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top