
సాక్షి, హైదరాబాద్: ముందస్తు అసెంబ్లీ ఎన్నికలకుగాను పోలీస్ శాఖ సన్నద్ధమవుతోంది. ఆ మేరకు ఏర్పాట్లు చేసుకుంటోంది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి ఫలితాలు వెలువడే వరకు నమోదయ్యే కేసులు, స్వాధీనం చేసుకునే నగదు, నేరస్థుల బైండోవర్లు, పోలీస్ బందోబస్తు తదితర అంశాలన్నింటిపై ప్రతి జిల్లా, కమిషనరేట్ నుంచి ఎన్నికల కమిషన్‌కు ఎప్పటికప్పుడు నివేదికలు పంపించాల్సి ఉంటుంది. ఇందుకోసం రాష్ట్ర పోలీస్ శాఖ ప్రత్యేకంగా ఎలక్షన్ సెల్స్ ఏర్పాటు చేస్తోంది. అందులో భాగంగా హైదరాబాద్ కమిషనరేట్‌లో ఇప్పటికే ఏసీపీ స్థాయి అధికారి నేతృత్వంలో ఎలక్షన్ సెల్‌ను ఏర్పాటు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.
అదేవిధంగా మిగతా కమిషనరేట్లు, జిల్లా యూనిట్లలో ఏర్పాటు చేయాలని పోలీస్ శాఖ ఆదేశించింది. దీంతో రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్లలో ఏసీపీ హోదా అధికారి, మిగిలిన కమిషనరేట్లు, జిల్లా యూనిట్లలో ఇన్‌స్పెక్టర్ ర్యాంకు అధికారి నేతృత్వంలో ఆరుగురు సిబ్బందితో కూడిన ఎలక్షన్ సెల్స్ ఏర్పాటు కాబోతున్నాయి. ఎన్నికల సమయంలో ఏ చిన్న గొడవ జరిగినా, నగదును పట్టుకున్నా, ఇతర అంశాలపై ఎన్నికల కమిషన్‌కు ఆయా జిల్లాల నుంచి నివేదికలు నేరుగా పంపేందుకు ఈ ఎలక్షన్ సెల్ కీలకంగా వ్యవహరించనున్నట్టు పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు.
పర్యవేక్షణ బాధ్యత డీఐజీ అధికారికి..
కమిషనరేట్లు, జిల్లా యూనిట్లలో ఏర్పాటవుతున్న ఎలక్షన్ సెల్స్ అన్నీ రాష్ట్ర స్థాయిలో డీఐజీ ర్యాంకు అధికారి నేతృత్వంలో పనిచేయనున్నట్టు పోలీస్ వర్గాలు తెలిపాయి. గతంలో ఏఐజీ(అసిస్టెంట్ ఇన్‌స్పెక్టర్ జనరల్) అధికారి నేతృత్వంలో ఎన్నికల విధులు, బందోబస్తులు, కేసులు తదితర వివరాలను ఎన్నికల కమిషన్ త్వరితగతిన పంపించి పోలీస్ శాఖ మన్ననలు పొందింది. ఈసారి కూడా అదే పద్ధతిలో రాష్ట్ర పోలీస్ ముఖ్య కార్యాలయంలో ఓ డీఐజీ ర్యాంకు అధికారిని నియమించి ఎన్నికలు ముగిసే వరకు ఈ ఎలక్షన్ సెల్స్‌ను పర్యవేక్షించే విధంగా పోలీస్ శాఖ ఏర్పాట్లు చేయనున్నట్టు తెలిసింది.