నామినేషన్ల ఘట్టం.. నేటితో సమాప్తం..

To Day Last Date For Nominations - Sakshi

ఇప్పటివరకు 55 మంది.. 68 నామినేషన్లు

చివరిరోజు పోటెత్తనున్న నామినేషన్లు..

నామినేషన్‌ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు

రేపు పరిశీలన.. 22న ఉపసంహరణ

ముందస్తు ఎన్నికలకు నామినేషన్ల ఘట్టం సోమవారంతో ముగియనుంది. ఈనెల 12న నోటిఫికేషన్‌ విడుదల కాగా.. అదే రోజు నుంచి నామినేషన్లు మొదలయ్యాయి. ప్రధానపార్టీలు అన్ని స్థానాలకు టికెట్లు ఖరారు చేయని కారణంగా ఆయా పార్టీల నుంచి నామినేషన్లు ఆశించిన మేరకు దాఖలు కాలేదు. శనివారం వరకు జిల్లాలోని నాలుగు అసెంబ్లీ స్థానాలకు 55 మంది 68 సెట్లలో నామినేషన్లు వేశారు. సెప్టెంబర్‌ 6న టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ తొలి జాబితాలో 107 మందిని ప్రకటించగా.. అందులో చొప్పదండి మినహా మూడు నియోజకవర్గాలకు సిట్టింగ్‌లనే అభ్యర్థులుగా ఖరారు చేశారు. రెండురోజుల కిందటే చొప్పదండికి అభ్యర్థిని ఖరారు చేశారు. అదే విధంగా కాంగ్రెస్, బీజేపీ తదితర పార్టీలు కూడా అభ్యర్థులను ప్రకటించాయి. 12 నుంచి నామినేషన్ల పర్వం మొదలు కాగా ప్రధాన పార్టీల అభ్యర్థులు పలువురు వేశారు. అయినప్పటికీ ఆఖరిరోజు నాలుగు నియోజకవర్గాల్లో నామినేషన్లు పోటెత్తనున్నాయి. ఈ మేరకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.      

సాక్షి, కరీంనగర్‌ : తొలి జాబితాలో మంత్రి ఈటల రాజేందర్‌ (హుజూరాబాద్‌), గంగుల కమలాకర్‌ (కరీంనగర్‌), రసమయి బాలకిషన్‌ (మానకొండూరు) ఉండగా.. నాలుగు రోజుల క్రితం చొప్పదండికి సుంకె రవిశంకర్‌ను ప్రకటించారు. ఇప్పటికే నామినేషన్ల ప్రారంభం రోజే హుజూరాబాద్‌లో మంత్రి ఈటల రాజేందర్‌ తరఫున ఆయన సతీమణి ఈటల జమునారెడ్డి నామినేషన్‌ దాఖలు చేశారు. కాంగ్రెస్‌ అభ్యర్థిగా మొదటి సెట్‌ను వేసిన పాడి కౌశిక్‌రెడ్డి తరఫున శనివారం ఆయన సతీమణి శాలినీరెడ్డి మరోసెట్‌ దాఖలు చేశారు. కరీంనగర్‌లో గంగుల కమలాకర్‌ (టీఆర్‌ఎస్‌), పొన్నం ప్రభాకర్‌ (కాంగ్రెస్‌), బండి సంజయ్‌కుమార్‌ (బీజేపీ) నామినేషన్లు వేశారు. చొప్పదండిలో మేడిపల్లి సత్యం (కాంగ్రెస్‌), సుంకె రవిశంకర్‌ ఒక్కో సెట్‌ దాఖలు చేశారు. 

మంచిరోజు, చివరి రోజు కావడంతో మళ్లీ పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించి బీ ఫారంతో కలిపి ఇప్పటివరకు నామినేషన్‌ వేయని, వేసిన ప్రధాన పార్టీల అభ్యర్థులు సైతం మరో సెట్‌లో వేసేందుకు నామినేషన్‌ వేసేందుకు ముహూర్తం కుదుర్చుకున్నారు. హుజూరాబాద్‌ నుంచి పాడి కౌశిక్‌రెడ్డి, కరీంనగర్‌లో గంగుల కమలాకర్, పొన్నం ప్రభాకర్, మానకొండూరులో రసమయి బాలకిషన్‌ (టీఆర్‌ఎస్‌), ఆరెపెల్లి మోహన్‌ (కాంగ్రెస్‌) భారీ జనంతో నామినేషన్లు వేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. చొప్పదండి నుంచి సుంకె రవిశంకర్‌ (టీఆర్‌ఎస్‌), బొడిగ శోభ (బీజేపీ) కూడా సోమవారం నామినేషన్‌ వేయనున్నట్లు ప్రకటించారు. ఇదే సమయంలో ఇతర పార్టీల అభ్యర్థులు, రెబెల్స్, స్వతంత్రులు కూడా నామినేషన్లు వేయనుండగా..  పోలీసులు భారీ భద్రతా, బందోబస్తు ఏర్పాటు చేశారు. 

రేపు నామినేషన్ల పరిశీలన... 22న ఉప సంహరణ
అసెంబ్లీ ఎన్నికల నామినేషన్లకు నేటితో తెరపడనుండగా.. శనివారం నాటికి 55 మంది వివిధ పార్టీలు, ఇండిపెండెంట్‌ అభ్యర్థులు 68 సెట్లలో దాఖలు చేశారు. 20న నామినేషన్ల పరిశీలన, 22 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువుంది. డిసెంబర్‌ 7న ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో 23 నుంచి ఎన్నికల ప్రచారం హోరెత్తనుండగా.. ఎన్నికల సంఘం ఇప్పటికే ప్రచారసరళిపై నిఘా ముమ్మరం చేసింది. డిసెంబర్‌ 7న అసెంబ్లీ స్థానాలకు పోలింగ్‌ జరగనుండగా.. అదేనెల 11న ఓట్ల లెక్కింపు, ఫలితాలు ఉంటాయి. ఈ నేపథ్యంలో ఆదివారం వరకు ఢిల్లీ, హైదరాబాద్‌లో టికెట్ల కోసం క్యూకట్టిన కొందరు నేతలు.. సోమవారం నాలుగు నియోజకవర్గాల నుంచి నామినేషన్లు వేసేందుకు నియోజకవర్గ కేంద్రాల్లో బారులు తీరనున్నారు. ముందస్తుపోరులో ఉండే ప్రధాన పార్టీల అభ్యర్థులందరూ దాదాపుగా సోమవారమే నామినేషన్లు వేయనుండటంతో నామినేషన్‌ కేంద్రాల్లో సందడి నెలకొననుంది. ఎమ్మెల్యే అభ్యర్థులు నియోజకవర్గం కేంద్రంలో తహసీల్‌దారు/ఆర్‌డీవో కార్యాలయాల్లో నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉండగా.. నామినేషన్‌ పత్రాలపై ఆదివారం రాత్రే కసరత్తుపూర్తి చేశారు. ముహూర్తం కోసం ఎదురుచూసిన అభ్యర్థులు చివరిరోజు నామినేషన్లకు సిద్ధం కావడం స్థానికంగా చర్చనీయాంశం అవుతోంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top