‘మద్దతు’ తేలేనా? | discussions on support price of sugarcane | Sakshi
Sakshi News home page

‘మద్దతు’ తేలేనా?

Nov 12 2014 11:49 PM | Updated on Sep 2 2017 4:20 PM

చెరకు మద్దతు ధరపై నెలకొన్న ప్రతిష్టంభన తొలగడం లేదు.

సాక్షి, సంగారెడ్డి: చెరకు మద్దతు ధరపై నెలకొన్న ప్రతిష్టంభన తొలగడం లేదు. చెరకు సీజన్ ఆరంభానికి ముందే ధర ఖరారు చేయాలంటూ రైతులు పట్టుబడుతుండగా, వారు కోరినంత ధర చెల్లించడం సాధ్యం కాదని ఫ్యాక్టరీల యాజమాన్యాలు చెబుతున్నాయి. టన్ను చెరకుకు రూ.3,500 ఇవ్వాలని రైతులు, రైతు సంఘాలు డిమాండ్ చేస్తుండగా, అంత మొత్తం చెల్లిస్తే తమకు నష్టాలు తప్పవని చక్కెర పరిశ్రమ యాజమాన్యాలు చెబుతున్నాయి.

మద్దతు ధర ఖరారు కానప్పటికీ  సంగారెడ్డి మండలంలోని గణపతి షుగర్స్ గురువారం నుంచి క్రషింగ్ ప్రారంభించనుంది. జహీరాబాద్‌లోని ట్రైడెంట్ షుగర్స్, మెదక్‌లోని నిజాం దక్కన్ షుగర్స్ సైతం క్రషింగ్ సన్నద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో చెరకు మద్దతు ధర అంశంపై రైతులు పట్టును బిగించే ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవలే మద్దతు ధరపై గణపతి షుగర్స్‌తో రైతులు, భారతీయ కిసాన్ సంఘ్ ప్రతినిధులు జరిపిన చర్చలు విఫలమయ్యాయి.

 దీంతో మంగళవారం భారతీయ కిసాన్ సంఘ్ రాష్ట్ర అధ్యక్షుడు అంజిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు నర్సింహ్మారెడ్డి జేసీ శరత్ ను కలిసి మద్దతు ధర విషయమై రైతులకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. జేసీ శరత్ గురువారం జిల్లాలోని మూడు చక్కెర పరిశ్రమల యాజమాన్యాలు, చెరకు రైతులు, రైతు సంఘాల ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేశారు. దీంతో ప్రస్తుతం చెరకు రైతుల దృష్టంతా గురువారం జరగనున్న చర్చలపై పడింది. జేసీతో జరిగే చర్చల్లో తాము ఆశించిన మద్దతు ధర ఖరారు అవుతుందేమోనని రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు.  

 మూడేళ్లుగా ఇదే తంతు...
 చెరకు మద్దతు ధర ఖరారుపై మూడేళ్లుగా జిల్లాలో ఇదే తంతు కొనసాగుతోంది. చెరకు క్రషింగ్ సీజన్ ప్రారంభానికి ముందే తాము కోరిన మేర మద్దతు ధర చెల్లించాలని పట్టుబట్టడం, చక్కెర పరిశ్రమ యాజమాన్యాలు నిరాకరించడం జరుగుతూ వస్తోంది. పలు సందర్భాల్లో రైతులు చెరకు ఫ్యాక్టరీల ఎదుట ఆందోళనలకు సైతం దిగారు.

కాగా ఈ ఏడాది చెరకు రైతులు టన్నుకు రూ.3,500 చెల్లించాలని కోరుతున్నారు. గతంలో కంటే సాగు వ్యయం పెరగడం, వర్షాభావం, కరెంటు కోతల కారణంగా దిగుబడి తగ్గిన నేపథ్యంలో రైతులు తాము ఆశించిన ధర చెల్లించాలని కోరుతున్నారు. కానీ యాజమాన్యాలు మాత్రం రూ.2,600 చెల్లించేందుకు సముఖత వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement