breaking news
Support price for sugarcane
-
మద్దతు కోసం రాస్తారోకో
చెరకు ‘మద్దతు’ కోసం అఖిలపక్షం నాయకుల ఆధ్వర్యంలో రైతన్నలు రోడ్డెక్కారు.. జిల్లాలోని ఇతర ఫ్యాక్టరీల మాదిరిగానే ఎన్డీఎస్ఎల్లో కూడా టన్నుకు రూ. 2,600 చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆదివారం రాస్తారోకో చేపట్టారు. అన్నదాతలకు న్యాయం జరిగేవరకూ కదిలేది లేదంటూ మాజీ మంత్రి సునీతాలక్ష్మారెడ్డి భీష్మించుకు కూర్చున్నారు. ఈ సమయంలో డీఎస్పీ రాజారత్నంతో వాగ్వాదం చోటు చేసుకుంది. చివరకు ఆర్డీఓ నగేష్ హామీతో ఆందోళనకారులు శాంతించారు. జిల్లాలోని ఇతర ఫ్యాక్టరీల మాదిరిగానే మండల పరిధిలోని మంభోజిపల్లి శివారులో గల నిజాం దక్కన్ షుగర్స్(ఎన్డీఎస్ఎల్)లో టన్ను చెరుకుకు రూ.2,600 మద్దతు ధర ఇవ్వాలంటూ అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆదివారం ఆందోళన చేపట్టారు. డీసీసీ అధ్యక్షురాలు, మాజీ మంత్రి సునీతాలక్ష్మారెడ్డి హాజరై రైతులనుద్దేశించి మాట్లాడుతూ... వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఫ్యాక్టరీని ప్రభుత్వ పరం చేసుకోవాలని హౌస్ కమిటీ ద్వారా తీర్మానం చేసినట్లు తెలిపారు. 2013లో సైతం కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో ఫ్యాక్టరీని వెంటనే ప్రభుత్వ పరం చేయాలని నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. అనంతరం టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలు గడుస్తున్నా చెరుకు రైతుల గురించి పట్టించుకున్న పాపాన పోలేదని ఆరోపించారు. గతంలో సైతం ఈ ఫ్యాక్టరీ ప్రభుత్వ, ప్రైవేట్ సంయుక్త ఆధీనంలో నడిచిందని ఏనాడు ఇతర ఫ్యాక్టరీల కన్నా తక్కువ ధర ఇచ్చిన సందర్భాలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. టన్ను చెరుకుకు రూ. 2,600 చెల్లించాలని ఎన్డీఎస్ఎల్ జీఎం నాగరాజును కోరారు. దీనిపై జీఎం స్పందిస్తూ.. మిగతా ఫ్యాక్టరీల మాదిరిగా తాము ధర ఇవ్వలేమని 2014 జూన్‌లోనే ప్రభుత్వానికి విన్నవించినట్లు తెలిపారు. ప్రభుత్వం ఇన్సెంటివ్ ఇస్తే తప్ప ఇతర ఫ్యాక్టరీల మాదిరిగా ఇవ్వలేమని తేల్చిచెప్పారు. ఈ సమాధానంతో మండిపడ్డ మాజీమంత్రి సునీతాలక్ష్మారెడ్డి అఖిలపక్ష నాయకులు, రైతులతో కలిసి రోడ్డుపై బైఠాయించారు. గంటన్నరపాటు రాస్తారోకో... మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ ఎన్డీఎస్ఎల్ ఫ్యాక్టరీ ముందుగల నర్సాపూర్ - మెదక్ ప్రధాన రహదారిపై సుమారు గంటన్నర పాటు బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ధర్నా విరమించాలంటూ రూరల్ సీఐ రామకృష్ణ, ఆర్డీఓ కార్యాలయ ఏఓ కృష్ణారెడ్డి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఈ క్రమంలో మెదక్‌కు వస్తున్న డీఎస్పీ రాజరత్నం వాహనం దిగి సునీతాలక్ష్మారెడ్డి దగ్గరకు చేరుకున్నారు. రాస్తారోకోకు అనుమతి లేదని, వెంటనే ఖాళీ చేసి వెళ్లాలని పేర్కొన్నారు. దీనిపై స్పందించిన ఆమె రైతులకు న్యాయం జరిగే వరకూ కదిలేది లేదని స్పష్టం చేశారు. దీంతో వాహనాలను మాచవరం మీదుగా దారి మళ్లించాలని అక్కడే ఉన్న సీఐకి డీఎస్పీ ఆదేశాలు జారీ చేశారు. ఆందోళనకారులు ఆ రహదారిపై కూడా నిరసనకు దిగడంతో డీఎస్పీ, సునీతల మధ్య చిన్నపాటి వాగ్వాదం చోటుచేసుకుంది. ఆర్డీఓ నగేష్‌గౌడ్‌కు ఫోన్ చేసిన రెవెన్యూ అధికారులు సునీతాలక్ష్మారెడ్డితో మాట్లాడించారు. సమస్యను వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డితో పాటు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని ఆర్డీఓ హామీ ఇవ్వడంతో ఆందోళనకారులు శాంతిచారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష నాయకులు టీపీసీసీ రాష్ట్రకార్యదర్శి సుప్రభాతరావు, సీడీసీ చైర్మన్ నరేంద్రరెడ్డి, డీసీసీ ఉపాధ్యక్షుడు మామిండ్ల ఆంజనేయులు, కొల్చారం జడ్పీటీసీ శ్రీనివాస్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ చంద్రపాల్, ఏడుపాయల దేవాలయ చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి బీజేపీ నాయకులు గడ్డం శ్రీనివాస్, నందారెడ్డి, నాయకులు బీమరి శ్రీనివాస్, కిషన్‌గౌడ్, మదుసుధన్‌రావు. నాగిరెడ్డి, హఫీజొద్దీన్ తదితరులు పాల్గొన్నారు. -
‘మధుకాన్’ వద్ద రైతుల ధర్నా
నేలకొండపల్లి : చెరకు మద్దతు ధర పెంచాలని కోరుతూ మధుకాన్ షుగర్ ఫ్యాక్టరీ వద్ద రైతులు ఆందోళనను కొనసాగిస్తున్నారు. క్రషింగ్‌ను శుక్రవారం చేపట్టాలని యాజమాన్యం నిర్ణయించగా దానిని అడ్డుకోవాలని రైతులు యత్నిస్తున్నారు. రెండురోజులుగా కొనసాగుతున్న ఈ నిరసనలో భాగంగా ఫ్యాక్టరీ వద్ద గురువారం ధర్నా నిర్వహించారు. క్రషింగ్ కోసం చెరకు లోడ్‌తో శంకరగిరితండా నుంచి వస్తున్న ట్రాక్టర్‌ను అడ్డుకున్నారు. టన్ను చెరకుకు రూ.3 వేలు చెల్లించాలని రైతులు నినాదాలు చేశారు. కూసుమంచి సీఐ రవీందర్‌రెడ్డి అక్కడికి చేరుకుని రైతు సంఘాల నాయకులతో చర్చించారు. రోడ్డుపై వచ్చిన తర్వాత ట్రాక్టర్‌ను ఆపడం సరికాదని ఆయన అన్నారు. వాదోపవాదాల తర్వాత రైతులు ట్రాక్టర్‌ను ఫ్యాక్టరీ లోపలికి పంపారు. అనంతరం సమావేశం నిర్వహించారు. క్రషింగ్‌ను అడ్డుకునేందుకు తీసుకోవాల్సిన అంశాలపై చర్చించారు. ఇదిలా ఉండగా శుక్రవారం చేపట్టే క్రషింగ్‌ను పోలీసు పహారా నడుమనైనా నిర్వహించాలని మధుకాన్ యాజమాన్యం భావిస్తున్నట్లు తెలిసింది. -
‘మద్దతు’ తేలేనా?
సాక్షి, సంగారెడ్డి: చెరకు మద్దతు ధరపై నెలకొన్న ప్రతిష్టంభన తొలగడం లేదు. చెరకు సీజన్ ఆరంభానికి ముందే ధర ఖరారు చేయాలంటూ రైతులు పట్టుబడుతుండగా, వారు కోరినంత ధర చెల్లించడం సాధ్యం కాదని ఫ్యాక్టరీల యాజమాన్యాలు చెబుతున్నాయి. టన్ను చెరకుకు రూ.3,500 ఇవ్వాలని రైతులు, రైతు సంఘాలు డిమాండ్ చేస్తుండగా, అంత మొత్తం చెల్లిస్తే తమకు నష్టాలు తప్పవని చక్కెర పరిశ్రమ యాజమాన్యాలు చెబుతున్నాయి. మద్దతు ధర ఖరారు కానప్పటికీ సంగారెడ్డి మండలంలోని గణపతి షుగర్స్ గురువారం నుంచి క్రషింగ్ ప్రారంభించనుంది. జహీరాబాద్‌లోని ట్రైడెంట్ షుగర్స్, మెదక్‌లోని నిజాం దక్కన్ షుగర్స్ సైతం క్రషింగ్ సన్నద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో చెరకు మద్దతు ధర అంశంపై రైతులు పట్టును బిగించే ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవలే మద్దతు ధరపై గణపతి షుగర్స్‌తో రైతులు, భారతీయ కిసాన్ సంఘ్ ప్రతినిధులు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో మంగళవారం భారతీయ కిసాన్ సంఘ్ రాష్ట్ర అధ్యక్షుడు అంజిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు నర్సింహ్మారెడ్డి జేసీ శరత్ ను కలిసి మద్దతు ధర విషయమై రైతులకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. జేసీ శరత్ గురువారం జిల్లాలోని మూడు చక్కెర పరిశ్రమల యాజమాన్యాలు, చెరకు రైతులు, రైతు సంఘాల ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేశారు. దీంతో ప్రస్తుతం చెరకు రైతుల దృష్టంతా గురువారం జరగనున్న చర్చలపై పడింది. జేసీతో జరిగే చర్చల్లో తాము ఆశించిన మద్దతు ధర ఖరారు అవుతుందేమోనని రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు. మూడేళ్లుగా ఇదే తంతు... చెరకు మద్దతు ధర ఖరారుపై మూడేళ్లుగా జిల్లాలో ఇదే తంతు కొనసాగుతోంది. చెరకు క్రషింగ్ సీజన్ ప్రారంభానికి ముందే తాము కోరిన మేర మద్దతు ధర చెల్లించాలని పట్టుబట్టడం, చక్కెర పరిశ్రమ యాజమాన్యాలు నిరాకరించడం జరుగుతూ వస్తోంది. పలు సందర్భాల్లో రైతులు చెరకు ఫ్యాక్టరీల ఎదుట ఆందోళనలకు సైతం దిగారు. కాగా ఈ ఏడాది చెరకు రైతులు టన్నుకు రూ.3,500 చెల్లించాలని కోరుతున్నారు. గతంలో కంటే సాగు వ్యయం పెరగడం, వర్షాభావం, కరెంటు కోతల కారణంగా దిగుబడి తగ్గిన నేపథ్యంలో రైతులు తాము ఆశించిన ధర చెల్లించాలని కోరుతున్నారు. కానీ యాజమాన్యాలు మాత్రం రూ.2,600 చెల్లించేందుకు సముఖత వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.