పాస్‌పోర్ట్‌ దరఖాస్తుకు ఈ–టోకెన్‌! 

E-Token for Passport Application - Sakshi

అమీర్‌పేట్‌ పాస్‌పోర్ట్‌ సేవా కేంద్రంలో ప్రయోగాత్మకంగా ప్రారంభం

తాజాగా 4 పాస్‌పోర్ట్‌ కేంద్రాలు, 23 పోస్టాఫీస్‌ పాస్‌పోర్ట్‌ కేంద్రాల్లోనూ షురూ

గడువు తీరిన పాస్‌పోర్టు వినియోగదారులకు ఎస్‌ఎంఎస్‌ అలర్ట్స్‌  

సాక్షి, హైదరాబాద్‌: పాస్‌పోర్ట్‌ సేవలకు ఈ–టోకెన్‌ విధానం సత్ఫలితాన్నిస్తోంది. ఆన్‌లైన్‌లో పాస్‌పోర్ట్‌ పొందేందుకు దరఖాస్తు చేసుకున్న వారికి ఈ–టోకెన్‌ నంబర్‌ ఎస్‌ఎంఎస్‌ రూపంలో మొబైల్‌కు అందుతుంది. దీంతో పాస్‌పోర్ట్‌ సేవా కేంద్రానికి అన్ని డాక్యుమెంట్ల జిరాక్స్‌ ప్రతులను తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదు. అక్కడి సిబ్బందికి మీ సెల్‌ఫోన్‌కు అందిన మీ దరఖాస్తు రిఫరెన్స్‌ నంబర్‌ (ఏఆర్‌ఎన్‌) చూపితే చాలు. ఈ పాస్‌పోర్ట్‌ జారీ ప్రక్రియను అక్కడి సిబ్బంది నిమిషాల్లో పూర్తి చేస్తారు. అమీర్‌పేట్‌ పాస్‌పోర్ట్‌ సేవా కేంద్రంలో అమలు చేసిన ఈ ప్రయోగాత్మక విధానం సఫలీకృతం కావడంతో ఇటీవల మరో 4 పాస్‌పోర్ట్‌ సేవా కేంద్రాలు, 23 పోస్టాఫీస్‌ పాస్‌పోర్ట్‌ సేవా కేంద్రాల్లోనూ అమలు చేస్తున్నట్లు ప్రాంతీయ పాస్‌పోర్ట్‌ కార్యాలయం వర్గాలు తెలిపాయి. దేశంలో ఢిల్లీ తర్వాత ఈ విధానాన్ని మన నగరంలో అమలు చేస్తున్నట్లు పేర్కొన్నాయి. ఇక ఏఆర్‌ఎన్‌ ద్వారా తమ పాస్‌పోర్ట్‌ అప్లికేషన్‌ ఏస్థాయిలో ఉందన్న అంశాన్ని ఈ–ట్రాకింగ్‌తో తెలుసుకునే సౌలభ్యాన్ని విదేశాంగ శాఖ కల్పించడం  విశేషం. 

6 నెలల ముందే అలర్ట్‌.. 
పాస్‌పోర్టు గడువు తీరిన వినియోగదారుల మొబైల్‌ నంబర్లకు ఎస్‌ఎంఎస్‌ అందించే సేవలను ప్రాంతీయ పాస్‌పోర్ట్‌ కార్యాలయం ప్రారంభించింది. వినియోగదారులకు 6 నెలల ముందుగానే ఈ సమాచారాన్ని తెలియజేయడం ద్వారా వారు రెన్యువల్‌కు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు. ఇందుకోసం వినియోగదారులందరి పాస్‌పోర్ట్‌ డేటాను డిజిటల్‌ మాధ్యమంలో భద్రపరిచామని పేర్కొన్నారు. ఎస్‌ఎంఎస్‌ అలర్ట్‌ సైతం కంప్యూటర్‌ ద్వారా ఆటోమేటిక్‌గా వినియోగదారులకు చేరేలా ఏర్పాట్లు చేయడం విశేషం.  

దరఖాస్తు సమయంలో జాగ్రత్త.. 
పాస్‌పోర్ట్‌కు దరఖాస్తు చేసుకునే వినియోగదారులు విధిగా కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారిక వెబ్‌సైట్‌  https://www.passportindia.gov.in/ నుంచే చేసుకోవాలని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ విషయంలో ఇతర లింక్‌లను ఆశ్రయించి మోసపోవద్దని హెచ్చరిస్తున్నారు. 

రోజూ 3 వేల దరఖాస్తులు.. 
విద్య, ఉద్యోగం, వ్యాపారం, పర్యాటకం, మెడికల్‌ టూరిజం ఇలా విదేశాలకు వెళుతోన్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోన్న నేపథ్యంలో పాస్‌పోర్ట్‌ దరఖాస్తులు సైతం అంతకంతకు పెరుగుతూనే ఉన్నాయి. నిత్యం పాస్‌పోర్ట్‌ కార్యాలయాలకు సుమారు 3 వేల దరఖాస్తులు అందుతున్నట్లు ప్రాంతీయ పాస్‌పోర్ట్‌ కార్యాలయ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం పోలీస్‌ క్లియెరెన్స్‌ అందిన 3–4 రోజుల్లో పాస్‌పోర్టును జారీ చేస్తున్నామని, పోలీసులు సైతం వెరిఫికేషన్‌ను సత్వరం పూర్తి చేస్తున్నారన్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top