పేదల వైద్యుడికి కరోనా పాజిటివ్‌

Doctor Got Coronavirus At Hyderabad - Sakshi

ఓ కానిస్టేబుల్‌కు కూడా..

గ్రేటర్‌లో కొనసాగుతున్న కరోనా కేసులు

సాక్షి, హైదరాబాద్, అబిడ్స్, ఉప్పల్‌: గ్రేటర్‌ హైదరాబాద్‌లో కరోనా వైరస్‌ ఉధృతి ఇంకా కొనసాగుతూనే ఉంది. శుక్రవారం ఐదు పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీరిలో పేదలకు ఉచితంగా వైద్యం చేసే ఓ డాక్టర్‌ కూడా ఉన్నారు. ఆగాపురా ప్రాంతంలో నివసిస్తున్న ఈ వైద్యుడు.. ఇటీవల విపరీతమైన జ్వరం, తలనొప్పి రావడంతో అపోలో ఆస్పత్రిలో అడ్మిట్‌ అయ్యారు. అక్కడ కరోనా పాజిటివ్‌ తేలడంతో ఆయన్ను గాంధీ ఆస్పత్రికి తరలించారు. గత కొన్నేళ్లుగా ఆగాపురా, ఉస్మాన్‌గంజ్‌ ప్రాంతాల్లో ఆయన క్లినిక్‌లు నిర్వహిస్తూ.. వలస కూలీలు, హమాలీలు, పేద ప్రజలకు ఉచితంగా వైద్యసేవలు అందిస్తున్నారు.

ఆ డాక్టర్‌కు పాజిటివ్‌ రావడంతో ఆయన తల్లి, భార్య, ఇద్దరు పిల్లలు, వారింట్లో అద్దెకు ఉంటున్న మరో నలుగురు వ్యక్తులను అధికారులు హోం క్వారంటైన్‌ చేశారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో క్లినిక్‌లు తెరవకుండా ఇంట్లోనే ఉంటున్నప్పటికీ, పలుమార్లు నాంపల్లి మార్కెట్‌కు వెళ్లి వచ్చారని ఆ వైద్యుడి కుటుంబ సభ్యులు తెలిపారు. మరోవైపు మేడిపల్లి పోలీస్‌స్టేషన్‌కు చెందిన క్రైం విభాగంలో పనిచేసే ఓ కానిస్టేబుల్‌కు కరో నా వైరస్‌ సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో ఆయనకు సన్నిహితంగా మెలిగిన పో లీసు సిబ్బంది సహా కుటుంబ సభ్యులు మొత్తం 18 మందిని హోం క్వారంటైన్‌ చేశారు.

మరో 47 కంటైన్మెంట్‌ జోన్ల ఎత్తివేత 
గ్రేటర్‌లో ఇప్పటివరకు 151 కంటైన్మెంట్‌ జోన్లు ఏర్పాటు చేయగా, వీటిలో ఇప్పటికే సగానికిపైగా ఎత్తివేశారు. తాజాగా శుక్రవారం మరో 47 కంటైన్మెంట్‌ జోన్లను ఎత్తివేసినట్లు జీహెచ్‌ఎంసీ ప్రకటించింది. ఆయా జోన్ల పరిధిలో గత 14 రోజుల నుంచి ఒక్క పాజిటివ్‌ కేసు కూడా నమోదు కాకపోవడం వల్లే వాటిని కంటైన్మెంట్‌ పరిధి నుంచి ఎత్తేసినట్లు తెలిపింది. కాగా, కరోనా వైరస్‌ నియంత్రణ కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను పరిశీలించేందుకు హైదరాబాద్‌ వచ్చిన కేంద్ర బృందం శుక్రవారం పేట్లబురుజు ప్రభుత్వ ప్రసూతి ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించింది. అనంతరం ఎర్రమంజిల్, సోమాజిగూడలోని వలస కూలీలు.. వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ఆరా తీసింది. తర్వాత ఉప్పల్‌ ఫింగర్‌ ప్రింట్‌ అండ్‌ డయాగ్నోసెంటర్‌ను సందర్శించింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top